Sunday, May 31, 2026
News Navigation
Sunday, May 31, 2026
News Navigation

Breaking

Sunday, May 31, 2026
Home Andhra Pradesh జగ్గంపేటలో శిథిలావస్థలో జిల్లా పరిషత్ ట్రావెల్స్ బంగ్లా..

జగ్గంపేటలో శిథిలావస్థలో జిల్లా పరిషత్ ట్రావెల్స్ బంగ్లా..

by CVR NEWS
జగ్గంపేటలో శిథిలావస్థలో జిల్లా పరిషత్ ట్రావెల్స్ బంగ్లా

జగ్గంపేట పట్టణంలోని జగ్గంపేట–గోకవరం ప్రధాన రోడ్డుపై ఉన్న జిల్లా పరిషత్ ట్రావెల్స్ బంగ్లా గత 12 సంవత్సరాలుగా శిథిలావస్థలో ఉండటం స్థానికుల్లో ఆందోళన కలిగిస్తోంది. సుమారు 80 సెంట్ల విస్తీర్ణంలో ఉన్న ఈ ప్రభుత్వ భవనం ఒకప్పుడు అధికారుల విశ్రాంతి కేంద్రంగా ఉపయోగపడేది. 2008లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గండేపల్లి మండలం తాళ్లూరు గ్రామంలో తోట వెంకటాచలం ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవానికి విచ్చేసిన సందర్భంగా, జగ్గంపేటలో సోనియా గాంధీ బహిరంగ సభ నిర్వహించడంతో విడిది కోసం ఈ బంగ్లాను జిల్లా పరిషత్ నిధులతో రూ.2 లక్షలు వెచ్చించి మరమ్మతులు చేపట్టారు. అనంతరం ప్రజాప్రతినిధులు తమ వ్యక్తిగత గెస్ట్ హౌస్‌లను ఏర్పాటు చేసుకోవడంతో ఈ భవనం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఈ స్థలం కబ్జాలకు గురయ్యే ప్రమాదం కూడా నెలకొంది. వెంటనే అధికారులు స్పందించి భవనాన్ని పునరుద్ధరించి ప్రభుత్వ అవసరాలకు వినియోగంలోకి తీసుకురావాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

మెట్టప్రాంత ఏజెన్సీ ప్రాంతాలకు ప్రధాన ద్వారంగా పేరుగాంచిన జగ్గంపేటలో అధికారులకు సరైన విశ్రాంతి భవనం లేక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కాకినాడ నుంచి భద్రాచలం వెళ్లే అధికారులు, రాజమండ్రి నుంచి విశాఖపట్నం ప్రయాణించే ప్రజాప్రతినిధులు, అలాగే పోలవరం కాలువలు, పుష్కర కెనాల్ పనులను పరిశీలించేందుకు వెళ్లే ఉన్నతాధికారులు ప్రతిరోజూ ఈ మార్గంలో రాకపోకలు సాగిస్తున్నారు. అయితే ప్రభుత్వానికి చెందిన ఆర్&బీ గెస్ట్ హౌస్ పూర్తిగా శిథిలావస్థకు చేరుకోవడంతో ఉపయోగించుకోలేని పరిస్థితి ఏర్పడింది. మాజీ ఎమ్మెల్యేలు గానీ, ప్రస్తుత ప్రజాప్రతినిధులు గానీ ఈ భవనం పునరుద్ధరణపై సరైన దృష్టి పెట్టలేదని స్థానికులు విమర్శిస్తున్నారు. విలువైన ప్రభుత్వ స్థలం ఆక్రమణలకు గురికాకముందే తక్షణ చర్యలు తీసుకొని ఆధునిక సౌకర్యాలతో గెస్ట్ హౌస్‌ను అభివృద్ధి చేయాలని ప్రజలు కోరుతున్నారు. ప్రజాప్రతినిధులు స్పందించి ఈ సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

018683
Total views : 89167

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.