Thursday, August 27, 2026
News Navigation
Thursday, August 27, 2026
News Navigation

Breaking

Thursday, August 27, 2026
Home Andhra Pradesh బొబ్బిలి ఇందిరమ్మ కాలనీలో భూకబ్జాల కలకలం..

బొబ్బిలి ఇందిరమ్మ కాలనీలో భూకబ్జాల కలకలం..

by CVR NEWS
బొబ్బిలి ఇందిరమ్మ కాలనీలో భూకబ్జాల కలకలం

విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణంలోని ఇందిరమ్మ కాలనీ ఇప్పుడు భూకబ్జాల కేంద్రంగా మారిందన్న ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. పేదల కోసం కేటాయించిన ఇళ్ల స్థలాలు బినామీ పేర్లతో కొంతమంది చేతుల్లోకి వెళ్లాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2016 నుంచి 2019 మధ్య కాలంలో సుమారు 600 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చినట్లు రెవెన్యూ రికార్డులు చెబుతున్నప్పటికీ, నిజంగా లబ్ధిదారులకు దక్కినవి ఎన్ని అన్న ప్రశ్నకు సమాధానం దొరకడం లేదు ఒకే వ్యక్తికి 30 వరకు ఇళ్ల పట్టాలు కేటాయించారన్న ఆరోపణలు వస్తున్నాయి . రెవెన్యూ అధికారులు, సిబ్బంది కుమ్మక్కై భారీ స్థాయిలో అక్రమాలకు పాల్పడ్డారని ప్రజాసంఘాలు మండిపడుతున్నాయి. గతంలో పనిచేసిన తహసీల్దార్లు, సర్వేయర్లు, వీఆర్వోలు కీలక పాత్ర పోషించారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఎన్నోసార్లు ధర్నాలు, ఆందోళనలు, ఫిర్యాదులు అందినా ఇప్పటివరకు స్పష్టమైన చర్యలు తీసుకోకపోవడంతో ప్రజల్లో అనుమానాలకు తావిస్తోంది.

దాదాపు రెండు దశాబ్దాల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పేదల కోసం బొబ్బిలిలో ఇందిరమ్మ కాలనీ నిర్మాణం చేపట్టారు. వేలాది మంది నిరుపేదలకు గూడు కల్పించాలన్న లక్ష్యంతో లేఅవుట్ రూపొందించారు. కానీ కాలక్రమేణా ఆ పధకం అక్రమాల బారిన పడిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇళ్లు నిర్మించుకోలేని పేదల స్థలాలను కొందరు ఆక్రమించి రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు వినియోగిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా హెచ్‌టీ విద్యుత్ లైన్ల కింద ఎటువంటి నిర్మాణాలు ఉండకూడదన్న నిబంధన ఉన్నప్పటికీ, ఆ ఖాళీ ప్రదేశాలపై కూడా కబ్జాదారులు కన్నేశారు. అమాయక ప్రజలకు అవే స్థలాలు విక్రయించి లక్షలు దండుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి . కొందరు అధికారిక పత్రాల ఆధారంగా పట్టాలు సృష్టించుకుంటే, మరికొందరు నకిలీ పత్రాలతో మోసాలకు పాల్పడుతున్నారని స్థానికులు చెబుతున్నారు. రెవెన్యూ ఉద్యోగుల సహకారం లేకుండా ఈ స్థాయిలో అక్రమాలు జరగవని స్థానిక ప్రజలు అంటున్నారు .

ఇందిరమ్మ కాలనీలో జరిగిన భూఅక్రమాలపై గతంలో వైసీపీ ప్రభుత్వం విచారణకు ఆదేశించినప్పటికీ, ఆ దర్యాప్తు వివరాలు మాత్రం ఇప్పటికీ వెలుగులోకి రాలేదు. రెవెన్యూ, మున్సిపల్ అధికారులు కలిసి సమగ్ర విచారణ జరిపి నివేదికను ఉన్నతాధికారులకు అందజేసినట్లు సమాచారం. అయితే ఆ నివేదికలో ఏముంది, ఎవరిపై ఆరోపణలు వచ్చాయి, ఎలాంటి చర్యలు తీసుకున్నారు అనే అంశాలపై స్పష్టత లేకపోవడం పలు అనుమానాలకు దారితీస్తోంది. అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు లేకపోవడంతో కబ్జాదారులు మరింత రెచ్చిపోతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పేదల కోసం కేటాయించిన భూములు రియల్ ఎస్టేట్ మాఫియా చేతుల్లోకి వెళ్లడం ప్రజల్లో ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో విచారణ జరపాలని ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. నిజమైన లబ్ధిదారులకు న్యాయం చేసి, అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: