గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన రైతు రుణమాఫీ కేవలం వడ్డీలకే సరిపోయిందని, తమ ప్రభుత్వం మాత్రం చిత్తశుద్ధితో రైతులకు లబ్ధి చేకూరుస్తోందని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. రుణమాఫీ, రైతు భరోసా అంశాలపై మాజీ మంత్రి హరీశ్ రావు చేస్తున్న విమర్శలను తీవ్రంగా ఖండించారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 25 లక్షల మంది రైతులకు, ఒక్కొక్కరికి రూ. 2 లక్షల చొప్పున రుణమాఫీని విజయవంతంగా పూర్తి చేశామని ఆయన వివరించారు. సుమారు 40 బ్యాంకులు అందించిన డేటా ఆధారంగా అర్హులైన ప్రతి రైతుకూ ఈ ప్రయోజనం చేకూరేలా చర్యలు తీసుకున్నామని తుమ్మల క్లారిటీ ఇచ్చారు.
ఆర్థికంగా అనేక సవాళ్లు ఉన్నప్పటికీ రైతు సంక్షేమం కోసం తమ ప్రభుత్వం వెనకడుగు వేయలేదని మంత్రి గుర్తు చేశారు. గత ప్రభుత్వ హయాంలో రైతుబంధు నిధుల విడుదల కోసం రైతులు నెలల తరబడి వేచి చూడాల్సి వచ్చేదని, కానీ తమ ప్రభుత్వం కేవలం తొమ్మిది రోజుల వ్యవధిలోనే 9 వేల కోట్ల రూపాయల రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసి రికార్డు సృష్టించిందని తెలిపారు. రెండు పంటల కాలంలోనే రైతుల సంక్షేమం కోసం దాదాపు లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ఘనత తమకే దక్కుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రైతులకు ఈ స్థాయిలో మేలు చేస్తున్న ప్రభుత్వం దేశంలో ఎక్కడైనా ఉందేమో హరీశ్ రావు సమాధానం చెప్పాలని తుమ్మల సవాల్ విసిరారు. నిరాధారమైన ఆరోపణలతో రైతులను తప్పుదోవ పట్టించవద్దని ఆయన ప్రతిపక్ష నేతలకు హితవు పలికారు.
రుణమాఫీ, రైతు భరోసాపై మాజీ మంత్రి హరీశ్ రావు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ధ్వజమెత్తారు.
గత పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన రైతు రుణమాఫీ వడ్డీలకే సరిపోయిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. ఇవాళ ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. రుణమాఫీ, రైతు భరోసా విషయంలో మాజీ మంత్రి హరీశ్ రావు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 25 లక్షల మంది రైతులకు రూ.2 లక్షల చొప్పున రుణమాఫీ చేశామని తుమ్మల క్లారిటీ ఇచ్చారు.
#తెలంగాణ #తెలంగాణపాలిటిక్స్ #రాజకీయాలు #పాలిటికల్డెవలప్మెంట్ #బ్రేకింగ్న్యూస్ #ఇండియన్‌పాలిటిక్స్ #ప్రస్తుతపరిణామాలు
మాజీ మంత్రి జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనదైన శైలిలో స్పందించారు..
మాజీ మంత్రి జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనదైన శైలిలో స్పందించారు. కాంగ్రెస్‌లో సీనియర్లకు అన్యాయం జరుగుతోందన్న విమర్శలను కొట్టిపారేస్తూనే, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో సీనియర్ నేతలకు ఎదురైన పరిస్థితులను ఆయన గుర్తుచేశారు. ఢిల్లీ వేదికగా జరిగిన చిట్‌చాట్‌లో సీఎం ఈ అంశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జీవన్ రెడ్డి తనపై చేసిన వ్యక్తిగత విమర్శలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. “జీవన్ రెడ్డి వ్యాఖ్యలపై నేను ప్రత్యేకంగా స్పందించను” అని పేర్కొన్నారు. కాంగ్రెస్‌లో సీనియర్లకు అవమానం జరుగుతోందని అంటున్న వారు, బీఆర్ఎస్ నుండి సీనియర్ నేతలు ఎందుకు బయటకు వచ్చారో చెప్పాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
“ఒకప్పుడు పార్టీ కోసం పనిచేసిన ఆళ్ల నరేంద్ర, విజయశాంతి, ఈటల రాజేందర్ వంటి నేతలు బీఆర్ఎస్ను ఎందుకు వీడాల్సి వచ్చింది? అక్కడ వారికి జరిగిన అవమానం ఏంటో అందరికీ తెలుసు” అని సీఎం అన్నారు. మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఇప్పుడు ఎక్కడున్నారో, ఆయనకు బీఆర్ఎస్లో దక్కిన గౌరవం ఎంతో కనిపిస్తూనే ఉందని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ హయాంలో సీనియర్లకు జరిగిన అవమానాలు గుర్తులేవా? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎప్పుడూ తన నేతలను గౌరవిస్తుందని, కానీ కొందరు కావాలని చేస్తున్న విమర్శలకు కాలమే సమాధానం చెబుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఇటీవల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను కలిసిన మాజీ మంత్రి టీ.జీవన్ రెడ్డి, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం తీరును ఎండగడుతూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. తెలంగాణపై కాంగ్రెస్ హైకమాండ్..ఏఐసీసీ పట్టు కోల్పోయిందని జీవన్ రెడ్డి విమర్శించారు. ఒకప్పుడు పీసీసీ ఏది చెబితే ముఖ్యమంత్రులు అది చేసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా తలకిందులైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్కడే ఏకపక్షంగా ‘రూలర్’లా వ్యవహరిస్తున్నారు” అని ఆయన ధ్వజమెత్తారు. ప్రస్తుతం పీసీసీ అనేది కేవలం ముఖ్యమంత్రి ఆదేశాలను అమలు చేసే ఒక విభాగంగా మారిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పీసీసీ చేసే తప్పులకు చివరకు ఏఐసీసీని నిందించడం సరికాదు. పార్టీ మాత్రమే కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇప్పుడు తిరోగమనంలో పయనిస్తోందన్నారు జీవన్ రెడ్డి
తెలంగాణ ప్రజల నాడి మారుతోందని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుత పాలనతో విసిగిపోయిన ప్రజలు, మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని బలంగా కోరుకుంటున్నారని తెలిపారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో భారీ మార్పులు రావడం ఖాయం అని ఆయన జోస్యం చెప్పారు. సీనియర్ నేతగా కాంగ్రెస్‌లో దశాబ్దాల అనుభవం ఉన్న జీవన్ రెడ్డి, నేరుగా సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.