Friday, August 28, 2026
News Navigation
Friday, August 28, 2026
News Navigation

Breaking

Friday, August 28, 2026
Home National చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న కేరళం ప్రభుత్వం..

చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న కేరళం ప్రభుత్వం..

by CVR NEWS
చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న కేరళం ప్రభుత్వం

దేశంలోనే సరికొత్త రికార్డుకు వేదికైంది కేరళ. ఎప్పుడూ వినూత్న పథకాలు, సామాజిక నిర్ణయాలతో వార్తల్లో నిలిచే కేరళ రాష్ట్రం.. ఇప్పుడు వృద్ధుల కోసం ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. దేశంలోనే మొట్టమొదటిసారిగా సీనియర్ సిటిజన్స్ కోసం ప్రత్యేక శాఖను ఏర్పాటు చేస్తూ కేరళ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. వృద్ధాప్యంలో తోడు లేక, సరైన సంరక్షణ కరువై అల్లాడుతున్న వృద్ధులకు అండగా నిలబడడమే లక్ష్యంగా ఈ కొత్త విభాగాన్ని తీసుకొచ్చింది.

ఇప్పటివరకు మహిళలు, శిశు సంక్షేమ శాఖ పరిధిలోనే వృద్ధుల వ్యవహారాలు కూడా ఉండేవి. కానీ, కేరళలో మారుతున్న జనాభా సమీకరణాలు, పెరుగుతున్న వృద్ధుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ పరిధి నుంచి దీనిని వేరు చేశారు. వృద్ధుల కోసం ఒక స్వతంత్ర విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఈ ప్రత్యేక శాఖ ద్వారా వృద్ధులకు సంక్షేమ పథకాలను అందించనున్నారు. ఇందులో భాగంగా వృద్ధుల ఆరోగ్యం, జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తుంది ప్రభుత్వం.

వృద్ధాప్య సమస్యలతో బాధపడేవారికి ఉచిత వైద్యం, ఇంటి వద్దకే మందుల సరఫరా, మానసిక ఉల్లాసం కోసం ప్రత్యేక కేంద్రాల ఏర్పాటు చేయనున్నారు.ఒంటరిగా ఉంటున్న వృద్ధుల భద్రత కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్లు, సైబర్ నేరాల నుండి వారిని రక్షించేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. రాష్ట్రంలోని వృద్ధాశ్రమాల్లో కనీస వసతులు, వైద్య సదుపాయాలు సక్రమంగా ఉండేలా ఈ శాఖ నేరుగా పర్యవేక్షిస్తుంది.

రాబోయే రోజుల్లో కేరళలో వృద్ధుల జనాభా మరింత పెరిగే అవకాశం ఉందన్న నివేదికల ఆధారంగా ప్రభుత్వం ఈ ముందస్తు అడుగు వేసింది. వయసు పైబడిన వారు సమాజానికి భారం కాదు, వారు మన బాధ్యత అని చాటిచెప్పిన కేరళ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై దేశవ్యాప్తంగా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. మిగతా రాష్ట్రాలు కూడా కేరళ బాటలోనే నడవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: