తనపై వస్తున్న ఆరోపణలను కొట్టిపారేయడమే కాకుండా, లాయర్ సుబ్బారావుపై సింగర్ మంగ్లీ ఎదురుదాడికి దిగారు. ఈ మేరకు ఇటీవల నార్సింగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. లాయర్ సుబ్బారావు తనపై ఫిర్యాదు చేయడానికంటే ముందే, తానే నార్సింగి పోలీసులను ఆశ్రయించానని మంగ్లీ స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నోట్ల కట్టల దృశ్యాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని మంగ్లీ తేల్చి చెప్పారు. ఆ డబ్బు తనది కాదు, ఆ వ్యవహారంతో తనకు సంబంధం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.లాయర్ సుబ్బారావు ఉద్దేశపూర్వకంగానే తనను బదనాం చేస్తున్నారని, తన వ్యక్తిత్వాన్ని హననం చేసేలా తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంగ్లీ మండిపడ్డారు. వ్యక్తిగతంగా కావాలని తనను టార్గెట్ చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు. నిరాధారమైన ఆరోపణలతో మనోభావాలను దెబ్బతీస్తే ఊరుకునేది లేదని మంగ్లీ హెచ్చరించారు. ఒక మహిళగా, కళాకారిణిగా సమాజంలో తనకున్న గుర్తింపును దెబ్బతీయాలని చూస్తున్న వారిపై చట్టపరంగా ముందుకెళ్తానని ఆమె వెల్లడించారు
కాగా, మంగ్లీపై పంజాగుట్ట పోలీసుస్టేషన్లో కేసు నమోదైన విషయం తెలిసిందే. మైక్రో ఫైనాన్స్ పేరిట 10కోట్ల రూపాయల మేర మోసం చేసినట్లు మంగ్లీ, ఆమె సోదరుడితో మరో ముగ్గురిపై న్యాయవాది సుబ్బారావు ఫిర్యాదు చేశారు. తనకు వారి నుంచి ప్రాణహాని ఉందని ఫిర్యాదులో న్యాయవాది పేర్కొన్నారు. దీంతో బీఎన్ఎస్ సెక్షన్ 351(2), 352 కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ప్రముఖ ఫోక్ సింగర్ మంగ్లీ అలియాస్ సత్యవతిపై పంజాగుట్ట పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. మైక్రో ఫైనాన్స్ పేరిట రూ.10 కోట్లు పెట్టుబడి మోసానికి సంబంధించిన వ్యవహారంలో బాధితుల తరపున వాదిస్తున్న న్యాయవాదిని బెదిరించారనే ఆరోపణలు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి. ఈ కేసులో మంగ్లీతో పాటు ఆమె సోదరుడు శివ, ‘విరాటపర్వం’ చిత్ర దర్శకుడు వేణు ఊడుగుల పేర్లు కూడా చేరడం గమనార్హం.
దాదాపు 100 మంది అమాయక బాధితుల నుంచి అధిక లాభాల ఆశచూపి కోట్లు రూపాయలు వసూలు చేశారన్నది ప్రధాన ఆరోపణ. వ్యాపార పెట్టుబడుల పేరుతో ఈ సొమ్ము సేకరించినట్లుగా తెలుస్తోంది. అయితే, ఏళ్లు గడుస్తున్నా లాభాలు రాకపోవడమే కాకుండా, కనీసం అసలు డబ్బు కూడా తిరిగి ఇవ్వకపోవడంతో బాధితులు న్యాయవాది సుబ్బారావును ఆశ్రయించారు. కాగా బాధితుల తరపున న్యాయవాది సుబ్బారావు ఈ నిధులను వెనక్కి ఇవ్వాలని నిలదీయగా, మంగ్లీ టీమ్ నుంచి ఆయనకు బెదిరింపులు మొదలయ్యాయి.
అయితే, మంగ్లీ, ఆమె సోదరుడు శివ, దర్శకుడు వేణు ఊడుగుల తనకు ఫోన్ చేసి తీవ్రంగా హెచ్చరించారని, తనను రోడ్డు ప్రమాదంలో చంపేస్తామని భయపెట్టారని సుబ్బారావు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదును సీరియస్‌గా తీసుకున్న పంజాగుట్ట పోలీసులు BNS సెక్షన్ 351 (2), 352 కింద కేసు నమోదు చేశారు. మంగ్లీకి ఉన్న క్రేజ్ రీత్యా ఈ కేసు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్‌లో దర్శకుడు వేణు ఊడుగుల ప్రమేయం ఎంతవరకు ఉందనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అక్రమంగా నిధులు వసూలు చేశారా..లేక ఈ వ్యవహారం వెనుక ఇతర శక్తులు ఉన్నాయా? అనే విషయాలు పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది..




Total views : 62057