తెలంగాణలో మరోమూడు రోజులు ఉష్ణోగ్రతలు పడిపోయి చలితీవ్రత పెరుగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తెల్లవారుజాము నుంచే రాష్ట్రవ్యాప్తంగా మంచు కురుస్తుండడంతో పొద్దెక్కినా సూరీడి జాడ కనిపించడం లేదు. చలికి భయపడి చిన్నారులు, వృద్ధులు బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. పొగమంచు కారణంగా రహదారులపై వాహనాల రాకపోకలు నెమ్మదిగా సాగుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండలో నిన్న అత్యల్పంగా 12.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నిర్మల్ జిల్లా పెంబిలో 13.1, సిద్దిపేట జిల్లా కొండపాకలో 13.5, జగిత్యాల జిల్లా మల్లాపూర్‌లో 13.6, మంచిర్యాల జిల్లా జిన్నారంలో 13.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్‌లోనూ చలి వణికిస్తోంది. దీనికి తోడుగా వీస్తున్న చలిగాలులు మరింత కంగారెత్తిస్తున్నాయి. నగరంలో నిన్న 17.9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.
Cold intensity
తెలుగు రాష్ట్రాలను చలి వణికిస్తోంది. ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పడిపోతున్నాయి. చలి తీవ్రత పెరగడంతో జనం ఇళ్లకే పరిమితమవుతున్నారు. తెలంగాణలో చలి తీవ్రత మరింత పెరగనుందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. తూర్పు ఆగ్నేయ దిశ నుంచి వీస్తున్న గాలుల కారణంగా చలి పెరుగుతుందన్నారు. రాత్రిపూట అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని చెప్పారు. ప్రజలు చలిమంటలు వేసుకుని కాలక్షేపం చేస్తున్నారు. తెల్లవారుజాము నుంచి రోడ్లను కమ్మేస్తున్న పొగమంచు మధ్యాహ్నానికి కూడా వీడడంలేదు. దీంతో చాలాచోట్ల పట్ట పగలు కూడా వాహనదారులు లైట్లు వేసుకుని వెళ్లాల్సి వస్తోంది. ఏపీలోని ఏజెన్సీ ప్రాంతాలలో చలి పంజాకు జనం వణికిపోతున్నారు. ఇటీవలి మిగ్జామ్ తుపాన్ తర్వాత ఉష్ణోగ్రతలు మరింత పడిపోయాయని అధికారులు చెబుతున్నారు. పాడేరులో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దట్టమైన పొగమంచు కమ్మేస్తోంది. రోడ్లపై రెండు అడుగుల దూరంలో ఏమున్నదీ కనిపించని పరిస్థితి నెలకొంటోంది. ఉదయం, సాయంత్రం వేళల్లో బయట అడుగుపెట్టాలంటే భయపడుతున్నారు. మరో రెండు మూడు రోజులు చలి తీవ్రత కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.




Total views : 80408