అమెరికా కాలిఫోర్నియాలో కాల్పుల కలకలం..
కాలిఫోర్నియాలోని శాన్ డియాగోలో కాల్పులు కలకలం సృష్టించాయి. స్థానిక ఇస్లామిక్ సెంటర్ దగ్గర ఇద్దరు టీనేజర్లు జరిపిన కాల్పుల్లో సెక్యూరిటీ గార్డు సహా ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటనను విద్వేషపూరిత దాడి కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శాన్ డియాగో కౌంటీలోనే అతిపెద్దదైన ఈ మసీదు ప్రాంగణం బయట కాల్పులు జరగడంతో తీవ్ర భయాందోళన నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని స్థానికులను సురక్షిత ప్రాంతానికి తరలించారు. మృతుల్లో ఉన్న సెక్యూరిటీ గార్డు వల్ల పెను ప్రమాదం తప్పి ఉండొచ్చని తెలిపారు.
ఇక దాడి జరిగిన కొద్దిసేపటికే, సమీపంలోని ఓ స్ట్రీట్‌లో పార్క్ చేసిన వాహనంలో ఇద్దరు యువకుల మృతదేహాలను గుర్తించారు. ముగ్గురిని చంపిన తర్వాత వారు తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. నిందితుల్లో ఒకరు తమ తల్లిదండ్రుల తుపాకీని తీసుకువచ్చారని..అలాగే జాత్యహంకారాన్ని ప్రస్తావిస్తూ రాసిన సూసైడ్ నోట్‌ను వదిలి వెళ్లినట్లు తెలుస్తోంది. వారి ఆయుధాల్లో ఒకదానిపై విద్వేషపూరిత సందేశాలు రాసి ఉన్నట్లు కూడా దర్యాప్తు అధికారులు వెల్లడించారు. ఈ కేసు దర్యాప్తులో FBI కూడా భాగస్వామ్యమవుతోంది. దాడి సమయంలో మసీదు ప్రాంగణంలోని పాఠశాలలో ఉన్న పిల్లలందరూ సురక్షితంగా ఉన్నారని, ఎవరికీ ఎలాంటి హాని జరగలేదని తెలిపారు పోలీసులు.




Total views : 80934