తెలంగాణ రైతాంగంపై అకాల వర్షం మరోసారి పిడుగులా పడింది. ఏడాది పొడవునా చెమటోడ్చి పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన రైతులు… ఇప్పుడు ఆ ధాన్యం తడిసి ముద్దవడంతో కన్నీరు మున్నీరవుతున్నారు. మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాల్లో రాత్రికి రాత్రే మారిన వాతావరణం రైతుల ఆశలపై నీళ్లు చల్లింది. టార్పాలు లేక… సరైన షెడ్లు లేక… వర్షపు నీరు నేరుగా ధాన్యంపై పడటంతో రైతులు రాత్రంతా మేల్కొని తమ పంటను కాపాడుకునేందుకు ప్రాణాలు పెట్టి పోరాడారు. కొందరు కుటుంబ సభ్యులతో కలిసి చేతులతోనే నీటిని బయటకు తోడితే… మరికొందరు వడ్లపై తార్పులు కప్పుతూ ఆవేదనతో గడిపారు. ఇప్పటికే కొనుగోలు ఆలస్యం, గన్ని సంచుల కొరతతో ఇబ్బందులు పడుతున్న రైతులకు ఈ అకాల వర్షం తీరని నష్టాన్ని మిగిల్చింది. తడిసిన ధాన్యాన్ని అధికారులు తిరస్కరిస్తారేమోనన్న భయంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రతి గింజను కొనుగోలు చేసి రైతులకు భరోసా ఇవ్వాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.
మెదక్ జిల్లాలో అకాల వర్షం రైతుల కష్టాన్ని కళ్లముందే కొట్టుకుపోయేలా చేసింది. రామాయంపేట, చిన్న శంకరంపేట, నార్సింగి, చేగుంట మండలాల్లో కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉంచిన ధాన్యం భారీ వర్షానికి పూర్తిగా తడిసిపోయింది. రాత్రంతా నిద్ర మానుకుని రైతులు తమ ధాన్యాన్ని కాపాడుకునేందుకు పడిన తాపత్రయం హృదయ విదారకంగా మారింది. ఒకవైపు ఈదురుగాలులు… మరోవైపు కుండపోత వర్షం… అయినా చేతులెత్తేయకుండా రైతులు టార్పాలిన్ పట్టాలు కప్పుతూ, నీటిని తోడుతూ ధాన్యాన్ని రక్షించేందుకు ప్రయత్నించారు. కానీ ప్రకృతి ఆగ్రహం ముందు వారి శ్రమ బలహీనమైపోయింది. పంట అమ్మకంతో అప్పులు తీర్చుకుని కుటుంబాన్ని నిలబెట్టుకోవాలనుకున్న రైతుల ఆశలు ఇప్పుడు నీటిలో కలిసిపోయాయి. తడిసిన ధాన్యం రంగు మారితే కొనుగోలు చేయరేమోనన్న ఆందోళన వారిని మరింత కలవరపెడుతోంది. ఎన్నో కష్టాలు భరించి పండించిన ధాన్యానికి కనీస రక్షణ లేకపోవడం రైతుల్లో తీవ్ర ఆవేదన కలిగిస్తోంది. ప్రభుత్వం వెంటనే నష్టాన్ని అంచనా వేసి రైతులను ఆదుకోవాలని గ్రామాల్లో డిమాండ్ పెరుగుతోంది.
సిద్దిపేట జిల్లాలో అకాల వర్షం రైతాంగాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. గజ్వేల్ నియోజకవర్గ వ్యాప్తంగా కురిసిన భారీ వర్షం రైతుల ఆశలను ఛిన్నాభిన్నం చేసింది. మార్కుక్ మండలం పాములపర్తి గ్రామానికి చెందిన రైతు ఇంటి వద్ద ఆరబోసిన వడ్లు వర్షపు ప్రవాహంలో కొట్టుకుపోవడంతో ఆ కుటుంబం కన్నీటి పర్యంతమైంది. ఎన్నో నెలల కష్టం ఒక్క రాత్రిలోనే నీటిలో కలిసిపోవడం స్థానికులను కదిలించింది. వర్షం మొదలైన వెంటనే రైతులు పరుగులు తీస్తూ ధాన్యాన్ని కాపాడుకునేందుకు ప్రయత్నించినా ప్రకృతి సహకరించలేదు. మరోవైపు గజ్వేల్–భువనగిరి రహదారిపై చెట్లు విరిగి పడటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కుకునూర్‌పల్లి మండలం లకుడారం సమీపంలో పిడుగు పడిన ఘటన భయాందోళన కలిగించింది. ఇప్పటికే కొనుగోలు కేంద్రాల్లో ఆలస్యం, సరైన వసతుల లేమితో ఇబ్బందులు పడుతున్న రైతులకు ఈ వర్షం మరింత మానసిక వేదన మిగిల్చింది. రైతుల కష్టాన్ని అర్థం చేసుకుని ప్రభుత్వం తక్షణ సహాయం అందించాలని బాధిత కుటుంబాలు వేడుకుంటున్నాయి.
సంగారెడ్డి జిల్లాలో కూడా అకాల వర్షం రైతుల జీవితాల్లో విషాదాన్ని నింపింది. కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉంచిన ధాన్యంపై వర్షపు నీరు చేరడంతో రైతులు నిరాశలో మునిగిపోయారు. కనీస రక్షణ చర్యలు లేకపోవడం… తార్పులు, షెడ్లు అందుబాటులో లేకపోవడంతో ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. కొందరు రైతులు రాత్రంతా కేంద్రాల వద్దే ఉండి వడ్లను కాపాడుకునేందుకు ప్రయత్నించగా… మరికొందరు వర్షంలో తడుస్తూనే ధాన్యాన్ని ఎత్తిపోస్తూ గడిపారు. పంట అమ్మకంతో పిల్లల చదువులు, అప్పులు, కుటుంబ అవసరాలు తీర్చుకోవాలనుకున్న రైతులకు ఇప్పుడు భవిష్యత్తుపై ఆందోళన నెలకొంది. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయకపోతే ఎలా అన్న భయం రైతు కుటుంబాలను వెంటాడుతోంది. ఇదిలా ఉండగా సిద్దిపేట మార్కెట్ యార్డును సందర్శించిన జిల్లా కలెక్టర్ హైమావతి రైతులు అధైర్యపడొద్దని భరోసా ఇవ్వడం కొంత ఊరటనిచ్చింది.
తడిసిన ధాన్యాన్ని కూడా పూర్తిస్థాయిలో కొనుగోలు చేస్తామని అధికారుల ప్రకటన రైతుల్లో ఆశలు రేకెత్తిస్తోంది. అయితే మాటల్లో కాదు… చర్యల్లో సహాయం కనిపించాలని రైతులు కోరుతున్నారు.






Total views : 89056