Friday, August 14, 2026
News Navigation
Friday, August 14, 2026
News Navigation

Breaking

Friday, August 14, 2026
Home Devotional తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనార్థం కాలినడకన కొండకు చేరుకునే భక్తుల రక్షణకు టీటీడీ, అటవీశాఖ తీవ్ర కసరత్తు చేస్తున్నాయి.

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనార్థం కాలినడకన కొండకు చేరుకునే భక్తుల రక్షణకు టీటీడీ, అటవీశాఖ తీవ్ర కసరత్తు చేస్తున్నాయి.

by CVR NEWS

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనార్థం కాలినడకన కొండకు చేరుకునే భక్తుల రక్షణకు టీటీడీ, అటవీశాఖ తీవ్ర కసరత్తు చేస్తున్నాయి. అందులో భాగంగా కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత కెమెరాలు, అత్యాధునిక డ్రోన్లతో పహారా కాస్తోంది. ఈ ఆధునిక నిఘా నేత్రాలు వివిధ జంతువుల కదలికలను ఇట్టే పసిగట్టి వాటిని అటవీ ప్రాంతంలోకి తరిమేలా సహాయపడతాయి.చెన్నైకి చెందిన ‘ధీరా’ అనే సంస్థ రూపొందించిన AI కెమెరాలు సౌరశక్తితో పని చేస్తాయి. ఈ కెమెరాలు 360 డిగ్రీల కోణంలో ఉంటూ 400 మీటర్ల దూరంలోని దృశ్యాలనూ సైతం స్పష్టంగా బంధిస్తాయి. ఎలుగుబంటి, చిరుత, వన్యప్రాణుల కదలికలను గుర్తిస్తాయి. అనంతరం ఆ విషయాన్ని వెంటనే మొబైల్‌ యాప్‌, తిరుమలలోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు చేరవేస్తాయి. అంతేగాక కెమెరా వద్ద ఉన్న అలారం సైరన్‌ మోగిస్తుంది. దీంతో ఆ శబ్దాలకు అక్కడ ఉన్న జంతువులు అడవిలోకి వెళ్లిపోతాయి. అప్పటిలోగా సందేశం అందుకున్న అధికారులు అప్రమత్తమై శ్రీవారి భక్తులను సురక్షిత ప్రాంతాలకు మళ్లిస్తారు. ఇలా భక్తుల నడక మార్గంలో రెండు వైపులా 110 నుంచి 125 కెమెరాలను 4 దశల్లో ఏర్పాటు చేయనున్నారు. అందులో భాగంగా మొదటి విడతగా నరసింహస్వామి ఆలయ మార్గంలో 12 కెమెరాలను అమర్చారు.

ఈ కెమెరాలతో పాటు ‘జేరా’ అనే పేరుతో రెండు అత్యాధునిక డ్రోన్లను సైతం టీటీడీ రంగంలోకి దించింది. ఈ డ్లోన్లు జంతువుల సంచారం ఎక్కువగా ఉండే నో-ఫ్లై జోన్‌కు వెలుపల సాయంత్రం 6.30 గంటల నుంచి, ఐదు కిలోమీటర్ల పరిధిలో విహరిస్తాయి. వీటికి ప్రత్యేకంగా లైట్లు, స్పీకర్లు అమర్చడంతో జంతువులను గుర్తించిన వెంటనే శబ్దాలు చేసి, తరిమికొడతాయి. తెలంగాణ రాష్ట్రానికి చెందిన దాత సత్యప్రసాద్‌ సహకారంతో రూ.4 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టు చేపట్టామని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి వెల్లడించారు.

అలిపిరి మెట్ల మార్గం, ఘాట్‌రోడ్ల పరిధిలో ఇటీవల చిరుత పులుల కదలికలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మానవ – వన్యప్రాణి ఘర్షణల నివారణ చర్యలపై టీటీడీ ఉన్నతాధికారులు ఇటీవలే సమీక్షా సమావేశం నిర్వహించారు. అటవీ శాఖ, వివిధ విభాగాల అధికారులతో మాజీ ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి చర్చించారు. ప్రధానంగా అలిపిరి మెట్ల మార్గంలో అదనపు సిబ్బంది కేటాయింపు, ఎప్పటికప్పుడు చెత్త తొలగింపు వంటి చర్యలతో పాటు తక్షణ, దీర్ఘకాలిక చర్యల రూపకల్పనలో వైల్డ్‌ లైఫ్‌ ఇన్‌స్టిట్యూట్, అటవీశాఖల సహకారం మొదలైన విషయాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: