Tuesday, June 16, 2026
News Navigation
Tuesday, June 16, 2026
News Navigation

Breaking

Tuesday, June 16, 2026
Home Andhra Pradesh నెల్లూరు టీడీపీలో ముదురుతున్న గ్రూపు రాజకీయాలు..

నెల్లూరు టీడీపీలో ముదురుతున్న గ్రూపు రాజకీయాలు..

by CVR NEWS
నెల్లూరు టీడీపీలో ముదురుతున్న గ్రూపు రాజకీయాలు

నెల్లూరు టీడీపీలో ముదురుతున్న గ్రూపు రాజకీయాలు

ఏ రాజకీయ పార్టీకైనా అధిష్టానమే సుపీరియర్ .కానీ ఆ జిల్లా టిడిపిలో మాత్రం వేరే లెక్క . సిట్యుయేషన్ కి తగ్గట్టుగా ఎదుటివారి బలహీనతలను క్యాష్ చేసుకుంటూ వ్యూహరచన చేస్తూ… అధిష్టానానికి సుపిరియ‌ర్ అన్నట్లగా వ్యవ‌హ‌రిస్తుంటారు ఆ బీసీ నేత….ఆయ‌న ఏమి చేసినా, అధిష్టానం చూస్తూ ఉండాల్సిందే…! అంతెందుకు పార్టీకి డ్యామేజ్ జరుగుతున్నా సరే న‌వ్వుతూ ఉండాల్సిందే…..ప్రత్యక్ష రాజ‌కీయాల్లో ఏ నాడు పోటి చేయ‌ని ఆయ‌న‌కు అధిష్టానం వద్ద ఎంపిల కన్నా ఎక్కువ గౌర‌వం ఉంది… ఇదే అలుసుగా ఆ నేత విభ‌జించు పాలించు అన్నట్లుగా రాజ‌కీయాలు చేస్తూ, ఒక్కో మెట్టు పైకి ఎక్కుతున్నారు. ఇప్పుడు మంత్రిప‌ద‌విపై క‌న్నేసిన ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గాల్లో నిప్పురాజేస్తూ, గ్రూపులు ఏర్పాటు చేస్తూ, పార్టీని అబాసుపాలు చేస్తున్నాడు..ఇంతకీ ఆ నేత ఎవ‌రు.. ఆ జిల్లా ఏది ?.. ఆయ‌న టార్గెట్ ఏమిటి ?

నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీలో మళ్లీ అంతర్గత రాజకీయాలు హాట్ టాపిక్‌గా మారాయి. జిల్లా అధ్యక్షుడు బీదా రవిచంద్ర వ్యవహార శైలి ఇప్పుడు సొంత పార్టీలోనే తీవ్ర చర్చకు దారితీస్తోంది. పార్టీని సమన్వయం చేయాల్సిన జిల్లా నాయకత్వమే గ్రూపు రాజకీయాలకు కేంద్రబిందువుగా మారిందన్న అభిప్రాయాలు టీడీపీ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కావలి, ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గాల్లో ఇటీవల పెరిగిన అసమ్మతి వెనుక జిల్లా అధ్యక్షుడి హస్తం ఉందన్న గుసగుసలు పార్టీ శ్రేణుల్లో వినిపిస్తున్నాయి. కావలిలో ఎమ్మెల్యే కావ్య కృష్ణా రెడ్డి , మాలేపాటి వర్గాల మధ్య విభేదాలు మరింత ముదిరేందుకు బీదా అనుచర రాజకీయాలే కారణమన్న ప్రచారం సాగుతోంది. ఒకవైపు పార్టీ బలోపేతం గురించి మాట్లాడుతూనే మరోవైపు నాయకులను విడదీసే రాజకీయాలు చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలపై పార్టీ అధిష్టానం మాత్రం ఇప్పటివరకు బహిరంగంగా స్పందించకపోవడం మరింత చర్చకు దారితీస్తోంది. దీంతో నెల్లూరు జిల్లాలో టీడీపీ భవిష్యత్ రాజకీయాలపై కార్యకర్తల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

జిల్లాలో పార్టీ కంటే జిల్లా అధ్యక్షుడికే ఎక్కువ ప్రాధాన్యత లభిస్తోందన్న చర్చ ఇప్పుడు నెల్లూరు టీడీపీలో ప్రధానాంశంగా మారింది. ఎంపీలు, సీనియర్ నేతల కంటే బీదా రవిచంద్ర మాటకే అధిష్టానం ఎక్కువ విలువ ఇస్తోందన్న అసంతృప్తి కొందరు నాయకుల్లో వ్యక్తమవుతోందని సమాచారం. ఇటీవల జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌లో బోట్ల మాయం వ్యవహారం పెద్ద దుమారమే రేపింది. మత్స్యకారులు బీదా సోదరులపై బహిరంగంగానే ఆరోపణలు చేసినా పార్టీ పెద్దల నుంచి ఎలాంటి చర్యలు కనిపించలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఆ వివాదాన్ని కూడా రాజకీయ చాతుర్యంతో డైవర్ట్ చేశారన్న ప్రచారం సాగుతోంది. ఇదే సమయంలో ఆత్మకూరులో ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా గూటూరు కన్నబాబు, కొమ్మి లక్ష్మయ్య నాయుడు, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి లాంటి నేతలు తిరుగుబాటు స్వరం వినిపించడం వెనుక కూడా బీదా వ్యూహాలే ఉన్నాయన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. పార్టీని కాపాడాల్సిన బాధ్యత ఉన్న నాయకత్వమే విభేదాలను పెంచుతోందన్న భావన క్రమంగా బలపడుతోంది.

నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీలో పెరుగుతున్న అసమ్మతి ఇప్పుడు అధిష్టానానికి సవాల్‌గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. జిల్లా అధ్యక్షుడు బీదా రవిచంద్రపై వస్తున్న విమర్శలు రోజు రోజుకు పెరుగుతున్నా పార్టీ అధిష్టానం మాత్రం మౌనం పాటిస్తోందన్న చర్చ జోరుగా సాగుతోంది. ప్రతిపక్షాల విమర్శలకు కూడా జిల్లా అధ్యక్షుడిగా ఆయన పెద్దగా స్పందించరని, కానీ సొంత పార్టీలో మాత్రం గ్రూపులను ప్రోత్సహించే రాజకీయాలు చేస్తారన్న అభిప్రాయాలు టీడీపీ శ్రేణుల్లో వినిపిస్తున్నాయి. సమస్యలను సృష్టించి, తర్వాత వాటిని తానే పరిష్కరిస్తున్నట్లు అధిష్టానం ముందు బిల్డప్ ఇస్తారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఉదయగిరి, ఆత్మకూరు, కావలి ప్రాంతాల్లో తాజా పరిణామాలు చూస్తుంటే పార్టీ అంతర్గత ఐక్యత దెబ్బతింటోందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు నెల్లూరు జిల్లాలో బలంగా ఉన్న టీడీపీ ఇప్పుడు మళ్లీ గ్రూపు రాజకీయాల దిశగా వెళ్తోందన్న ఆందోళన కార్యకర్తల్లో పెరుగుతోంది. రానున్న రోజుల్లో పార్టీ అధిష్టానం ఈ పరిణామాలపై ఎలా స్పందిస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Advertisements

You may also like

Our Visitor

023974
Total views : 143657

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.