టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి నారా లోకేశ్ రాష్ట్రవ్యాప్తంగా ‘నిజం గెలిచింది’ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. చంద్రబాబును 53 రోజుల పాటు జైల్లో నిర్బంధించినందుకు నిరసనగా, ఆయన నిర్దోషిగా బయటకు వచ్చినందుకు గుర్తుగా పార్టీ కార్యాలయాలు, ఇళ్లు, బూత్ స్థాయిలో 53 దీపాలు వెలిగించాలని టీడీపీ శ్రేణులకు సూచించారు. మంగళగిరిలో జరిగిన లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో మాట్లాడిన లోకేశ్.. కార్యకర్తల పోరాటాలు, త్యాగాల వల్లే పార్టీ అధికారంలోకి వచ్చిందని అన్నారు. నాయకులు పార్టీ, పర్సనల్, ప్రభుత్వం అనే మూడు ‘పీ’ల సూత్రాన్ని పాటించాలని సూచించారు.
నేతలు అహంకారాన్ని వీడి ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని లోకేశ్ హితవు పలికారు. కష్టపడి పనిచేసే కార్యకర్తలను గుర్తించి, అలకబూనిన వారిని దగ్గరకు తీసుకోవాలని సూచించారు. నియోజకవర్గాల్లో సమస్యల పరిష్కారానికి నాయకులు చొరవ చూపాలని, పాఠశాలలు, ఆసుపత్రులను తనిఖీ చేస్తూ ప్రభుత్వ పథకాల అమలును పర్యవేక్షించాలని ఆదేశించారు. వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాలను ఐక్యంగా తిప్పికొట్టి వాస్తవాలను ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు. ఇది టీడీపీ 3.0 వెర్షన్ అని, ‘నో ఇగో.. ఓన్లీ సర్వీస్’ నినాదంతో పనిచేయాలని నేతలకు లోకేశ్ దిశానిర్దేశం చేశారు.