నీట్ లీక్‌పై ఆందోళనలు చేసి కేంద్రమంత్రిని రాజీనామా చేయించిన విద్యార్థులకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. నెక్లెస్ రోడ్డులో నిర్వహించిన క్యాండిల్ ర్యాలీలో పాల్గొన్న ముఖ్యమంత్రి.. కీలక వ్యాఖ్యలు చేశారు. కొన్ని దేశాల్లో 18ఏళ్లు పూర్తయితే చట్టసభలకు వెళ్లవచ్చని, 21ఏళ్లు వస్తే సింగపూర్‌లో ప్రధాని కావొచ్చన్నారు. ఆగస్టు తొలివారంలో తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి.. దేశంలో ఎమ్మెల్యే, ఎంపీగా పోటీ చేసేందుకు 21ఏళ్లు ప్రధాన అర్హతగా తీర్మానం చేసి ప్రధాని మోదీకి పంపుతానన్నారు. జంతర్ మంతర్ వీధుల్లో ధర్నా చేయడమే కాకుండా.. లోక్ సభ, రాజ్యసభలో యువత గళాన్ని విప్పేలా చేస్తామన్నారు.
యువత ఆందోళనలకు కేంద్రం తలొగ్గిందని, ఇది యువత సాధించిన విజయమన్నారు. యువత తలచుకుంటే చేయలేనిదేదీ లేదని నిరూపించారన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు విద్యార్థుల ఉద్యమమే కారణమని, దీనిని కాంగ్రెస్ ఖాతాలో ఎట్టిపరిస్థితుల్లోనూ వేసుకోబోమని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలపై తాము పోరాడుతామని విద్యార్థులు దేశానికొక సందేశమిచ్చారన్నారు. దేశ భవిష్యత్ అంతా యువతరానిదేనని, యువత బాగుంటేనే దేశం బాగుంటుందన్నారు. కేంద్రంతో సీజేపీ జరిపిన చర్చల్లో ఇంకా కొన్ని డిమాండ్లు పెండింగ్‌లోనే ఉన్నాయన్నారు ముఖ్యమంత్రి. విద్యార్థులపై పెట్టిన కేసుల్ని ఇంకా విత్ డ్రా చేసుకోలేదని, సోమవారం నాటికి కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్రం ఝుళిపించిన లాఠీఛార్జీలు, తూటాలు యువతను భయపెట్టలేదన్నారు.