తెలంగాణలో ఆయుష్ వైద్య విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ఆయుర్వేద, హోమియోపతి, యునాని, నాచురోపతి విభాగాల్లోని హౌస్ సర్జన్లు, పీజీ విద్యార్థుల స్టైఫండ్‌లను అల్లోపతి వైద్య విద్యార్థులతో సమానంగా పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో హౌస్ సర్జన్ల స్టైఫండ్ రూ.13,754 నుంచి రూ.29,792కు, పీజీ విద్యార్థుల స్టైఫండ్ రూ.34,385 నుంచి రూ.74,482కు పెరిగింది.
తమ చిరకాల డిమాండ్‌ను నెరవేర్చినందుకు ఆయుష్ విద్యార్థులు, వైద్యులు సచివాలయంలో ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. గత పదేళ్లలో తమ స్టైఫండ్‌లను పెంచలేదని, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నామని మంత్రికి వివరించారు. తమ సమస్యను పరిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి దామోదర రాజనర్సింహకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఆయుష్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోందని మంత్రి తెలిపారు. సుమారు 700 మంది యోగా ఇన్‌స్ట్రక్టర్లు, 138 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకం చేపట్టామని చెప్పారు. సిద్దిపేట, జయశంకర్ భూపాలపల్లి, వికారాబాద్‌లో 50 పడకల సమీకృత ఆయుష్ ఆసుపత్రులు ఏర్పాటు చేశామని, కరీంనగర్‌లో రూ.15 కోట్లతో మరో ఆసుపత్రి నిర్మాణం ప్రారంభమైందన్నారు. సాంప్రదాయ వైద్య పరిజ్ఞానాన్ని ఆధునిక పద్ధతులతో అనుసంధానించి పరిశోధనలపై దృష్టి సారించాలని, పేదలు, గ్రామీణ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని విద్యార్థులకు సూచించారు.