టీడీపీ అధినేత చంద్రబాబు రాజమండ్రి జైలు నుంచి విడుదలయ్యారు. అనారోగ్య కారణాలతో హైకోర్టు ఆయనకు 4 వారాల మధ్యంర బెయిల్ ఇచ్చింది. స్కిల్ స్కాం కేసులో సెప్టెంబర్ 9న అరెస్టైన బాబు 52 రోజుల అనంతరం బయటకొచ్చారు. బయటకు వచ్చిన చంద్రబాబును చూసి టీడీపీ శ్రేణుల్లో భావోద్వేగాలు మిన్నంటాయి. జై చంద్రబాబు నినాదాలతో జైలు పరిసరాలు మార్మోగిపోయాయి. అనంతరం చంద్రబాబు తెలుగు ప్రజలందరికీ అభినందనలు తెలిపారు. తాను కష్టంలో ఉన్నపుడు తన కోసం ప్రజలు సంఘీభావం తెలిపారన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు చూపించిన అభిమానం జీవితంలో మర్చిపోనన్నారు. 45సంవత్సరాల తన జీవింతంలో ఏ తప్పూ చేయలేదని.. చేయబోనని అన్నారు. జనసేనకు, పవన్ కళ్యాణ్ కు, సహకరించిన ఇతర పార్టీలకు అభినందనలు తెలియజేస్తున్నానన్నారు.
Tdp
చంద్రబాబుకు కండీషనల్ బెయిల్ మాత్రమే ఇచ్చారని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. మధ్యంతర బెయిల్ రాగానే టీడీపీ సంబరాలు జరుపుకోవడంలో అర్థం లేదని మండిపడ్డారు. స్కిల్ స్కామ్ లో చంద్రబాబు పాత్ర స్పష్టంగా ఉందన్నారు. చంద్రబాబు మాజీ పీఎస్ పెండ్యాల శ్రీనివాస్ ను విచారిస్తే అన్ని విషయాలు బయటికి వస్తాయిని తెలిపారు. మధ్యంతర బెయిల్ రాగానే నిజం గెలిచినట్టా అని సజ్జల ప్రశ్నించారు. బెయిల్ రాగానే నిజం ఎక్కడ గెలిచినట్లు అని… ఇది విజయోత్సవాలు జరుపాల్సిన సందర్భమేనా అంటూ ప్రశ్నించారు. చికిత్స చేయించుకోవడానికి మాత్రమే చంద్రబాబుకు బెయిల్ ఇచ్చారు. చంద్రబాబు జైలులో ఉన్నా .. బయట ఉన్నా ఒకటే అని వ్యాఖ్యానించారు. చిన్న వ్యాధిని కూడా పెద్దగా చూపించి … సానుభూతి పొందే ప్రయత్నం చస్తున్నారని అన్నారు. నిజంగా చంద్రబాబు అనారోగ్యంగా ఉంటే చికిత్స చేయించుకోవాలని అన్నారు. చికిత్స తర్వాత చంద్రబాబు జైలుకెళ్లాల్సిందేనని చెప్పారు.
టిడిపి అధినేత మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు హైకోర్టులో బెయిల్ లభించడంపై పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురంలో టిడిపి నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ భారీ ప్రదర్శనగా సంబరాలు నిర్వహించారు. బాణసంచా కాలుస్తూ జై బాబు జై జై బాబు నిజం గెలిచింది న్యాయం గెలిచిందంటూ కేరింతల కొడుతూ సంబరాలు జరుపుకున్నారు. నరసాపురం పట్టణంలోని అంబేద్కర్ సెంటర్లో చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా టిడిపి నరసాపురం ఇన్చార్జి పొత్తూరి రామరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన పోవాలని రాష్ట్ర ప్రజలంతా కోరుకుంటున్నారని చంద్రబాబుకు బెయిల్ రావడంతో రాష్ట్రంలోని ప్రజలంతా సంబరాలు జరుపుకుంటున్నారని రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రిగా ప్రజలందరూ చంద్రబాబునే కోరుకుంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.
మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మద్యంతర బెయిల్ లభించడంతో సాయంత్రం 4గంటలకు విడుదల కానున్నారు.ఈ సందర్భంగా నందిగామ తెలుగుదేశం పార్టీ ఎమ్ఎల్ఎ అభ్యర్థి తంగిరాల సౌమ్య ఆద్వర్యంలో భారీ ఎత్తున బాణసంచా కాలుస్తూ ఒకరి కొకరు స్వీట్లు తినిపించుకుంటూ సంబరాలు జరుపుకున్నారు. మహిళలు ఆనందంతో నృత్యాలు చేశారు. దేశం పార్టీ కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సౌమ్య మాట్లాడుతూ న్యాయమే గెలిచింది. చంద్రబాబు నాయుడు కడిగిన ముత్యం లా బయటికి వస్తారని అన్నారు. సింహం బయటకు వచ్చింది. వైసీపీకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని ఆమె అన్నారు. చంద్రబాబు నాయుడు కు బెయిల్ రావడం చాలా సంతోషంగా ఉందని ముందుంది ముసళ్ళ పండుగ. వైసీపీ ప్రజలు ఓటుతోనే ప్రజలు బుద్ధి చెప్తారని తంగిరాల సౌమ్య అన్నారు.
నిజం గెలిసింది కాబట్టే చంద్రబాబు నాలుగు వరాల పాటు మధ్యంతర బెయిల్ పై బయటకు వస్తున్నారని. జగన్ జైల్లో ఉన్నాడని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. చంద్రబాబుని కూడా జైల్లో పెట్టాలని కుట్రపన్ని జైల్లో పెట్టించారని. అరెస్ట్ చేయించి ఆధారాలు లేకుండా కాలయాపన చేశారని. తమ నాయకుడు బయటికి రావడం పై హర్షం వ్యక్తం చేస్తున్నామంటున్నా టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూతో మా కాకినాడ జిల్లా ప్రతినిధి నందిని ఫేస్ టు ఫేస్.
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుకు ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిలు మంజూరు చేయడంపై రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. మిఠాయిలు పంచుకుంటూ, బాణాసంచా పేలుస్తూ కార్యకర్తలు, నాయకులు సంతోషంలో మునిగిపోయారు. రాజమండ్రి, హిందూపురం సహా రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ అభిమానులు, కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి సంతోషాన్ని పంచుకుంటున్నారు. టపాసులు కాలుస్తూ హోరెత్తిస్తున్నారు. అన్నమయ్య జిల్లా టిటిడి మాజీ పాలకవర్గ సభ్యులు తెలుగుదేశం పార్టీ నాయకులు సుగువాసి ప్రసాద్ బాబు ఆధ్వర్యంలో రాయచోటి పట్టణం మాండవ్య నది ఒడ్డున వెలిసియున్న శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో 101 టెంకాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరైన తర్వాత వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు స్పందిస్తూ సీఎం జగన్ పై మండిపడ్డారు. జైలు నుంచి చంద్రబాబు ప్రాణాలతో బయటపడ్డారని… మరికొన్ని రోజులు జైల్లో ఉంటే ఆయన ప్రాణాలకు ఈ దుర్మార్గులు హాని కలిగించే వారని అన్నారు. కొన్ని గంటల్లో చంద్రబాబు జైలు నుంచి బయటకు రానున్నారని చెప్పారు. తనపై కూడా ఈ దుర్మార్గమైన ముఖ్యమంత్రి జగన్ 16 నుంచి 18 కేసులు పెట్టించాడని మండిపడ్డారు. తాను విడుదలైన తర్వాత తిరుమల వెంకన్నను దర్శించుకోవాలనుకున్నానని… అయితే, ఆ దేవున్ని కూడా తనకు ఈ ముఖ్యమంత్రి దూరం చేశాడని అన్నారు. చంద్రబాబు విషయంలో న్యాయమూర్తి ద్వారా వెంకటేశ్వరస్వామి న్యాయాన్ని పలికించారని రఘురాజు చెప్పారు. వెంకటేశ్వరస్వామిని చంద్రబాబు దర్శనం చేసుకుని, ఆసుపత్రిలో చికిత్స చేయించుకుని, నూతనోత్తేజంతో మళ్లీ ప్రజల మధ్య అడుగు పెట్టాలని కోరుకుంటున్నానని అన్నారు. ఆయనను బాధ పెట్టిన అందరినీ రాజకీయంగా కడతేర్చాలని కోరుకుంటున్నానని చెప్పారు. వెంకన్న స్వామిని దర్శనం చేసుకుంటే అంతా మంచే జరుగుతుందని… తాను తిరుమల వెంకన్నను దర్శనం చేసుకోలేక అమెరికాలోని వెంకటేశ్వరస్వామి దేవాలయాన్నీ తిరిగానని అన్నారు. మన దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ఉన్న వెంకన్న ఆలయాలన్నీ ఇప్పటికీ తిరుగుతూనే ఉన్నానని చెప్పారు. తాను ఏపీలోకి ఇప్పుడు అడుగు పెట్టే పరిస్థితి లేదని అన్నారు. చంద్రబాబుకు బెయిల్ వస్తుందని ముందే ఊహించే… లిక్కర్ కేసులో ఆయనపై మరో కేసు పెట్టారని మండిపడ్డారు. ఈ నాలుగు వారాల్లో చంద్రబాబును ఏ కేసులో కూడా అరెస్ట్ చేయలేరని చెప్పారు. చంద్రబాబుపై పెట్టిన ఐదు కేసులూ రెడ్లు పెట్టారని విమర్శించారు. కేసులు కట్టేది కూడా రెడ్డేనని, మధ్యలో కథ నడిపించేందరి సజ్జల రామకృష్ణారెడ్డి అని, పైనుంచి నడిపించేది జగన్ రెడ్డి అని అన్నారు. రెడ్లు తప్ప మరెవరూ లేరని… ఈ విషయాన్ని చెప్పడానికి తాను సంకోచించనని చెప్పారు.
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో టీడీపీ శ్రేణులు ఆనందంలో మునిగిపోయాయి. బెయిల్ మంజూరైన వెంటనే మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయం వద్ద మీడియాతో అచ్చెన్నాయుడు మాట్లాడుతూ… చంద్రబాబు మీద వ్యక్తిగత కక్ష పెట్టుకుని, తప్పు లేకపోయినా కేసులు పెట్టారనే విషయం తెలుగు ప్రజలందరికీ తెలిసి పోయిందని అన్నారు. అక్రమ కేసులు పెట్టి, జైల్లో ఉంచి లబ్ధి పొందాలని జగన్ చూశారని విమర్శించారు. 45 ఏళ్ల రాజకీయ చరిత్రలో చంద్రబాబు చిన్న తప్పు కూడా చేయలేదని… పార్టీలో ఎవరు తప్పు చేసినా ఆయన సహించరని చెప్పారు. మహానుభావుడు చంద్రబాబును ఈ మూర్ఖుడు, ఈ దుర్మార్గుడు జగన్ 52 రోజుల పాటు జైల్లో పెట్టించారని అచ్చెన్న మండిపడ్డారు. బెయిల్ పై హైకోర్టు తీర్పును రిజర్వ్ చేస్తే… రాత్రికి రాత్రే చంద్రబాబుపై లిక్కర్ కేసు పెట్టించిన సైకో అని దుయ్యబట్టారు. చంద్రబాబు అరెస్ట్ జగన్ పతనానికి నాంది అని… బాబు జైలు నుంచి బయటకు అడుగు పెట్టిన క్షణం నుంచే వైసీపీ పతనమవుతుందని చెప్పారు. వైసీపీని బంగాళాఖాతంలో కలుపుతామని వ్యాఖ్యానించారు. హైకోర్టులో ఈరోజు తమకు న్యాయం జరిగిందని అన్నారు. ఇప్పటికే లోకేశ్ బాబు రాజమండ్రిలో ఉన్నారని… తాము కూడా ఇప్పుడు రాజమండ్రికి బయల్దేరుతున్నామని చెప్పారు. రాబోయే రోజుల్లో ఏం చేయాలనేది అందరం కూర్చొని చర్చించి నిర్ణయిస్తామని తెలిపారు.
టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ ప్రభుత్వం మద్యం అనుమతుల కేసు నమోదు చేయడంపై నారా లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కక్ష సాధింపునకు మరో రూపమే జగన్ అని మండిపడ్డారు. కక్ష సాధింపులో నువ్వు ఆంధ్రా గోల్డ్, ప్రెసిడెంట్ మెడల్ బ్రదర్ అంటూ ఘాటుగా స్పందించారు. పిచ్చికి వాడుతున్నట్టే, కక్ష సాధింపు ధోరణికి కూడా మందులు వాడాలని అన్నారు. రాష్ట్రంలో నాసిరకం మద్యం తాగి 35 లక్షల మంది రోగాల బారినపడ్డారని, 30 వేల మంది ప్రాణాలు కోల్పోయారని లోకేశ్ వెల్లడించారు. ఎవరి హయాంలో లిక్కర్ దందా జరుగుతోందో చర్చకు సిద్ధమా? అని సవాల్ విసిరారు. మందుబాబుల తిట్లు వినే ధైర్యం జగన్ కు ఉందా? అని ప్రశ్నించారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయరాదని టీడీపీ హైకమాండ్ నిర్ణయించగా, ఎన్నికల్లో పోటీ చేయాల్సిందేనంటూ తెలంగాణ టీడీపీ నేతలు పట్టుబట్టడం తెలిసిందే. ఈ నేపథ్యంలో, అటు అధిష్ఠానానికి, ఇటు తెలంగాణ టీడీపీ నేతలకు మధ్య తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్ నలిగిపోయారు. తెలంగాణ టీడీపీ నేతల నుంచి ఎదురవుతున్న ఒత్తిళ్లను తట్టుకోలేక కాసాని జ్ఞానేశ్వర్ ఇవాళ టీడీపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. దీనిపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. జ్ఞానేశ్వర్ కు జ్ఞానోదయం అయింది… పవన్ ఎప్పుడు పరిపక్వమవుతాడో? అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. ఇటీవల కూడా అంబటి… తెలంగాణలో చేతులెత్తేసిన తెలుగుదేశం… త్వరలో ఆంధ్రప్రదేశ్ లో కూడా అంటూ ఎద్దేవా చేశారు.





Total views : 89281