తెలంగాణ నుంచి ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతులను మరింత పెంచాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కోరారు. న్యూఢిల్లీలో ఫిలిప్పీన్స్ వ్యవసాయ శాఖ కార్యదర్శి, కేబినెట్ సభ్యుడు ఫ్రాన్సిస్కో పి.టు లారెల్ జూనియర్‌తో మంత్రి సమావేశమయ్యారు. తెలంగాణలో భారీగా వరి ఉత్పత్తి అవుతుందని, నాణ్యమైన బియ్యాన్ని పెద్ద మొత్తంలో సరఫరా చేసే సామర్థ్యం, ఆధునిక రైస్ మిల్లింగ్ వ్యవస్థ రాష్ట్రానికి ఉందని వివరించారు. తెలంగాణ నుంచి బియ్యం దిగుమతి చేసుకునే ప్రతిపాదనపై ఫిలిప్పీన్స్ కార్యదర్శి సానుకూలంగా స్పందించారు. మరింత పెద్ద మొత్తంలో బియ్యం కొనుగోలు చేసే అవకాశాలను పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.
బియ్యం రకాలు, ధరలు, నాణ్యతా ప్రమాణాలు, కొనుగోలు విధానం, రవాణా, ధ్రువీకరణతో పాటు శానిటరీ, ఫైటోశానిటరీ నిబంధనలపై ఇరువురు చర్చించారు. ప్రభుత్వ సంస్థలు, దిగుమతిదారులు, ఎగుమతిదారులు, రైస్ మిల్లర్ల భాగస్వామ్యంతో కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని నిర్ణయించారు. పోటీ ధరలు, నాణ్యత, నిర్ణీత సమయంలో సరఫరా చేసే సామర్థ్యంతో తెలంగాణ దీర్ఘకాలిక వాణిజ్య భాగస్వామిగా నిలవగలదని ఉత్తమ్ పేర్కొన్నారు. డిసెంబర్‌లో హైదరాబాద్‌లో జరగనున్న తెలంగాణ రైజింగ్ సమ్మిట్‌కు ఫిలిప్పీన్స్ కార్యదర్శి లారెల్‌ను మంత్రి ప్రత్యేకంగా ఆహ్వానించారు.