అమెరికాలో హెచ్-1బీ, పర్మ్ వర్క్ వీసాల జారీలో జరుగుతున్న అక్రమాలపై ట్రంప్ ప్రభుత్వం భారీ దర్యాప్తు చేపట్టింది. అమెరికా కార్మిక శాఖ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆంథోనీ డి’ఎస్పోసిటో వెల్లడించిన వివరాల ప్రకారం.. వీసా మోసాలపై ఇప్పటికే డజన్ల కొద్దీ సమ్మన్లు, సబ్‌పోనాలు జారీ చేశారు. ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్‌లో హెచ్-1బీ, పర్మనెంట్ రెసిడెన్సీ స్పాన్సర్‌షిప్‌ల దుర్వినియోగంపై విజిల్‌బ్లోయర్లు కీలక సమాచారం ఇచ్చారని అధికారులు తెలిపారు. అయితే ప్రస్తుతం సంస్థపై ఆరోపణలు నిర్ధారించలేదని, ఫిర్యాదుల ఆధారంగానే విచారణ కొనసాగుతోందని స్పష్టం చేశారు.
వీసా మోసాల వెనుక అంతర్జాతీయ నేర ముఠాల ప్రమేయం ఉందని, ఈ అక్రమాల ద్వారా వచ్చిన నిధులు హింసాత్మక నేరాలకు ఉపయోగపడుతున్నాయని అమెరికా అధికారులు పేర్కొన్నారు. అమెరికా పౌరుల ఉపాధి అవకాశాలను కాపాడటంతో పాటు దేశ భద్రతను బలోపేతం చేయడమే ఈ దర్యాప్తు లక్ష్యమని వెల్లడించారు. ఈ పరిణామం భారతీయ ఐటీ రంగంలో ఆందోళనకు దారితీసింది. అమెరికాలో జారీ అయ్యే హెచ్-1బీ వీసాల్లో సుమారు 71 శాతం భారతీయులకే దక్కుతుండటంతో.. వేలాది మంది భారతీయ ఐటీ ఉద్యోగులు, ఇంజనీర్లు, పరిశోధకులపై ఈ దర్యాప్తు ప్రభావం పడే అవకాశముందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.






Total views : 194813