పార్వతీపురం మన్యం జిల్లాలోని పార్వతీపురం, సాలూరు నియోజకవర్గాల్లో పేదల సొంతింటి కల ఇంకా అటకెక్కే ఉంది. గత ప్రభుత్వ హయాంలో పార్వతీపురం మండలం అడ్డాపుశిల, సాలూరు మున్సిపాలిటీ పరిధిలో భారీ ఎత్తున టిడ్కో ఇళ్లను నిర్మించారు. మొత్తం 1,983 మంది లబ్ధిదారులకు ఈ ఇళ్లను మంజూరు చేశారు. భవనాల నిర్మాణం పూర్తయి వెలుగులీనుతున్నా.. లోపల ఉండాల్సిన లబ్ధిదారులు మాత్రం ఇంకా అద్దె ఇళ్లలోనే కాలం వెళ్లదీస్తున్నారు.
కేవలం గోడలు కట్టి రంగులు వేశారు. అక్కడ మనుషులు ఉండాలంటే కనీస మౌలిక వసతులు కల్పించలేదు. డ్రైనేజీ వ్యవస్థ లేదు, తాగునీటి సౌకర్యం లేదు, విద్యుత్ కనెక్షన్లు సరిగ్గా లేవు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఇళ్లు సిద్ధంగా ఉన్నా లబ్ధిదారులు లోపలికి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఈ నిర్మానుష్య వాతావరణాన్ని అదనుగా చేసుకున్న ఆకతాయిలు, ఇక్కడ అసాంఘిక కార్యకలాపాలకు తెరలేపుతున్నారు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా టిడ్కో ప్రాంగణాలు మందుబాబులకు, జూదరులకు అడ్డగా మారుతున్నాయి.
డబ్బులు కట్టినా ఇళ్లు రాకపోవడం, మరోవైపు చెల్లించిన సొమ్ములో కేవలం 30 లక్షలు మాత్రమే వెనక్కి ఇచ్చి అధికారులు చేతులు దులుపుకోవడంపై లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే, కూటమి ప్రభుత్వ హయాంలోనైనా తమకు న్యాయం జరుగుతుందని వారు ఆశిస్తున్నారు. మరోవైపు అధికారుల వెర్షన్ కూడా సానుకూలంగానే వినిపిస్తోంది. వచ్చే రెండు నెలల్లో మౌలిక వసతుల పనులన్నీ పూర్తి చేసి, ఇళ్లను లబ్ధిదారులకు అప్పగిస్తామని అధికారులు హామీ ఇస్తున్నారు. మరి ఈసారైనా పేదల సొంతింటి కల నిజమవుతుందో లేదో వేచి చూడాలి.




Total views : 62065