Sunday, May 31, 2026
News Navigation
Sunday, May 31, 2026
News Navigation

Breaking

Sunday, May 31, 2026
Home Andhra Pradesh నేటి నుంచే టీడీపీ మహానాడు..

నేటి నుంచే టీడీపీ మహానాడు..

by CVR NEWS
నేటి నుంచే టీడీపీ మహానాడు

తెలుగుదేశం పార్టీ శ్రేణులకు పండుగలాంటి మహానాడుకు సర్వం సిద్ధమైంది. పార్టీ ఆవిర్భావం నుంచి ఓ సంప్రదాయంగా, చారిత్రక అవసరంగా నిర్వహిస్తున్న ఈ మెగా ఈవెంట్, 2026 సంవత్సరానికి సరికొత్త రీతిలో, నూతన ఉత్తేజంతో జరగనుంది. నేడు, రేపు రెండు రోజులపాటు అమరావతి కేంద్రంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. స్త్రీ శక్తిని ప్రధాన ఇతివృత్తంగా తీసుకుని, మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ఈ మహానాడును తీర్చిదిద్దారు. 44 ఏళ్ల పార్టీ ప్రస్థానంలో ఎదురైన అనుభవాలను నెమరువేసుకుంటూ, వర్తమాన రాజకీయ పరిస్థితులను విశ్లేషించుకుని, 2029 ఎన్నికల లక్ష్యంగా భవిష్యత్ కార్యాచరణకు పదునుపెట్టేందుకు ఈ వేదికను సిద్ధం చేశారు. ఈ మహానాడు వేదికగా వచ్చే ఎన్నికలకు చంద్రబాబు రోడ్ మ్యాప్ ప్రకటించనున్నారు.

ఈసారి మహానాడు నిర్వహణలో టీడీపీ వినూత్న పంథాను అనుసరిస్తోంది. వాస్తవానికి ఈ కార్యక్రమాన్ని నెల్లూరులో భారీ ఎత్తున నిర్వహించాలని తొలుత భావించారు. అయితే, పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఇంధన పొదుపు చర్యలు పాటించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపునకు టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. దీనికి అనుగుణంగా, భారీ జన సమీకరణకు బదులుగా ఇంధనాన్ని ఆదా చేసే లక్ష్యంతో మహానాడును హైబ్రిడ్ పద్ధతిలో నిర్వహించాలని నిర్ణయించారు.

పార్టీ కేంద్ర కార్యాలయంలో పొలిట్‌బ్యూరో సభ్యులు, జాతీయ, రాష్ట్ర కార్యవర్గాలు భౌతికంగా పాల్గొంటాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలు, కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా 18 వందలకు పైగా క్లస్టర్ల నుంచి వర్చువల్‌గా పాలుపంచుకుంటారు. ఈ క్లస్టర్లలో భారీ స్క్రీన్లు ఏర్పాటు చేసి, క్షేత్రస్థాయిలోనూ పండుగ వాతావరణం ఉండేలా ఏర్పాట్లు పూర్తి చేశారు. రెండు రోజుల మహానాడులో మొత్తం 20 తీర్మానాలపై చర్చించి ఆమోదించనున్నారు. వీటిలో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించినవి 10, తెలంగాణకు 4, అండమాన్‌కు 1, ఉభయ రాష్ట్రాలకు వర్తించేవి 4 ఉన్నాయి. చివరిగా అత్యంత కీలకమైన రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెడతారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు కావస్తున్న నేపథ్యంలో, ప్రభుత్వ పనితీరు, సంక్షేమ పథకాల అమలు వంటి అంశాలపై చర్చించనున్నారు. ముఖ్యంగా 2029 సార్వత్రిక ఎన్నికలకు పార్టీని సంసిద్ధం చేసేందుకు అవసరమైన రోడ్‌మ్యాప్‌ను ఈ మహానాడు వేదికగా ఆవిష్కరించనున్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు ఇక్కడినుంచే శ్రేణులను సమాయత్తం చేయనున్నారు

ఇవాళ ఉదయం 9 గంటలకు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ జెండాను ఆవిష్కరించి, ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి మహానాడును ప్రారంభిస్తారు. అనంతరం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ప్రారంభోపన్యాసం చేస్తారు. పార్టీ ఆర్థిక వ్యవహారాల నివేదికను సమర్పించిన తర్వాత, చంద్రబాబు కార్యకర్తలను ఉద్దేశించి కీలక ప్రసంగం చేస్తారు. స్త్రీ శక్తి, కార్యకర్తే అధినేత, పేదల సేవ వంటి అంశాలపై తీర్మానాలు ప్రవేశపెట్టి ఆమోదిస్తారు. రెండో రోజు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించడంతో కార్యక్రమాలు మొదలవుతాయి. తెలుగుజాతి విశ్వఖ్యాతి, అన్నదాతకు అండగా, విధ్వంసం నుంచి వికాసం వైపు, సంపద సృష్టి వంటి పలు కీలక అంశాలపై చర్చలు, తీర్మానాలు ఉంటాయి. చంద్రబాబు ముగింపు ఉపన్యాసంతో మహానాడుకు తెరపడుతుంది. ఈ మహానాడులో మరో ప్రత్యేక ఆకర్షణ నారా లోకేష్. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన పాల్గొంటున్న తొలి మహానాడు ఇదే కావడంతో, ఆయన ప్రసంగంపై పార్టీ శ్రేణుల్లోనే కాక, రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర ఆసక్తి నెలకొంది. యువతకు, కార్యకర్తలకు ఆయన ఎలాంటి దిశానిర్దేశం చేస్తారనేది ఉత్కంఠగా మారింది. మొత్తంగా ఈ మహానాడు ద్వారా పార్టీలో నూతనోత్తేజం నింపి, రాబోయే రాజకీయ సవాళ్లకు పటిష్టమైన వ్యూహంతో సిద్ధం కావాలని టీడీపీ నాయకత్వం భావిస్తోంది.

 

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

018645
Total views : 89071

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.