భారత సాంస్కృతిక వారసత్వ సంపద పునరుద్ధరణలో మరో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. 11వ శతాబ్దపు చోళ రాజవంశానికి చెందిన అత్యంత అరుదైన, పవిత్రమైన రాగి శాసనాలను నెదర్లాండ్స్ ప్రభుత్వం భారతదేశానికి అధికారికంగా అప్పగించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో జరిగిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో ఈ చారిత్రక ఆధారాలను భారత్‌కు హ్యాండోవర్ చేశారు. ఈ పరిణామం ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి సరికొత్త మైలురాయిగా నిలిచింది. ఐదు దేశాల పర్యటనలో భాగంగా యూఏఈ పర్యటన ముగించుకుని శుక్రవారం నెదర్లాండ్స్ చేరుకున్న పీఎం మోదీ సమక్షంలో ఈ బదిలీ ప్రక్రియ జరిగింది. ఈ పర్యటనలో స్వీడన్, నార్వే, ఇటలీ దేశాలు కూడా ఉన్నాయి.
ప్రసిద్ధ హిందూ చక్రవర్తి రాజరాజ చోళుడి కాలానికి చెందిన ఈ రాగి శాసనాలు సుమారు 30 కిలోల బరువు కలిగి ఉన్నాయి. చోళ రాజవంశపు రాజముద్ర కలిగిన ఒక కాంస్య రింగ్‌తో ఇవన్నీ ఒకదానికొకటి బంధించబడి ఉన్నాయి. ఈ శాసనాలు రెండు విభాగాలుగా విభజించబడ్డాయి. ఇందులో ఒక భాగం సంస్కృత భాషలో, మరొక భాగం తమిళ భాషలో చెక్కబడి ఉంది.మహారాజ రాజరాజ చోళుడు ఒక బౌద్ధ విహారానికి భూగ్రామ రూపంలో ఇచ్చిన ఆదాయ విరాళాల వివరాలు ఈ శాసనాల్లో ఉన్నాయి. రాజా రాజరాజ చోళుడు మొదట దీనిని తాటి ఆకులపై రికార్డు చేయగా, ఆ తర్వాత అతని కుమారుడైన రాజేంద్ర చోళుడు ఈ దానాన్ని శాశ్వతంగా భద్రపరచడం కోసం మన్నికైన రాగి రేకులపై చెక్కించారు. ఈ పలకలను బంధించే కాంస్య ఉంగరంపై రాజేంద్ర చోళుడి ముద్ర ఉంటుంది.





Total views : 80899