ఆంధ్రప్రదేశ్ ప్రజల దశాబ్దాల కల.. సాకారమయ్యే సమయం ఆసన్నమైంది. అమరావతిని ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా స్థిరీకరిస్తూ కేంద్రం లోక్సభలో కీలక బిల్లు ప్రవేశపెట్టింది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అస్పష్టతను తొలగిస్తూ, విభజన చట్టంలోని హామీలను నెరవేర్చే దిశగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. లోక్సభలో బిల్లు ప్రవేశపెట్టిన వెంటనే సభ్యుల నుంచి భారీ స్పందన లభించింది. ఏపీ పునర్విభజన చట్టం 2014కు సవరణలు చేస్తూ, అమరావతే రాజధాని అని స్పష్టం చేస్తూ కేంద్ర హోం శాఖ ఈ బిల్లును సభ ముందు ప్రవేశపెట్టింది. ఇవాళ ఈ బిల్లు రాజ్యసభ ముందుకు రానుంది. ఉభయ సభల ఆమోదం పొందిన వెంటనే రాష్ట్రపతి సంతకంతో గెజిట్ నోటిఫికేషన్ విడుదల కానుంది.
వాస్తవానికి 2014 విభజన చట్టం ప్రకారం అమరావతిని రాజధానిగా గుర్తించినప్పటికీ, గత వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయంతో గందరగోళం నెలకొంది. దీనిపై రాజధాని రైతులు సుదీర్ఘ పోరాటం చేశారు. భవిష్యత్తులో మళ్లీ ఇలాంటి చిక్కులు రాకుండా ఉండాలంటే.. అమరావతికి పర్మనెంట్ లీగల్ స్టేటస్ ఉండాలని చంద్రబాబు కూటమి సర్కారు భావించింది. రాష్ట్ర అసెంబ్లీలో అమరావతే ఏకైక రాజధాని అని ఏకగ్రీవంగా తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. కేంద్రం ద్వారా ఈ బిల్లును ఆమోదింపజేయడం వల్ల, రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా రాజధానిని మార్చే అధికారం ఉండదు. ఇది అమరావతికి ఒక రక్షణ కవచం లాంటిది. ఈ చారిత్రక ఘట్టానికి పునాది ఏపీ అసెంబ్లీలోనే పడింది. రాష్ట్ర అభ్యర్థన మేరకు కేంద్రం తన బాధ్యతగా ఈ సవరణ బిల్లును ముందుకు తెచ్చింది. ఇవాళ రాజ్యసభలోనూ ఈ బిల్లు సులభంగా ఆమోదం పొందుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.