తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఎన్నో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. కేసీఆర్ హయాంలో ప్రభుత్వ సలహాదారులుగా ఉన్న వారిని రేవంత్ ప్రభుత్వం తొలగించింది. ఏడుగురు ప్రభుత్వ సలహాదారులను తొలగిస్తూ చీఫ్ సెక్రెటరీ ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో సోమేశ్ కుమార్, శోభ, జీఆర్ రెడ్డి, చెన్నమనేని రమేశ్, రాజీవ్ శర్మ, అనురాగ్ శర్మ, ఏకే ఖాన్ ఉన్నారు. వీరి స్థానంలో కొత్త సలహాదారులను నియమించనున్నారు. ప్రొఫెసర్ కోదండరామ్ ను ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా నియమించే అవకాశాలు ఉన్నాయి.
Kcr
సింగరేణి సంస్థ పురోగమనానికి TBGKS గెలుపు చాలా అవసరమని, సింగరేణి ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయమని ఆ సంఘం గౌరవ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. సింగరేణి సంస్థ ఎన్నికల నేపథ్యంలో సంఘ నాయకులు, ముఖ్య కార్యకర్తలు హైదరాబాద్ లో కవిత తో సమావేశమయ్యారు. కార్మికుల హక్కులు, ప్రయోజనాల సాధనకు సంస్థను నిద్రపోనివ్వబోమన్నారు. సింగరేణి అంటే సింహ గర్జన అని, అదే స్పూర్తితో పనిచేస్తూ సంస్థను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని కవిత అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో బొగ్గు గని కార్మికులు ప్రధాన భూమిక పోషించారని, సింగరేణి కార్మికులకు ఉన్న పోరాట స్పూర్తి జాతీయ సంఘాలకు కూడా లేదన్నారు. గనుల్లో కార్మికులు చేస్తున్న కష్టం, చిందిస్తున్న చెమట తెలంగాణలో వెలుగులు నింపుతోందని, కాబట్టి ధైర్యంగా పోరాటం చేయాలని దిశానిర్ధేశం చేశారు. అధికారం ఉన్నా, లేకున్నా తెలంగాణ కోసం పోరాటం చేసి సాధించామని, ఈ సింగరేణి ఎన్నికల్లో గులాబీ జెండాను ఎగరేస్తామనడంలో ఎలాంటి సందేహం లేదని కవిత తేల్చిచెప్పారు. ఎన్నికల్లో ఒక్కొక్కరు ఒక్కో కేసీఆర్ లా పనిచేయాలని సూచించారు. అతిత్వరలో తమ సంఘ మ్యానిఫెస్టోను విడుదల చేస్తుందని కవిత ప్రకటించారు.
కేసీఅర్ ను కలవడానికి సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి లోని వ్యవసాయ క్షేత్రానికి కేసీఅర్ సొంత గ్రామమైన చింతమడక గ్రామస్తులు తొమ్మిది బస్సులలో సుమారు 540 మంది గ్రామస్తులు కేసీఅర్ ఫార్మ్ హౌస్ కు చేరుకున్నారు. కేసీఅర్ ను కలవడానికి వచ్చిన గ్రామస్తులను ఫార్మ్ హౌస్ పోలిస్ సిబ్బంది ఫార్మ్ హౌస్ చెక్ పోస్ట్ వద్ద ఆపేశారు. పర్మిషన్ లేనిది లోనికి అనుమతి లేదని ఫార్మ్ హౌస్ లోపల నుండి మాకు సమాచారం ఇస్తే లోపలకు పంపిస్తామని పోలీసులు గ్రామస్తులకు చెప్పడం తో పర్మిషన్ కోసం గ్రామస్తులు మూడు గంటలు వెయిట్ చేశారు. ఆ తర్వాత కేసీఅర్ ను కలసి వెళ్లిపోయారు
తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి రేపు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఎల్బీ స్టేడియం వేదికగా జరిగే ఈ కార్యక్రమంలో రేవంత్ చేత గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. గురువారం మధ్యాహ్నం జరగనున్న ప్రమాణస్వీకారానికి రావాలని ఏఐసిసి చీఫ్ మల్లిఖార్జున్ ఖర్గేతో పాటు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పలు రాష్ట్రాల సీఎంలు, మాజీ సీఎంలు, వివిధ రాజకీయ పార్టీల నేతలకు టీపీసీసీ ఆహ్వానాలు పంపింది. అలాగే ఏపీ సీఎం వైఎస్ జగన్, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తో పాటు చంద్రబాబునాయుడుకి, కెసిఆర్ ను కూడా ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారు. కాంగ్రెస్ గెలుపులో కీలకపాత్ర పోషించిన కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ను ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఆహ్వానించారు. వీరితోపాటు హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్, తెలంగాణ అమరవీరుల కుటుంబాలకూ టీపీసీసీ ఆహ్వానం పంపింది. టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, ప్రొఫెసర్ హరగోపాల్, కంచె ఐలయ్యతో పాటు వివిధ కుల సంఘాల నేతలు, సినీ ప్రముఖులకు ఆహ్వానాలు వెళ్లాయి.
తెలంగాణను అభివృద్ధి చేయడం కేవలం బీజేపీకి మాత్రమే సాధ్యమని ఆ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ పేర్కొన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మూడు రాష్ట్రాలను బీజేపీ గెల్చుకుందని చెప్పారు. తెలంగాణలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదని, కేసీఆర్ చేసి వెళ్లిన అప్పులు తీర్చే క్రమంలో చతికిలపడుతుందని ఆయన జోస్యం చెప్పారు. ఏడాది లోపే ఆ పార్టీ కూడా చేతులెత్తేస్తుందని అన్నారు. ఆపై తెలంగాణలో కూడా బీజేపీ ప్రభుత్వమే వస్తుందని రాజా సింగ్ ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన డా బి ఆర్ అంబేద్కర్ వర్దంతి కార్యక్రమంలో రాజాసింగ్ పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలోని దళితులకు ఇచ్చిన ఏ హామీని కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు. రాజ్యాంగాన్ని మార్చేస్తానంటూ కేసీఆర్ వ్యాఖ్యానించడంతో ప్రజలు సీఎంనే మార్చేశారని చెప్పారు. రాష్ట్రంలో బీజేపీకి 8 ఎమ్మెల్యే సీట్లను ఇచ్చినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ అందరినీ ఐక్యంగా తీసుకెళ్లడం వల్లే తెలంగాణలో విజయం సాధించిందని సీపీఐ నేతలు అభిప్రాయపడ్డారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ టూరిజం శాఖలో వందల కోట్ల రూపాయల అవకతవకలు జరిగాయని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. పర్యాటక శాఖ మంత్రి, ఎండీకి తెలిసే ఈ అవినీతి జరిగింది. ప్రభుత్వం మారిందని అడ్మినిస్ర్టేషన్ కార్యాలయాన్ని తగలబెట్టారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ వ్యవస్థలను ధ్వంసం చేస్తోంది. ఏపీలో పొత్తులపై పార్టీల మధ్య స్పష్టత లేదని నారాయణ వ్యాఖ్యానించారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గెలిచిన ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్‌లో ఆయన పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గెలిచిన ఎమ్మెల్యేలకు శుభాకాంక్షలు తెలిపారు. వచ్చే నెల 16వ తేదీ వరకు మన ప్రభుత్వం కొనసాగే అవకాశం ఉన్నప్పటికీ ప్రజల తీర్పు నేపథ్యంలో హుందాగా తప్పుకున్నట్లు చెప్పారు. కొత్త ప్రభుత్వానికి మనం సహకరిద్దామని… ఏం జరుగుతుందో చూద్దామన్నారు. త్వరలో తెలంగాణ భవన్లో పార్టీ సమావేశం ఉంటుందని, ఫలితాలపై సమీక్ష ఉంటుందని వెల్లడించారు. త్వరలో పార్టీ శాసన సభా ప్రతిపక్ష నేతను ఎన్నుకుందామన్నారు.
తెలంగాణ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లు రాజీనామా చేశారు. తమ రాజీనామా లేఖలను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపారు. తెలంగాణ పునర్నిర్మాణంలో తమకు అవకాశం కల్పించిన కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాలకు అనుగుణంగా నడుచుకుంటామని స్పష్టం చేశారు. రాజీనామా చేసిన కార్పొరేషన్ల చైర్మన్లు డా. దూదిమెట్ల బాలరాజ్ యాదవ్, రవీందర్ సింగ్, డా.వాసుదేవ రెడ్డి, మన్నే క్రిశాంక్, గెల్లు శ్రీనివాస్ యాదవ్, పల్లె రవికుమార్ గౌడ్, పాటిమీద జగన్ మోహన్ రావు, అనిల్ కూర్మాచలం, గజ్జెల నగేష్, మేడె రాజీవ్ సాగర్, డా.ఆంజనేయులు గౌడ్, సతీష్ రెడ్డి, రామచంద్ర నాయక్, గూడూరి ప్రవీణ్, వాల్యా నాయక్ తదితరులు ఉన్నారు.
ప్రజా తీర్పును గౌరవిస్తున్నాం. ప్రపంచం మెచ్చేలా అభివృద్ధి , సంక్షేమ కార్యక్రమాలను తెలంగాణ లో అమలు చేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిది. ప్రజలు కాంగ్రెస్ ను ఆదరించడానికి కారణాలను లోతుగా అధ్యయనం చేయాల్సిఉంది. మా లోపాలను కచ్చితంగా సమీక్షించుకుంటాం. కొత్తగా కొలువు తీరబోతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి అభినందనలు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలు దిశగా కొత్త ప్రభుత్వం పని చేయాలని కోరుకుంటున్నాను.
తెలంగాణ ముఖ్యమంత్రి పదవికి కేసీఆర్ రాజీనామా చేశారు. ఆదివారం వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ ఓటమి చవిచూసింది. ఈనేపథ్యంలో కేసీఆర్ తన రాజీనామా లేఖను గవర్నర్‌కు పంపారు. కేసీఆర్ రాజీనామాను గవర్నర్ ఆమోదించినట్టు రాజ్‌భవన్ వర్గాలు తెలిపాయి. కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని గవర్నర్ సూచించినట్టు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 64 స్థానాల్లో విజయం సాధించి అధికారాన్ని కైవసం చేసుకుంది. సోమవారం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం.





Total views : 90019