హైదరాబాద్ అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ రంగంలో మరో కీలక ఘనతను అందుకోనుంది. భారత్‌లో తొలిసారిగా అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ కాన్ఫరెన్స్ IREC-2026 హైదరాబాద్‌లో జరగనుంది. సెప్టెంబర్ 25 నుంచి 27 వరకు హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో మూడు రోజుల పాటు ఈ సదస్సు నిర్వహించనున్నారు. 35కి పైగా దేశాల నుంచి 1500 మందికి పైగా ప్రతినిధులు, రియల్ ఎస్టేట్ రంగ ప్రముఖులు, పరిశ్రమ నిపుణులు హాజరుకానున్నారు. ‘ది డోర్ టు వాట్ హ్యాపెన్స్ నెక్స్ట్’ అనే థీమ్‌తో జరిగే ఈ సదస్సులో అంతర్జాతీయ పెట్టుబడులు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ప్రాప్‌టెక్, డీప్‌టెక్, సుస్థిర అభివృద్ధి వంటి అంశాలపై చర్చించనున్నారు.
అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ కాన్ఫరెన్స్‌తో పాటు ప్రాప్‌టెక్ అండ్ రియల్ ఎస్టేట్ ఇన్నోవేషన్ షోకేస్, లగ్జరీ ప్రాపర్టీ ఎక్స్‌పో కూడా ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించనున్నారు. భారత రియల్ ఎస్టేట్ రంగం అంతర్జాతీయ ప్రమాణాలకు చేరుకుందని నిర్వాహకులు పేర్కొన్నారు. ప్రపంచ రియల్ ఎస్టేట్‌లో రానున్న మార్పులను భారత మార్కెట్‌తో అనుసంధానించడమే సదస్సు ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ఈ గ్లోబల్ ఈవెంట్‌తో హైదరాబాద్ ఖ్యాతి మరింత పెరగడంతో పాటు, భారత రియల్ ఎస్టేట్ రంగంలోకి కొత్త అంతర్జాతీయ పెట్టుబడులకు అవకాశాలు ఏర్పడతాయని నిపుణులు భావిస్తున్నారు.