ఏపీలో విద్యార్థుల సామగ్రి కొనుగోలులో భారీ కుంభకోణం జరిగిందని నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు ఇచ్చే వస్తువుల నాణ్యత సరిగా లేదని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ఏడాది రూ.1,050 కోట్లతో విద్యార్థులకు బ్యాగులు, షూస్ కొనుగోలు చేశారన్నారు. 42 లక్షల మంది పేద విద్యార్థుల కోసం కొనుగోలు ఆర్డర్లు ఇచ్చారన్నారు. ఈ పథకం కింద మూడేళ్లలో సామగ్రికి 2400 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని వెల్లడించారు. టెండర్ ప్రక్రియలో ఐదు కంపెనీలు సిండికేట్‌గా ఏర్పడ్డాయని తెలిపారు. నిధులు దారి మళ్లినట్లు ఎన్ఫోర్స్మెంట్ విచారణలో తేలిందని వెల్లడించారు. గతేడాది ఫ్లాట్ ప్యానెల్స్ కు సంబంధించి నేటికీ డబ్బులు ఇవ్వలేదన్నారు. నాలుగు వందల కోట్ల రూపాయలతో ఫ్లాట్ ప్యానెల్స్ కొనుగోలు పేరిట మరో కుంభకోణం జరిగిందన్నారు.
Jana Sena
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ అన్నారు. తెలంగాణ గ్రామీణ ప్రజలు కాంగ్రెస్‌కు మద్దతుగా ఉన్నారన్నారు. ఎస్సీ వర్గీకరణ అంశం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉందని తెలిపారు. తెలంగాణలో మాదిగలను మోసం చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే కులాలకు అతీతంగా … పేదరికాన్ని కొలమానంగా తీసుకొని రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి మద్దతిచ్చి తప్పు చేశారన్నారు. రెండు పార్టీలకు కలిపి ఐదు సీట్లకు మించిరావన్నారు.
టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో తెలుగుదేశం – జనసేన పార్టీల ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ తొలి భేటీ ముగిసింది. సంక్షేమంతో కూడిన అభివృద్ధే ప్రధాన అజెండాగా టీడీపీ-జనసేన మేనిఫెస్టోపై భేటీలో కమిటీ చర్చించింది. మేనిఫెస్టో కమిటీ సభ్యులుగా టీడీపీ నుంచి యనమల రామకృష్ణుడు, అశోక్ బాబు, పట్టాభి.. జనసేన నుంచి వరప్రసాద్, ముత్తా శశిధర్, శరత్ కుమార్ ఉమ్మడి మేనిఫెస్టోపై చర్చించారు. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ నుంచి 6 అంశాలు, జనసేన నుంచి ప్రతిపాదించిన 5 అంశాలను చేర్చి ఉమ్మడిగా 11 అంశాలతో కూడిన మినీ మేనిఫెస్టోను రూపొందించినట్లు ఇరు పార్టీ సభ్యులు తెలిపారు. వివిధ వర్గాల నుంచి వచ్చిన ప్రతిపాదనలు తీసుకుని పూర్తి స్థాయి మేనిఫెస్టోను రూపొందించనున్నట్లు పేర్కొన్నారు. తెలుగుదేశం – జనసేన ఉమ్మడి మేనిఫెస్టో అంటే తప్పనిసరిగా అమలవుతుందన్న నమ్మకం ప్రజల్లో ఉందని ఇరు పార్టీల నేతలు అభిప్రాయపడ్డారు. ఉపాధి కల్పించే పథకాల ద్వారా యువతకు నమ్మకం కలిగించి ధైర్యం చెప్పే అంశాలను మినీ మేనిఫెస్టోలో ప్రతిపాదించామన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం – జనసేన కూటమి ఘన విజయం సాధిస్తుందని నేతలు ధీమా వ్యక్తం చేశారు.
గుంటూరు జిల్లాల్లో టిడిపి, జనసేన ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ మరి కొద్దిసేపట్లో తొలిసారి సమావేశం కానుంది. టిడిపి తరపున యనమల రామకృష్ణుడు, అశోక్ బాబు, పట్టాభి హాజరు అవుతున్నారు. జనసేన నుంచి వరప్రసాద్, శశి కుమార్, శరత్ బాబు హాజరు అవుతున్నారు.రాష్ట్రంలో సంక్షేమం ,అభివృద్ధి, ఎజెండా గా రూపకల్పన చేసే విధంగా ప్రణాళిక ని సిద్దం చేస్తున్నారు. టిడిపి తయారు చేసిన కొన్ని అంశాలకు భవన నిర్మాణ కార్మికులు, ఇసుక పాలసీ, విద్యుత్ చార్జీలు వసూలు లో ప్రజలు ఇబ్బందులు దృష్టి లో ఉంచుకొని మ్యానిఫెస్టోలో పొందుపరిచే అవకాశాలు ఉన్నాయి. ఎక్కువగా రైతు ,యువత కార్మికులు సమస్యలను మ్యానిఫెస్టోలో రూపకల్పన చేయనున్నారు. దీంతో పాటు మరో రెండు పర్యాయాలు ఇలాంటి సమావేశాలు నిర్వహించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఏపీలో జగన్ పాలనకు తెర దించడమే లక్ష్యంగా టీడీపీ, జనసేన పార్టీలు పొత్తు కుదుర్చుకోవడం తెలిసిందే. ఈ క్రమంలో ఇరు పార్టీలు ఒకే మేనిఫెస్టోతో ఎన్నికలకు వెళ్లాలని ఇటీవల నిర్ణయించాయి. ఈ మేరకు ఆరుగురు సభ్యులతో టీడీపీ-జనసేన ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో టీడీపీ నుంచి యనమల రామకృష్ణుడు, అశోక్ బాబు, కొమ్మారెడ్డి పట్టాభిరామ్… జనసేన పార్టీ తరఫున వరప్రసాద్, ముత్తా శశిధర్, శరత్ సభ్యులుగా ఉంటారు. ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ రూపకల్పనపై ఈ కమిటీ నవంబరు 13న సమావేశం కానుంది.
ప్రధాని నరేంద్ర మోదీ ఒక విజనరీ లీడర్ అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ కొనియాడారు. తక్షణ సవాళ్లను అధిగమించగల సామర్థ్యం కలిగిన వారని అన్నారు. దేశాన్ని మంచి భవిష్యత్తు వైపు నడిపించే శక్తి కలవారని, వివిధ రంగాల్లో పరివర్తనాత్మక మార్పును తీసుకురాగలరని చెప్పారు. దేశాన్ని ఐక్యంగా ఉంచగల సమర్థులు అని అన్నారు. మోదీ విజన్ 2047 సాకారమయ్యేందుకు బీజేపీకి, ప్రధానికి జనసేన పూర్తి మద్దతిస్తుందని చెప్పారు. ఇప్పటికే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో జనసేన పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. రెండు పార్టీలు కలిసి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. జనసేనకు బీజేపీ 8 స్థానాలకు కేటాయించింది. తమ అభ్యర్థులకు పవన్ కల్యాణ్ బీఫామ్ లను కూడా అందించారు.
శ్రీకాళహస్తి మునిసిపల్ కమీషనర్ ను కలిసి పట్టణంలో సమస్యలు పరిష్కరించమని వినతి ఇచ్చిన నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జి శ్రీమతి వినుత కోట శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జనసేన విజయ యాత్ర పేరుతో ఇంటింటికీ ప్రచారం చేస్తున్నపుడు పట్టణంలో పలు ప్రాంతాల్లో ప్రజల సమస్యలు జనసేన పార్టీ దృష్టికి తీసుకుని రావడంతో కనీస అవసరాలు అయిన త్రాగు నీరు, స్ట్రీట్ లైట్లు కూడా లేదని ప్రజల ఇబ్బందులు మునిసిపల్ కమీషనర్ గారి దృష్టికి తీసుకుని వెళ్లారు. లోబావీ ST కాలనీ , కైలాస గిరి కాలనీ లో తాగు నీరు, స్ట్రీట్ లైట్లు లేవని , పట్టణంలో కొండ మిట్ట , తుఫాను సెంటర్ , బహదూర్ పేట, శ్రీరామ్ నగర్ కాలనీ , భాస్కర్ పేట, గోపాలవనం , హౌసింగ్ బోర్డు తదితర ప్రాంతాల్లో స్ట్రీట్ లైట్లు లేకుండా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అని వినుత గారు మునిసిపల్ కమీషనర్ గారికి తెలిపారు. స్ట్రీట్ లైట్లు రానున్న 10 రోజుల్లో పూర్తి స్థాయిలో అన్ని ప్రాంతాల్లో వేస్తామని హామీ ఇచ్చారు. లోబావి ST కాలనీ , కైలాస గిరి కాలనీ లో నీటి సమస్య కూడా పరిశీలించి తక్షణమే పరిష్కరిస్తామని కమీషనర్ గారు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి పట్టణ ఉపాధ్యక్షులు తోట గణేష్, ప్రధాన కార్యదర్శులు రవి కుమార్ రెడ్డి, పేట చిరంజీవి, చంద్ర శేఖర్ ,నాయకులు శ్రీ రామ్, బత్తెమ్మ, శారద , తదితరులు పాల్గొన్నారు.
బీసీలను ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటించడానికి ధైర్యం ఉండాలని, ఆ ధైర్యం బీజేపీ చేసిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. బీజేపీ బీసీ ఆత్మగౌరవ సభకు హాజరైన పవన్ కల్యాణ్.. సామాజిక తెలంగాణ… బీసీ తెలంగాణకు తాను పూర్తిగా మద్దతిస్తున్నానన్నారు. తెలంగాణ సాధించినా నీళ్లు, నిధులు, నియామకాలు అందరికీ అందాయా? అన్నది పెద్ద ప్రశ్న అన్నారు. సకల జనులు ఉద్యమిస్తేనే తెలంగాణ వచ్చిందన్నారు. జల్… జంగల్… జమీన్ అంటూ కొమురం బీమ్ పోరాడారన్నారు. మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దేశంలో ఉగ్రవాద దాడులు తగ్గాయన్నారు. తనలాంటి కోట్లాదిమంది కన్న కలలకు ప్రతిరూపమే మోదీ అన్నారు. దేశ ప్రయోజనాలే మోదీని నిర్దేశిస్తాయని ఎన్నికల ప్రయోజనాలు కాదన్నారు. మూడోసారి నరేంద్ర మోదీ ప్రధాని అవుతారన్నారు. ఔర్ ఏక్ బార్ మోదీ అంటూ నినాదాలు చేశారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎనిమిది స్థానాల్లో జనసేన పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించింది. ఈ ఎన్నికల్లో బీజేపీ, జనసేన కలిసి ముందుకు సాగుతున్నాయి. జనసేనకు బీజేపీ ఇప్పటికే 100 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. పొత్తులో భాగంగా ప్రస్తుతానికి ఎనిమిది స్థానాలను బీజేపీ కేటాయించింది. మరికొన్ని స్థానాలపై చర్చలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎనిమిది నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను జనసేన విడుదల చేసింది. కూకట్పల్లి నుంచి ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్, తాండూరు నుండి నేమూరి శంకర్ గౌడ్, కోదాడ నుండి మేకల సతీష్ రెడ్డి, నాగర్ కర్నూలు నుండి వంగ లక్ష్మణ్ గౌడ్, ఖమ్మం నుండి మిర్యాల రామకృష్ణ, కొత్తగూడెం నుండి లక్కినేని సురేందర్ రావు, వైరా నుండి డాక్టర్ తేజావత్ సంపత్ నాయక్, అశ్వారావుపేట నుండి ముయబోయిన ఉమాదేవి పోటీ చేయనున్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-జనసేన పార్టీల మధ్య పొత్తు ఖరారైన నేపథ్యంలో ఆదివారం తదుపరి ఉమ్మడి కార్యచరణను ప్రకటించనున్నారని సమాచారం. పొత్తుకు సంబంధించి శనివారం రాత్రి జనసేనాని పవన్ కల్యాణ్ నివాసంలో కీలక చర్చలు జరిగాయి. ఎన్నికల్లో ఇరు పార్టీల అభ్యర్థుల విజయానికి ఉమ్మడిగా పనిచేయాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర చీఫ్ కిషన్‌రెడ్డి, ఎంపీ లక్ష్మణ్, జనసేన తరపున నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. జనసేన ఏయే నియోజకవర్గల్లో పోటీ చేయనుందనే అంశంతోపాటు తదుపరి కార్యాచరణను ఆదివారం వెల్లడించనున్నారని సమాచారం. మరోవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 7న తెలంగాణకు వస్తున్నారు. ఎల్బీ స్టేడియంలో నిర్వహించే బీసీ ఆత్మగౌరవ సభకు హాజరుకావాలని కోరగా పవన్‌కల్యాణ్ సానుకూలంగా స్పందించారని బీజేపీ వెల్లడించింది.ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ గతంలో అసెంబ్లీ, కార్పొరేషన్ ఎన్నికల్లో సంపూర్ణంగా సహకరించిందని, ఈ ఎన్నికల్లో జనసేనతో సీట్ల సర్దుబాటు కొలిక్కివచ్చిందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఇదిలావుండగా జనసేన 9 స్థానాల్లో పోటీ చేసేందుకు ఇరు పార్టీల మధ్య పొత్తు కుదిరిన విషయం తెలిసిందే. ఏయే స్థానాల్లో బరిలోకి దిగబోతోందనేది త్వరలోనే వెల్లడికానుంది. మరోవైపు బీజేపీ ఇప్పటికే ఇప్పటికే 88 మంది అభ్యర్థులను ప్రకటించింది. జనసేనకు 9 నియోజకవర్గాలను మినహాయించగా ఇంకా 22 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.





Total views : 57027