రాజధాని అమరావతి బిల్లుకు చట్టబద్ధత చరిత్రాత్మకమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభివర్ణించారు. చరిత్ర ఉన్నంత వరకు అమరావతి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. పార్లమెంట్‌లో ఏపీ పునర్వ్యవస్థీకరణ బిల్లు-2026 ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. ఈ నేపథ్యంలో రాజధాని ప్రాంతంలోని ఉద్దండరాయునిపాలెం గ్రామంలో సంబరాలు జరిగాయి. ఈ సంబరాల్లో సీఎం చంద్రబాబు దంపతులు పాల్గొన్నారు.
రాజధానిపై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మూడు ముక్కలాట ఆడారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. ఆ కుట్రలు దాటుకుని అమరావతిని సాధించుకున్నామని సంతోషం వ్యక్తం చేశారు. ప్రజల ఆత్మగౌరవానికి చిహ్నం అమరావతి అని సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా పేర్కొన్నారు. దేశంలోని అన్ని పార్టీలు.. ఈ బిల్లుకు మద్దతు తెలిపాయని వివరించారు. బిల్లుకు మద్దతు తెలిపిన అన్ని పార్టీలకు ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఏపీ ప్రజల తరఫున ప్రధాని మోదీకి ధన్యవాదాలు సీఎం చంద్రబాబు తెలిపారు. రాజధాని అమరావతిని వ్యతిరేకించిన ఏకైక పార్టీ వైసీపీ అని సీఎం చంద్రబాబు చెప్పారు. ముళ్ల కంచెలు దాటుకుని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సంఘీభావం తెలిపారని పేర్కొన్నారు. ఇకపై అమరావతిని ఎవరూ ఇంచ్ కూడా కదపలేరని ధీమా వ్యక్తం చేశారు. బెస్ట్ సిటీగా తయారు చేసి అమరావతిని జాతికి అంకితం చేస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.