కాళేశ్వరం ప్రాజెక్టు ప్రమాదంలో పడిందన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. లక్ష్మణ్, ఈటల, రఘునందనరావు తదితర బీజేపీ నేతలతో కలిసి కిషన్ రెడ్డి ప్రాజెక్టును పరిశీలించారు. గ్రౌండ్ రిపోర్ట్ తెలుసుకోకుండా కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ కుంగుబాటు గురించి మాట్లాడకూడదనే ఉద్దేశంతో తాము ఇప్పుడు ప్రాజెక్టును సందర్శించామని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులు, విధానాలపై తెలంగాణ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారన్నారు. మేడిగడ్డ వద్ద కుంగిన ప్రాంతాన్ని పూర్తిగా తొలగించాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదిక ఇచ్చిందన్నారు. గ్రౌండ్ రిపోర్ట్ చూశాక మాట్లాడాలనే ఉద్దేశ్యంతో తాము ఈ ప్రాజెక్టును సందర్శిస్తున్నామన్నారు. కాగా, బీజేపీ నేతలు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో మేడిగడ్డ వద్దకు చేరుకున్నారు.
Kcr
ఈ రోజు ఉదయం 11 గంటలకు కోనాయిపల్లి వెంకటేశ్వర ఆలయంలో నామినేషన్ పత్రాలతో కేసీఆర్, హరీశ్ రావులు ప్రత్యేక పూజలు…..
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ సెంటిమెంట్ దేవాలయం కొనాయ పల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి రానున్నరు.
ఎన్నికల సమయంలో నామినేషన్ పత్రాలతో స్వామివారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం నామినేషన్ పత్రాలు దాఖలు చేయడం కేసీఆర్ కు ఆనవాయితీ… అదే ఒరవడిని కొనసాగిస్తూ మంత్రి హరీశ్ రావు కూడా 2004 ఎన్నికల నుండి పెద్ద సారును ఫాలో అవుతూ విజయాలను నమోదు చేసుకుంటున్నారు. ఈసారి కూడా నామినేషన్ ఈ నెల 9వ తేదీన గజ్వెల్ రిటర్నింగ్ అధికారి ఎదుట నామినేషన్ పత్రాలను కేసీఆర్ దాఖలు చేయనున్నారు..ఐదు రోజుల ముందునే స్వామివారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఎన్నికల ప్రచారంలో కెసిఆర్, హరీష్ రావులు బిజీ బిజీగా ఉండడం, రేపు మంచి రోజు కావడంతో నామినేషన్ పత్రాలు పూర్తిచేసి పూజలు నిర్వహించేందుకు ఏర్పాటు చేసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారం లో భాగంగా అన్ని నియోజకవర్గాల్లో సభలు నిర్వహిస్తుండడం,హరీశ్ రావుకు ఉమ్మడి మెదక్ జిల్లా బాధ్యతలు అప్పగించడంతో బిజీ బిజీ షెడ్యూల్ తో సభలలో పాల్గొంటున్నారు. కెసిఆర్ ఈ నెల 9వ తేదీన గజ్వేల్ రిటర్నింగ్ అధికారి వద్ద, సిద్దిపేట రిటర్నింగ్ అధికారి వద్ద హరీష్ రావు నామినేషన్ పాత్రాలను దాఖలు చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. బిఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్,హరీశ్ రావు లకు ఘనంగా స్వాగతం చెప్పేందుకు గ్రామస్తులు సిద్ధమయ్యారు ఎలక్షన్ల ప్రతిసారి కెసిఆర్,హరీశ్ రావులు ఈ గ్రామానికి రానుండడంతో గ్రామంలో పండుగ వాతావరణంలో వారికి ఘన స్వాగతం చెప్పేందుకు మహిళలు గ్రామస్తులు సిద్ధమయ్యారు.
కేసీఆర్ మళ్లీ గెలవకపోతే హైదరాబాద్ అభివృద్ధి ఆగిపోతుందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. పుట్టుక నుంచి చివరి దాక చూసుకునేలా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయమన్నారు. భారాస పాలనలో హైదరాబాద్ విశ్వనగరంగా ఎదిగిందన్నారు. హైదరాబాద్‌లో ఉంటే అమెరికాలో ఉన్నట్లుందని రజినీకాంత్ అన్నారు. హైదరాబాద్‌లోనే ఇల్లు కొనుక్కోవాలని అనిపిస్తోందని భాజపా ఎంపీ సన్ని దేవోల్ అన్నారు. హైదరాబాద్ అభివృద్ధి అందరికీ కనిపిస్తోంది. కానీ, విపక్షాలకు కనిపించట్లేదు అని విమర్శించారు. సంపద పెంచాలి.. పేదలకు పంచాలి అనేదే కేసీఆర్ సిద్ధాంతం అని కేటీఆర్ అన్నారు. ఈ తొమిదిన్నరేళ్లు అద్భుతంగా పరిపాలన చేసిన కేసీఆర్‌ను ఇంటికి పంపిస్తామని కొంతమంది మాట్లాడుతున్నారు. ఇంత బ్రహ్మాండంగా ప్రజలకు సేవ చేస్తున్న నాయకుడికి ప్రజలు ఎందుకు ఓటు వేయొద్దు? కేసీఆర్‌కు ఎందుకు ఓటు… వేయొద్దంటున్నారో ప్రజలు ప్రశ్నించాలి. ఎవరో వచ్చి ఏవేవో మాట్లాడుతారు. వారు చెప్పిన మాటలు విని ఆగమైతే.. ఎక్కడి అభివృద్ధి అక్కడే ఆగిపోతుంది. ఇదే జరిగితే కాంగ్రెస్ హయాంలో పడిన ఇబ్బందులు, సమస్యలు మళ్లీ మొదలవుతాయి అని కేటీఆర్ తెలిపారు.
బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ శనివారం కోనాయిపల్లి రానున్నారు. తాను సెంటిమెంట్‌గా భావించే వెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, నామినేషన్ల పత్రాలపై సంతకాలు చేయనున్నారు. 1983లో టీడీపీ తరఫున తొలిసారి సిద్దిపేట ఎమ్మెల్యేగా బరిలోకి దిగిన కేసీఆర్.. ఓటమి పాలయ్యారు. 1985లో వచ్చిన మధ్యంతర ఎన్నికల సందర్భంగా సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం కోనాయిపల్లిలోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో పూజలు నిర్వహించి.. నామినేషన్ దాఖలు చేశారు. ఆ ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించడంతో కోనాయిపల్లి ఆలయంలో పూజలు చేసి, నామినేషన్లు దాఖలు చేయడం కేసీఆర్‌కు సెంటిమెంట్‌గా మారింది. అప్పటి నుంచి ప్రతి ఎన్నికల సమయంలోనూ కేసీఆర్ ఇదే ఆలయానికి వచ్చి పూజలు చేసిన అనంతరం నామినేషన్ వేస్తున్నారు.ఈ అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాల నుంచి బరిలో దిగుతున్న కేసీఆర్ ఈసారి కూడా వెంకటేశ్వరస్వామి ఆలయంలో పూజలు నిర్వహించిన తర్వాత రెండు వేర్వేరు నామినేషన్ సెట్లపై సంతకాలు చేయనున్నారు. ఈనెల 9న ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో నామినేషన్లు దాఖలు చేయనున్నారు. కాగా, మంత్రి హరీశ్‌రావు సైతం కేసీఆర్‌తోపాటు ఇదే ఆలయంలో నామినేషన్ పత్రాలపై సంతకాలు చేసే ఆనవాయితీని 2004 నుంచి కొనసాగిస్తున్నారు.
భైంసాలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఎన్నికల నేపథ్యంలో ప్రజలను ఆగమాగం చేయాలని ప్రతిపక్షాలు చూస్తున్నాయని, కానీ ఆలోచించి ఓటేయాలన్నారు. ప్రతిపక్షాలు అబద్దాలు, గాలిమాటలు చెబుతున్నాయన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల వద్ద ఉన్న ఒకే ఒక వజ్రాయుధం ఓటు అన్నారు. ఈ ఓటును మంచిగా వినియోగించుకోవాలన్నారు. ప్రతిపక్షాల మాయలో ఎవరూ పడవద్దన్నారు. ఏ పార్టీ వైఖరి ఎలా ఉందో ప్రజలంతా పరిగణలోకి తీసుకోవాలన్నారు. బీఆర్ఎస్ పాలనలో భైంసాలో రోడ్లు ఎలా వెడల్పు అయ్యారో అందరూ చూస్తున్నారన్నారు. కులం, మతం లేకుండా మనం అభివృద్ధిలో ముందుకు సాగుతోందన్నారు. కాంగ్రెస్ నేతలు ఇన్నాళ్లు దళితులను ఓటుబ్యాంకుగా మార్చుకున్నారు తప్ప వారికి చేసిందేమీ లేదన్నారు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం దళితబంధును తీసుకువచ్చింది అని కేసీఆర్ అన్నారు. బీఆర్ఎస్ వచ్చాక ఎరువుల కొరత లేదన్నారు. భైంసాలో, ముధోల్‌లో ఇలా అన్నిచోట్ల హిందువులు, ముస్లింలు ఉన్నారని, కానీ భైంసాలో చిచ్చుపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని కేసీఆర్ విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ పదేళ్ల కాలంలో కర్ఫ్యూలు, ధర్నాలు లేవన్నారు. విద్వేషాలు రెచ్చగొట్టే వారిని దూరం పెట్టాలన్నారు. అన్ని మతాలు, కులాల వాళ్లం కలిసి ముందుకు సాగుదామన్నారు. బీఆర్ఎస్ మరోసారి గెలిస్తేనే తెలంగాణ మరింత ముందుకు సాగుతుందన్నారు. స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి విఠల్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
కేసీఆర్ పదేళ్ల పాలనలో తెలంగాణలో తగ్గని పేదరికం.. APలో CMజగన్ నాలుగేళ్ల పాలనలో తగ్గిందని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. ‘వర్షమొస్తే HYDలో అన్నీ కొట్టుకుపోతున్నాయి. తెలంగాణ సెంటిమెంట్ ఇక వర్కౌట్ కాదు. రైతుల నుంచి బియ్యాన్ని కొనలేకపోతున్నామన్న కేసీఆర్ వ్యాఖ్యలు తప్పు. APలో పండుతున్న సన్నబియ్యాన్నే ఎక్కువ ధరకు కొని TS వాళ్లు తింటున్నారు. 3 రాజధానుల విజన్‌లో APని అభివృద్ధి చేస్తాం’ అని అన్నారు.
ఎన్నికలు ఉన్నా లేకపోయినా ప్రజాసేవే లక్ష్యంగా పని చేశానని, ప్రజల కోసం పని చేసే వ్యక్తికి ఓటు వేయాలని బిఅర్ఎస్ పార్టీ అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య కోరుకున్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం రామానగరం గ్రామంలో ప్రచార రథంపై ఎన్నికల ప్రచారాన్ని సండ్ర వెంకట వీరయ్య ప్రారంభించారు. ముందుగా గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల కోసం చాలామంది నాయకులు వస్తూపోతూ ఉంటారని అలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. రాజకీయ అవసరం కోసం కాకుండా మానవతా దృక్పథంతో సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని తీసుకువచ్చారని దళితులను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి దళిత బంధు పదాన్ని ఉచ్చరించే అర్హత లేదన్నారు. పనిచేసే ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని, దళితులను ఏమాత్రం పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విస్మరించాలని పిలుపునిచ్చారు..
రాజకీయ నాయకులు ప్రజలకు చేసేది చెప్పాలి కానీ వ్యక్తిగత దూషణలు చేయొద్దని , రాజకీయాలు నూతన తరానికి ఆదర్శంగా ఉండాలని
శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మీడియా సమావేశంలో అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక విజన్ ఉన్న నాయకుడని , తెలంగాణను కేసీఆర్ తప్ప ఎవరికి పాలించే అర్హత లేదన్నారు.ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12 కి 12 మంది BRS ఎమ్మెల్యే లు గెలవడం ఖాయమన్నారు. కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి అభ్యర్థులు 12 మంది ఉన్నారని మూడవ సారి కేసీఆర్ ముఖ్యమంత్రి అవడం ఖాయంమని ,ప్రజలు దీవించడానికి సిద్ధంగా వున్నారన్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2023లో పోటీ చేయటం లేదని ప్రకటించారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. వ్యతిరేక ఓటు చీల్చటం ఇష్టం లేకే ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారామె. నవంబర్ 3వ తేదీ పార్టీ కార్యాలయంలో మాట్లాడిన ఆమె.. ఈ మేరకు సంచలన ప్రకటన చేశారు. ఈ ఎన్నికల్లో పోటీ చేసి.. వ్యతిరేక ఓటును చీల్చటం ద్వారా.. కేసీఆర్ గెలుపునకు సాయం చేయాలనే ఉద్దేశం లేదని వివరించారామె. దేశంలోనే అతిపెద్ద సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ అని.. సోనియా, రాహుల్ గాంధీతో సమావేశం అయినప్పుడు.. వ్యతిరేక ఓట్లు చీల్చటం వల్ల ఉపయోగం లేదని సలహా, సూచన చేశారాన్నారు వైఎస్ షర్మిల. ఈ మేరకు ఈ నిర్ణయం తీసుకోవటం జరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఓట్లు చీల్చి.. కేసీఆర్ సీఎం అయితే.. చరిత్ర క్షమించదనే భయం కూడా ఉందన్నారు షర్మిల. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని.. కేసీఆర్ అవినీతి పాలనను అంతం చేసే అవకాశం ఉన్నందున.. కాంగ్రెస్ పార్టీకి.. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పూర్తి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారామె.
ఎన్నికల్లో నిర్దిష్టమైన విధానాలతోనే ప్రజల వద్దకు వెళ్తున్నామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రేవంత్ మాట్లాడారు. తాము ఎన్నుకున్న ప్రభుత్వాన్ని చూసి ప్రజలే భయపడేలా బీఆర్ఎస్ పాలన ఉందని విమర్శించారు. కేసీఆర్ పాలన ఎలా ఉందో యువత, రైతులు, మహిళలు అడిగితే బాగా చెబుతారన్నారు. ఈ ప్రాంత ప్రజల పోరాటంలో న్యాయం, ధర్మం ఉందని నమ్మి.. ఎన్ని రాజకీయ ఇబ్బందులు ఎదురైనా సోనియా గాంధీ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారని రేవంత్ అన్నారు. ఈ పదేళ్లలో కేసీఆర్ ఏం చెప్పారు.. ఏం జరిగిందో ప్రజలు ఆలోచించాలని కోరారు. పేదల సంక్షేమం కోసం నిధులు ఉపయోగపడ్డాయో లేదో ఆలోచన చేయాలన్నారు. నిరసనలు తెలపడం వంటి ప్రజల ప్రాథమిక హక్కులను ప్రభుత్వం కాలరాసిందని ఆరోపించారు. స్వరాష్ట్రంలో ఎన్నో మార్పులు వస్తాయని ఆశించిన యువత ఆకాంక్షలు అడియాశలు అయ్యాయని రేవంత్ విమర్శించారు. పరీక్షల నిర్వహణలో టీఎస్పీఎస్సీ విఫలమైందని ఆరోపించారు. కేసీఆర్ ఇచ్చిన పాత హామీలనే అమలు చేయాలని ప్రజలు కోరుతున్నారన్నారు. తెలంగాణ కోసం ఎందరో యువకులు ప్రాణత్యాగం చేశారని.. రాష్ట్ర చిహ్నంలో ప్రజల త్యాగాల గుర్తులు ఉండాలన్నారు.





Total views : 89991