రైలు ప్రమాదం సహాయక చర్యలను మంత్రి బొత్స సత్యనారాయణ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. అటు విశాఖ నుంచి రైల్వే రిలీఫ్ వ్యాన్ చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. బోగీలలో కొందరు ప్రయాణీకులు చిక్కుకుపోవడంతో వారిని బయటకు తీసేందుకు సహాయక సిబ్బంది శ్రమిస్తున్నారు. బాధితుల సహాయం కోసం విజయనగరం జిల్లా కలెక్టరేట్లో కంట్రోల్ ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ తెలిపారు. బాధితులు 9493589157 నెంబర్‌ను ఫోన్ చేసి సహాయం పొందవచ్చని ఆమె మీడియాకు వెల్లడించారు. అలాగే రైల్వే ఫోన్ నెంబర్ 8978080006 నెంబర్‌కు ఫోన్ చేసి సమాచారం పొందవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు.
Vijayanagaram
విజయనగరం జిల్లాలో గతరాత్రి జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మరణించినవారి సంఖ్య 14కు పెరిగింది. కంటకాపల్లి-అలమండ మధ్య నిన్న రాత్రి ఏడు గంటల సమయంలో ముందు వెళ్తున్నవిశాఖపట్టణం-పలాస రైలును వెనక నుంచి వచ్చిన విశాఖ-రాయగఢ రైలు ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో మూడు బోగీలు నుజ్జునుజ్జయ్యాయి. మరో 33 మంది తీవ్రంగా గాయపడ్డినట్టు అధికారులు చెబుతున్నా వారి సంఖ్య వందకుపైనే ఉంటుందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ప్రమాదంలో రాయగడ రైలు బోగీలు నుజ్జయ్యాయి. మరో ట్రాక్‌పై ఉన్న గూడ్సురైలు బోగీలపై దూసుకెళ్లాయి. రైళ్ల ఢీ ఘటనతో ఒక్కసారిగా అక్కడ భీతావహ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రయాణికులు రైలు దిగి భయంతో పరుగులు తీశారు. చిమ్మచీకటిగా ఉండడంతో సహాయక చర్యలకు ఆటంకం కలిగింది. సిగ్నల్ కోసం వేచివున్నపలాస ప్యాసింజర్ రైలును వెనక నుంచి వేగంగా వచ్చిన రాయగడ రైలు ఢీకొట్టినట్టు ప్రయాణికులు చెబుతున్నారు. ఈ ఏడాది జూన్‌లో జరిగిన బాలేశ్వర్ రైలు ప్రమాద ఘటనను ఇది తలపించింది. రెండు ప్యాసింజర్ రైళ్లు, గూడ్సు రైలులో కలిపి మొత్తం ఏడు బోగీలు నుజ్జయ్యాయి. రాయగడ రైలులోని దివ్యాంగుల బోగీ పట్టాలు తప్పి పొలాల్లో పడింది. రెండు ప్యాసింజర్ రైళ్లలోనూ కలిపి దాదాపు 1400 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాద తీవ్రతను బట్టి మృతుల సంఖ్య 40 నుంచి 50 వరకు ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. అర్ధరాత్రి వరకు 10 మృతదేహాలను వెలికి తీశారు. మృతులను విజయనగరం జిల్లా జామి మండలం గుడికొమ్ముకు చెందిన కె.రవితోపాటు గరివిడి మండలం కాపుశంభం గ్రామానికి చెందిన పెరుమజ్జి గౌరినాయుడు, శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలం ఎస్ఆర్ పురానికి చెందిన గిడిజాల లక్ష్మి గా గుర్తించారు. అలాగే, పలాస రైలులోని వెనక బోగీలో ఉన్న గార్డు ఎంఎస్ రావు, రాయగడ రైలు లోకో పైలట్లు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.
విజయనగరం జిల్లా కంటకాపల్లి-అలమండ వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదం నేపథ్యంలో నేడు పలు రైళ్లు రద్దయ్యాయి. కోర్బా-విశాఖపట్టణం, పారాదీప్-విశాఖపట్టణం, పలాస-విశాఖపట్టణం, విశాఖపట్టణం-గుణుపూర్, గుణుపూర్-విశాఖపట్టణం, విజయనగరం-విశాఖపట్టణం రైళ్లు రద్దయ్యాయి. రైలు ప్రమాద సంఘటన దగ్గరకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సీఎం జగన్ వెళ్లనున్నారు. విజయనగరం జిల్లాలో కంటాకపల్లి వద్ద రైలు ప్రమాద ఘటనాస్థలాన్ని సందర్శించనున్నారు. ఉదయం 11.30 కు సంఘటన స్థలానికి బయలుదేరనున్నారు. ఈ సందర్భంగా చికిత్స పొందుతున్న క్షతగాత్రులనూ పరామర్శించనున్నారు. మరో వైపు. రైలు ప్రమాదంపై ప్రధాని నరేంద్రమోదీ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, క్షతగాత్రులకు రూ. 50 వేల చొప్పున పరిహారం ప్రకటించారు.




Total views : 61933