కాదేది అక్రమాలకు అనర్హం అని నిరూపిస్తున్నారు పల్నాడు జిల్లాలోని కొందరు మోసగాళ్లు. మిగతా ఏవైనా ఇబ్బందికరమని అనుకున్నారో ఏమో.. ఏకంగా పండ్ల తోటలను రియల్ ఎస్టేట్ మోసానికి మార్గంగా ఎంచుకున్నారు. అత్యంత ఖరీదైన అవకాడో పండ్లను పండించి.. లక్షల రూపాయల ఆదాయం వచ్చేలా చేస్తామంటూ… వందల మందిని బురిడీ కొట్టించింది వినుకొండ ప్రాంతానికి చెందిన గాయత్రి 99 అవకాడో ఫామ్ సంస్థ. మార్కెట్లో ఆవకాడో విలువ కిలో 500 రూపాయలకు పైగా పలుకుతుందని, ఒక్కొక్క చెట్టుకు 20-30 కేజీల దిగుబడి వస్తుందని, సెంటు భూమిలో 10 మొక్కలు వస్తాయని నమ్మబలికారు. మూడేళ్ల తరువాత పంట చేతికి వస్తుందని, అప్పటి వరకు మొక్కల సంరక్షణ బాధ్యత తమదే అని బురిడీ కొట్టించారు. దిగుబడి సమయానికి యజమానికి అప్పగిస్తామని నమ్మిస్తున్నారు. అప్పటి నుండి ప్రతి ఏటా అవకాడో యజమానికి లక్షల్లో ఆదాయం వస్తుందని ఆశ చూపి అక్రమ రిజిస్ట్రేషన్లతో డబ్బులు దండుకుంటున్నారు..
విన్నారుగా ఇలాగే ప్రజలకు మాయమాటలు చెప్పి కోట్లు కొల్లగొట్టింది.. గాయత్రి 99 సంస్థ. దీనికోసం ముందస్తుగానే పకడ్బందీ వ్యూహాన్ని పన్నింది. వినుకొండ ప్రాంతంలో 5 నుంచి 10 లక్షల రూపాయలు ఎకరం చొప్పున దాదాపు 1500 ఎకరాల బీడు భూములను కొనుగోలు చేసింది. వాటిలో అవకాడో ఫామింగ్ చేపట్టి… సెంటు భూమిని లక్ష చొప్పున అమ్మేందుకు ప్లాన్ వేశారు. ఈ రకంగా గుంటూరుకు చెందిన కొంతమంది రియల్టర్లు 600 ఎకరాల్లో అనుమతులు లేకుండా అవకాడో ఫామ్ ల్యాండ్ వెంచర్లు వేసి ఆన్లైన్ బుకింగ్ ద్వారా విక్రయించారు. సెంటు రూ.లక్ష చొప్పున 6 సెంట్లు, 10 సెంట్లు, 15 సెంట్లు ప్లాట్లుగా వేసి అమ్ముకుంటున్నారు. ఎకరం రూ.8 లక్షలకు కోనుగోలు చేసిన ఈ రియల్టర్లు అవకాడో ఫామ్ ల్యాండ్ వెంచర్ పేరుతో ఎకరం రూ.కోటి వరకు విక్రయించి సొమ్ము చేసుకున్నారు. బొల్లాపల్లి మండలం సరికొండపాలెం కొండ చూట్టూ షుమారు 500 ఎకరాల్లో అనేక మంది రియల్టర్లు అవకాడో ఫామ్ ల్యాండ్ వెంచర్లను వేసి అమ్ముకుంటున్నారు. కొప్పుకొండ ప్రాంతంలో వందల ఎకరాల్లో అవకాడో వెంచర్లు వేలిశాయి. మొత్తంగా 1500 ఎకరాలకు పైగా వినుకొండ ప్రాంతంలో అవకాడో ఫామ్ ల్యాండ్ వెంచరును అక్రమంగా సాగు చేస్తున్నట్లు తెలిసింది..
అయితే ఇలా భూములు కొనుగోలు చేసిన వారిలో కొంతమందికి ఇప్పటికీ డబ్బులు చెల్లించలేదని తెలుస్తోంది. దీంతో వారంతా గాయత్రి సంస్థకు వ్యతిరేకంగా ఆందోళనకు సిద్ధమవుతున్నారు. ఎన్నో మాయ మాటలు చెప్పి డబ్బులు ఇవ్వకుండా తప్పించుకున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వాస్తవానికి అవకాడో ఫామ్ ల్యాండ్ వెంచర్ వేయాలంటే ఫారెస్టు, ల్యాండ్ కన్వర్షన్, ఫుడా, లే అవుట్ అప్రూవల్స్ తదితర ప్రభుత్వ అనుమతులన్నీ ఉండాలి. కానీ ఇవేమీ లేకుండానే అక్రమార్కులు అవకాడో ఫామ్ల్యాండ్ వెంచర్లు వేసి కోట్లు కొల్లగొడుతున్నారు. ఐనవోలు వద్ద వేసిన 600 ఎకరాల అవకాడో వెంచర్లో అధిక శాతం వాగు పోరంబోకు, ప్రభుత్వ భూములున్నాయని భాదితులు కొందరు పల్నాడు జిల్లా కలెక్టరుకు ఫిర్యాదు చేశారు.
పల్నాడు జిల్లాలో అవకాడో ఫామింగ్ పేరిట సాగుతున్న దందాపై మరింత సమాచారం మా రీజినల్ న్యూస్ కో ఆర్డినేటర్ రమేష్ లైవ్‌లో అందిస్తారు.




Total views : 61456