Friday, September 11, 2026
News Navigation
Friday, September 11, 2026
News Navigation

Breaking

Friday, September 11, 2026
Home Andhra Pradesh రైతుల ఆశాదీపం ఇప్పుడు తుప్పు పట్టిన జ్ఞాపకమా?

రైతుల ఆశాదీపం ఇప్పుడు తుప్పు పట్టిన జ్ఞాపకమా?

by CVR NEWS
రైతుల ఆశాదీపం ఇప్పుడు తుప్పు పట్టిన జ్ఞాపకమా?

ఉత్తరాంధ్ర రైతాంగానికి ఒకప్పుడు ఆర్థిక బలంగా నిలిచిన శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస చక్కెర కర్మాగారం… ఇప్పుడు కేవలం తీపి జ్ఞాపకంగా మిగిలిపోతుందా అనే ఆందోళన వ్యక్తమవుతోంది. 1958లో స్థాపించబడిన ఈ ఫ్యాక్టరీ, దశాబ్దాల పాటు వేలాది మంది రైతులకు ఊతంగా , వందలాది కుటుంబాలకు ఉపాధిగా నిలిచింది. చెరకు సాగుకు ప్రోత్సాహం ఇచ్చి, స్థానిక ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపించిన ఈ పరిశ్రమ నేడు తుప్పు పట్టిన యంత్రాలతో నిర్జీవంగా కనిపిస్తోంది. ఒకప్పుడు యంత్రాల హోరుతో మారుమోగిన ప్రాంగణం ఇప్పుడు నిర్మానుష్యంగా మారింది. ప్రభుత్వాల నిర్లక్ష్యం, నీటి సమస్యలు, సరైన ప్రణాళికల లోపం, ప్రైవేటు పోటీ ప్రభావం కలిసి ఈ కర్మాగారాన్ని సంక్షోభంలోకి నెట్టాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు ఆమదాలవలస షుగర్ ఫ్యాక్టరీ మళ్లీ పూర్వవైభవం సంతరించుకోవాలని రైతులు, కార్మికులు కోరుతున్నారు…

1961లో క్రషింగ్ పనులు ప్రారంభించిన ఆమదాలవలస చక్కెర కర్మాగారం ఉత్తరాంధ్రలోనే ఒక ప్రధాన పరిశ్రమగా ఎదిగింది. రోజుకు 1200 మెట్రిక్ టన్నుల చెరకు క్రషింగ్ సామర్థ్యంతో పనిచేసిన ఈ ఫ్యాక్టరీ, సీజన్ సమయంలో వేలాది మంది కార్మికులకు ఉపాధి కల్పించేది. సుమారు 1500 మంది సీజనల్, పర్మినెంట్, ఒప్పంద కార్మికులు ఈ కర్మాగారంపై ఆధారపడి జీవించేవారు. అంతేకాదు, దాదాపు 12 వేల మంది షేర్ హోల్డర్లు ఈ ఫ్యాక్టరీతో అనుబంధం కలిగి ఉండేవారు. అయితే కాలక్రమేణా పరిస్థితులు మారిపోయాయి. చెరకు దిగుబడులు తగ్గడం, నీటి కొరత తీవ్రతరం కావడం, ప్రభుత్వాల నిర్లక్ష్యం వంటి కారణాలతో కర్మాగారం క్రమంగా నష్టాల్లోకి వెళ్లింది. దీనికి తోడు సమీపంలోని సంకలి చక్కెర కర్మాగారానికి అనుమతులు రావడంతో రైతులు అక్కడికి మళ్లిపోయారు. ఫలితంగా ముడిసరుకు కొరత ఏర్పడి ఆమదాలవలస ఫ్యాక్టరీ పూర్తిగా కుంగిపోయింది.ఆమదాలవలస చక్కెర కర్మాగారం మూతపడటం కేవలం ఒక పరిశ్రమ మూతపడటమే కాదు… ఉత్తరాంధ్రలో వేలాది కుటుంబాల జీవనాధారాన్ని కోల్పోవడమేనని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు చెరకు డబ్బులతో పిల్లలను చదివించుకున్న రైతులు, కార్మికులు నేడు ఉపాధి కోసం వలసలు వెళ్లాల్సిన పరిస్థితి ఎదుర్కొంటున్నారు. 2004లో ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రైతులు, కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేసారు . తర్వాత పాలకులు పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు. ఇప్పుడు 74 ఎకరాల విలువైన భూమి భూకబ్జాదారుల కళ్లలో పడిందన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. పరిశ్రమ పునరుద్ధరణకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మళ్లీ యంత్రాలు తిరగాలి… రైతులు చెరకు సాగు చేయాలి… యువతకు ఉపాధి రావాలి… ఇదే ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్ష. ప్రభుత్వం స్పందిస్తేనే ఆమదాలవలస చక్కెర కర్మాగారానికి మళ్లీ తీపి రోజులు వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: