తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ చేసిన ఓ సైగ తీవ్ర రాజకీయ దుమారం రేపింది. మాజీ సీఎం ఎం.కె. స్టాలిన్‌ను ఉద్దేశించి విజయ్ మాట్లాడుతున్న సమయంలో తన కుడి అరచేతిని దవడకు ఆనించి చేసిన సైగపై డీఎంకే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎమర్జెన్సీ సమయంలో ‘మిసా’ చట్టం కింద స్టాలిన్ అరెస్టైన ఘటనను ప్రస్తావిస్తూ.. ఆయన దవడకు సంబంధించిన విషయాన్ని విజయ్ ఎగతాళి చేశారని డీఎంకే ఆరోపించింది. దీనిని బాడీ షేమింగ్‌గా పేర్కొంటూ డీఎంకే ఎమ్మెల్యేలు స్పీకర్ ఛాంబర్ ఎదుట నిరసనకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో మార్షల్స్ వారిని బయటకు పంపించారు.
ఈ వివాదంపై సీఎం విజయ్ ‘ఎక్స్’ వేదికగా వివరణ ఇచ్చారు. ప్రసంగించే క్రమంలో అనుకోకుండా తన బాడీ లాంగ్వేజ్ అలా వచ్చిందని, ఎవరినీ వ్యక్తిగతంగా కించపరిచే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. అయితే విజయ్ వ్యాఖ్యలను అసెంబ్లీ రికార్డుల నుంచి తొలగించాలన్న డీఎంకే డిమాండ్‌ను స్పీకర్ తిరస్కరించారు. మరోవైపు స్టాలిన్ అరెస్టు, ‘మిసా’ అంశంపై అధికార, ప్రతిపక్షాల మధ్య వాదనలు కొనసాగాయి. సభలో గౌరవ మర్యాదలు కాపాడుతున్నారా అంటూ స్టాలిన్ ప్రశ్నించడంతో వివాదం మరింత ముదిరింది.