తెలంగాణను ప్రపంచ పెట్టుబడులు, వ్యవసాయ వాణిజ్యం, పారిశ్రామిక అవకాశాలకు ప్రధాన గమ్యస్థానంగా నిలిపే లక్ష్యంతో 2026 డిసెంబర్‌లో హైదరాబాద్‌లో నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ సమ్మిట్‌కు హాజరుకావాలని ఫిలిప్పీన్స్ వ్యవసాయ శాఖ కార్యదర్శి ఫ్రాన్సిస్కో పి.టియు లారెల్ జూనియర్‌ను మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆహ్వానించారు. న్యూఢిల్లీలో ఫిలిప్పీన్స్ వ్యవసాయ శాఖ కార్యదర్శితో మంత్రి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తెలంగాణ వ్యవసాయ ఉత్పత్తుల నాణ్యత, ఉత్పాదక సామర్థ్యం, ఎగుమతి అవకాశాలను వివరించారు.
తెలంగాణ రైజింగ్ సమ్మిట్ లక్ష్యాలు, రాష్ట్రంలో అందుబాటులో ఉన్న పెట్టుబడి అవకాశాలను మంత్రి ఉత్తమ్ వివరించారు. తెలంగాణ నుంచి ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతులను భారీగా పెంచడం, ఇరు ప్రాంతాల మధ్య వ్యవసాయ వాణిజ్య సంబంధాలను మరింత విస్తరించడం, దీర్ఘకాలిక వాణిజ్య భాగస్వామ్యాన్ని నెలకొల్పడంపై ఇరువురు విస్తృతంగా చర్చించారు.
తెలంగాణ నుంచి పెద్ద పరిమాణంలో బియ్యాన్ని కొనుగోలు చేసే అవకాశాలను పరిశీలిస్తామని ఫిలిప్పీన్స్ వ్యవసాయ శాఖ కార్యదర్శి సానుకూలంగా స్పందించినట్లు మంత్రి ఉత్తమ్ తెలిపారు. తెలంగాణలో ఉత్పత్తి అవుతున్న నాణ్యమైన మాంస ఉత్పత్తులు, అత్యుత్తమ ప్రమాణాలతో కూడిన విత్తనాల కొనుగోలుపైనా ఫిలిప్పీన్స్ ఆసక్తి వ్యక్తం చేసిందని వెల్లడించారు.