Friday, May 1, 2026
News Navigation
Friday, May 1, 2026
News Navigation

Breaking

Friday, May 1, 2026
Home Latest News ప్రైవేట్ నిర్వహణ నుంచి పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోకి మెట్రో..

ప్రైవేట్ నిర్వహణ నుంచి పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోకి మెట్రో..

by CVR NEWS
ప్రైవేట్ నిర్వహణ నుంచి పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోకి మెట్రో

ప్రపంచంలోనే అతి పెద్ద పీపీపీ ప్రాజెక్టు ఎందుకు ఫెయిల్ అయ్యింది? హైదరాబాద్ మెట్రోను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి రీజన్ ఏంటీ? ఎల్ అండ్ టీ లాంటి పెద్ద సంస్థ ఎందుకు మెట్రో రైల్ ను నడపలేకపోయింది ? ప్రభుత్వ పరం అయిన తర్వాత ఎలా నడవనుంది ? ఇలాంటి ప్రశ్నలు ఇప్పుడు అందరి మనస్సులలో మెదులుతుంది .దీనిపై సీవీఆర్ ప్రత్యేక కధనం

ప్రపంచంలోనే అతి పెద్ద పీపీపీ ప్రాజెక్ట్‌గా గుర్తింపు పొందిన హైదరాబాద్ మెట్రోపై ఇప్పుడు కీలక పరిణామం చోటుచేసుకుంది. సంవత్సరాల పాటు ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యంతో కొనసాగిన ఈ ప్రాజెక్ట్ కొత్త దశలోకి ప్రవేశించింది. నగర ముఖచిత్రాన్ని మార్చిన ఈ మెట్రో సేవలు లక్షలాది మందికి ప్రతి రోజు ప్రయాణ సౌకర్యాన్ని అందిస్తున్నాయి. అయితే ఆర్థిక ఒత్తిళ్లు, మారుతున్న పరిస్థితులు, ముఖ్యంగా కోవిడ్ ప్రభావం కారణంగా ఈ ప్రాజెక్ట్‌ నష్టాల బారిన పడిందని ఎల్ అండ్ టీ చెబుతోంది . ఇన్నాళ్లు ప్రైవేట్ సంస్థ నిర్వహించిన ఈ మెట్రోను ఇప్పుడు ప్రభుత్వం పూర్తిగా స్వాధీనం చేసుకోవడం కీలక నిర్ణయంగా మారింది. దీని ప్రభావం భవిష్యత్ నగర రవాణా రంగంపై ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది.

()
హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్ట్ ప్రయాణం దాదాపు పదిహేనేళ్ల క్రితం ప్రారంభమైంది. మొదట మేటాస్ కన్సార్షియం ఈ టెండర్‌ను దక్కించుకున్నప్పటికీ సత్యం కుంభకోణం తర్వాత అది రద్దయింది. అనంతరం జరిగిన రెండో టెండర్లలో ఎల్ అండ్ టీ ఈ ప్రాజెక్ట్‌ను స్వాధీనం చేసుకుంది. మొదట అంచనా వేసిన వ్యయం కంటే ఎక్కువ ఖర్చుతో ప్రాజెక్ట్ పూర్తయింది. బ్యాంకుల నుంచి భారీ రుణాలు తీసుకుని నిర్మాణం కొనసాగించాల్సి వచ్చింది. 2017లో ప్రారంభమైన మెట్రో సేవలు ప్రస్తుతం మూడు కారిడార్లలో ప్రయాణికులకు అందుబాటులో ఉన్నాయి. అయితే ప్రారంభ అంచనాలకు తగ్గట్టుగా ఆదాయం రాకపోవడంతో సంస్థపై ఆర్థిక భారం పెరిగింది . దింతో ఎల్ అండ్ టీ కి ఈ ప్రాజెక్టు ను నడపలేని పరిస్థితి నెలకొంది .

ప్రాజెక్ట్ ఆర్థిక పరిస్థితులను మరింత క్లిష్టం చేసింది కోవిడ్ మహమ్మారి. ఆరు నెలలపాటు మెట్రో సేవలు పూర్తిగా నిలిచిపోవడంతో ఆదాయం లేకుండా పోయింది. కానీ అప్పులపై వడ్డీ భారం మాత్రం తప్పలేదు . ఈ పరిస్థితుల్లో ప్రాజెక్ట్ తీవ్ర నష్టాల్లోకి వెళ్లింది. ప్రభుత్వం అప్పట్లో వడ్డీ లేని రుణాన్ని అందించినప్పటికీ పరిస్థితి పూర్తిగా చక్కబడలేదు. ప్రయాణికుల సంఖ్య కూడా ఆశించిన స్థాయిలో పెరగకపోవడం మరో సమస్యగా మారింది. దీంతో ప్రాజెక్ట్ నిర్వహణలో ఉన్న ప్రైవేట్ సంస్థకు ఆర్థిక ఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యంలో భవిష్యత్ నిర్వహణపై అనిశ్చితి నెలకొంది. ఇదే ప్రభుత్వం జోక్యానికి దారితీసింది.

ఇప్పటి వరకు ఎల్ని అండ్ టీ నిర్వహణలో ఉన్న మెట్రో ప్రాజెక్ట్‌ను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించింది. ఈ ప్రక్రియలో సంస్థలోని మొత్తం ఈక్విటీని ప్రభుత్వం కొనుగోలు చేసింది. అంతేకాకుండా భారీ అప్పులను కూడా తన భుజాలపై వేసుకుంది. రెండు దశలు వేర్వేరు సంస్థల చేతుల్లో ఉంటే నిర్వహణలో సమస్యలు వస్తాయని ప్రభుత్వం భావించింది. అందుకే ఒకే సంస్థ ఆధ్వర్యంలో మొత్తం మెట్రో వ్యవస్థను తీసుకురావాలని నిర్ణయం తీసుకుంది. ఈ ఒప్పందం ద్వారా ఎల్ అండ్ టీ పూర్తిగా ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. దీంతో మెట్రో నిర్వహణలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది.

ప్రస్తుతం హైదరాబాద్ మెట్రోలో రోజుకు లక్షలాది మంది ప్రయాణిస్తున్నారు. ఇప్పటి వరకు కోట్ల మంది ప్రయాణాలు కొనసాగించారు . నగర రవాణాలో మెట్రో కీలక పాత్ర పోషిస్తోంది. ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న తర్వాత ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా మార్పులు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. ఛార్జీలు, సేవల సమయం, ఇతర సదుపాయాలపై ప్రభుత్వం ప్రత్యక్ష నియంత్రణ కలిగి ఉంటుంది. భవిష్యత్‌లో కొత్త లైన్ల నిర్మాణం, పాత కారిడార్ల అనుసంధానం వేగవంతం చేయవచ్చు. ఇది నగర అభివృద్ధికి మరింత తోడ్పడే అవకాశం ఉంది.

హైదరాబాద్ మెట్రో ప్రాజెక్ట్ ప్రయాణం ఇప్పుడు ఒక కొత్త మలుపు తీసుకుంది. ప్రైవేట్ భాగస్వామ్యం నుంచి పూర్తిగా ప్రభుత్వ ఆధీనానికి మారడం కీలక పరిణామంగా మారింది. ఇది ఒకవైపు ఆర్థిక సవాళ్లను సూచిస్తే మరోవైపు అవకాశాలను కల్పించనుందని తెలుస్తుంది . సమగ్ర రవాణా వ్యవస్థను అభివృద్ధి చేయడానికి ఇది ఉపయోగపడవచ్చు. భవిష్యత్ నగర ప్రణాళికల్లో మెట్రో కీలక పాత్ర పోషించనుంది. ఈ మార్పులు ప్రయాణికులకు ఎంతవరకు ప్రయోజనం చేకూరుస్తాయో చూడాల్సి ఉంది. మొత్తంగా ఈ పరిణామం దేశంలోని ఇతర పీపీపీ ప్రాజెక్టులకు కూడా ఒక మార్గదర్శకంగా నిలిచే అవకాశం ఉంది.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

009332
Total views : 61573

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.