పశ్చిమాసియాలో ఉద్రిక్తతల ప్రభావంతో చమురు ధరలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో వాహనదారులకు మరో షాక్ తగిలింది. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. దీంతో వారం రోజుల్లోనే ఇంధన ధరలు మళ్లీ పెరగడంతో వాహనదారులపై అదనపు భారం పడుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో చోటుచేసుకుంటున్న పరిణామాలు, దేశీయ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో, దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. తాజా సవరణ ప్రకారం, లీటర్ పెట్రోల్, డీజిల్‌పై సగటున 90 పైసలు మేర భారం పెరిగింది. అయితే, వివిధ రాష్ట్రాల్లో ఉండే స్థానిక పన్నులు, రవాణా ఖర్చుల ఆధారంగా కొన్ని నగరాల్లో ఈ పెంపుదల కనిష్టంగా 80 పైసల నుంచి గరిష్టంగా రూపాయి వరకు ఉంది. సాధారణ ప్రజలపై నేరుగా ప్రభావం చూపే ఈ ధరల పెరుగుదల, రవాణా రంగంపై అదనపు భారాన్ని మోపనుంది. గత వారం 3 రూపాయల మేర ఇంధన ధరలు పెరిగిన తర్వాత, తాజాగా మళ్లీ లీటరుకు దాదాపు 90 పైసల వరకు ధరలు పెరగడం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. తాజా ధరల ప్రకారం తెలంగాణలో పెట్రోల్ ధర లీటరుకు రూ.112కు చేరుకోగా, డీజిల్ రూ.100గా ఉంది. ఏపీలో లీటర్ పెట్రోల్ ధర.114కు పెరిగింది.
ప్రపంచవ్యాప్తంగా ఎఫెక్ట్ చూపిస్తున్న పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం భారత్‌పై కూడా పడుతోంది. ముఖ్యంగా హార్ముజ్ జలసంధి ప్రాంతంలో సంక్షోభంతో అంతర్జాతీయ సముద్ర వాణిజ్య మార్గాలు ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. దీంతో బ్రెంట్ క్రూడ్ ధరలు బ్యారెల్‌కు 100 డాలర్లకు పైగా కొనసాగుతున్నాయి. అమెరికా, ఇరాన్ మధ్య చర్చలు కొనసాగుతున్నప్పటికీ, ఒప్పందం కుదరకపోవడంతో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ధరలు పెరుతున్నాయి. అయితే ఇలా వరుసగా పెట్రోల్ ధరల పెరుగుదలతో రవాణా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. దీని ప్రభావం కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరలపై కూడా పడొచ్చని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. ఇప్పటికే ద్రవ్యోల్బణంతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు పెరుగుతున్న ఇంధన ధరలు మరింత భారంగా మారుతున్నాయి.





Total views : 80688