నేపాల్‌కు మరో భారీ ముప్పు పొంచి ఉంది. దార్చులా జిల్లాలోని అపి హిమల్ రూరల్ ప్రాంతం భట్టార్‌లో భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. కొండచరియలు విరిగిపడి చౌలానీ నది ప్రవాహానికి కొంత మేరకు అడ్డంకిగా మారాయి. దీంతో నదిలో నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరిగితే దిగువ ప్రాంతాల్లో వరద ముప్పు ఏర్పడే అవకాశం ఉందని అధికారులు అప్రమత్తమయ్యారు. నది ప్రవాహాన్ని అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. కొండచరియల కారణంగా నదికి అడ్డంకి ఏర్పడటంతో నీరు నిలిచి, ఒక్కసారిగా అడ్డంకి తొలగితే దిగువ ప్రాంతాలకు వరద పోటెత్తే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. దీంతో దిగువ ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలేందుకు సిద్ధంగా ఉండాలని సూచనలు జారీ చేశారు. ఇప్పటికే నేపాల్‌లో భారీ వరదలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. ఈ వరదల కారణంగా 1300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. తాజాగా చౌలానీ నదికి ఏర్పడిన అడ్డంకితో స్థానికుల్లో మరోసారి ఆందోళన నెలకొంది.
CVR NEWS
తెలంగాణలో ప్రజా పాలనను ప్రగతి పాలనగా ముందుకు తీసుకెళ్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా టీచర్ల సేవలను కొనియాడిన సీఎం.. తల్లిదండ్రులతో సమానంగా పిల్లల భవిష్యత్తుకు పునాదులు వేసేది ఉపాధ్యాయులేనని పేర్కొన్నారు. విద్యార్థులను తీర్చిదిద్దడంలో టీచర్ల పాత్ర కీలకమన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలు తగ్గాయని.. అయితే 2026-27లో ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పెరిగాయని తెలిపారు. రెండేళ్లలో ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేశామన్నారు. 2023 డిసెంబర్ 7న విద్యా రంగంలో తెలంగాణ 28వ స్థానంలో ఉండగా.. ప్రస్తుతం 17వ స్థానానికి చేరిందని చెప్పారు. పాలిటెక్నిక్ కళాశాలల్లో 95 శాతం సీట్లు భర్తీ అయ్యాయని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డీఎస్సీ పరీక్షలు, నియామకాలు పారదర్శకంగా చేపట్టామని.. 25,950 మంది టీచర్లకు ఎలాంటి సమస్యలు లేకుండా ప్రమోషన్లు ఇచ్చామని వెల్లడించారు. విద్యా వ్యవస్థలో ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించే బాధ్యత తనదేనని సీఎం స్పష్టం చేశారు.
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపారు. మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని ఆయనకు నివాళులర్పించారు. ఈ ఏడాది తొలిసారిగా హైదరాబాద్ వెలుపల వికారాబాద్ జిల్లా కొడంగల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రాష్ట్రస్థాయి ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు నిర్వహించారు.
వేడుకల్లో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొని ఉపాధ్యాయులను సన్మానించారు. రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు, ఇంటర్మీడియట్, టెక్నికల్, విశ్వవిద్యాలయాల నుంచి ఎంపికైన 123 మంది ఉపాధ్యాయులు, ఆచార్యులకు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు అందజేశారు. విద్యార్థుల భవిష్యత్తు, సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని రేవంత్ పేర్కొనగా.. గురువు స్థానం ఎంతో ఉన్నతమైనదని దామోదర రాజనర్సింహ కొనియాడారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్ ఛత్రినాకలో విజయోత్సవాలు నిర్వహించారు. తెలంగాణ బోయ వాల్మీకి వైస్ చైర్మన్, చాంద్రాయణగుట్ట నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి బోయ నగేష్ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి, టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలనకు ప్రాధాన్యత ఇస్తూ బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి అనేక పథకాలు అమలు చేస్తోందని బోయ నగేష్ తెలిపారు. రేషన్ కార్డులు, సన్నబియ్యం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, గృహజ్యోతి, రూ.500కే గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇళ్లతో పాటు యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. కాంగ్రెస్ సంక్షేమ కార్యక్రమాలను ఓర్వలేక బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనపై బహిరంగ చర్చకు రావాలని బోయ నగేష్ సవాల్ విసిరారు.
నేపాల్‌లో వరదలు, కొండచరియల విరిగిపడటంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. త్రిశూలి–3A జలవిద్యుత్ ప్రాజెక్టు టన్నెల్లో చిక్కుకున్న ఇద్దరు వ్యక్తులను రెస్క్యూ సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. దాదాపు తొమ్మిది రోజులుగా టన్నెల్లో చిక్కుకున్న వారిని తీవ్రంగా శ్రమించి రక్షించారు. ప్రతికూల వాతావరణ పరిస్థితులు, టన్నెల్లో నెలకొన్న క్లిష్ట పరిస్థితుల మధ్య సహాయక బృందాలు చేపట్టిన ఆపరేషన్‌లో ఇద్దరి ప్రాణాలను కాపాడగలిగారు. టన్నెల్లో ఇంకా మరికొందరు చిక్కుకుని ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే టన్నెల్లో చిక్కుకున్న వారి నుంచి శబ్దాలు వినిపించినట్లు సమాచారం అందడంతో.. రెస్క్యూ బృందాలు మరింత అప్రమత్తమయ్యాయి. మిగిలిన వారిని కూడా సురక్షితంగా బయటకు తీసుకువచ్చేందుకు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. భారీ వర్షాలు, వరదలు, కొండచరియల కారణంగా సహాయక చర్యలకు ఆటంకాలు ఎదురవుతున్నప్పటికీ.. బాధితులను రక్షించేందుకు అధికారులు, రెస్క్యూ సిబ్బంది నిరంతరం శ్రమిస్తున్నారు. ఇద్దరిని సజీవంగా రక్షించడం సహాయక చర్యల్లో కీలక పరిణామంగా మారింది.
అనన్య నాగళ్ల ‘లీసా’ షూటింగ్ పూర్తి; నవంబర్‌లో ఘనంగా విడుదలకు సిద్ధం.
అనన్య నాగళ్ల ‘లీసా’ షూటింగ్ పూర్తి; నవంబర్‌లో ఘనంగా విడుదలకు సిద్ధం ఓం సాయిరామ్ ఆర్ట్స్, ఐరాస్ (IRAHS) ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై వెంకట్ దుగ్గిరెడ్డి, రామకృష్ణ ఐల సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘లీసా’. విలక్షణమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రతిభావంతురాలైన నటి అనన్య నాగళ్ల ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. జవహర్ పవార్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు.
భారతీయ చిత్ర పరిశ్రమలో ఇప్పటివరకు రాని విధంగా రెండు భిన్నమైన జోనర్లను సరికొత్త పద్ధతిలో మేళవించి ‘లీసా’ కథను రూపొందించారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సతీష్ రెడ్డి మాసం ఈ చిత్రానికి కెమెరా బాధ్యతలు నిర్వర్తించడంతో పాటు స్క్రీన్‌ప్లే సమకూర్చి, సహ నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. ‘ఎస్సార్ కళ్యాణమండపం’ దర్శకుడు శ్రీధర్ గాదె ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. పులి రాకేష్ గౌడ్, కె. నరసింహులు, బనడ్ల శ్రీపతి నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్నారు.
కథ నచ్చడం తో ‘మెలోడీ బ్రహ్మ’ మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందిచడానికి సుముఖంగా ఉన్నారు , ఇది సినిమాకు ప్రధాన బలంగా నిలవనుంది. కూర్గ్, విరాజ్‌పేట, పెంచలకోన పరిసర ప్రాంతాల్లోని అద్భుతమైన లొకేషన్లలో అత్యున్నత నిర్మాణ విలువల (రిచ్ ప్రొడక్షన్ వేల్యూస్) తో భారీ స్థాయిలో ఈ సినిమాను చిత్రీకరించారు.
ఇటీవలే ‘లీసా’ షూటింగ్ విజయవంతంగా పూర్తయింది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు, నిర్మాతలు మాట్లాడుతూ: “మా సినిమా చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. చూసిన రషెస్ అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి, చిత్ర బృందం మొత్తం ఔట్పుట్ పట్ల ఎంతో నమ్మకంతో ఉంది. భారతీయ తెరపై ఇప్పటివరకు రాని ఒక సరికొత్త కాన్సెప్ట్‌తో ‘లీసా’ తెరకెక్కింది. ఇది ప్రేక్షకులను తప్పకుండా అలరిస్తుందనే నమ్మకం ఉంది.
సినిమా మేకింగ్, అనన్య నాగళ్ల అద్భుతమైన నటన ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని నవంబర్ నెలలో సినిమాను ఘనంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం” అని తెలిపారు.
నటీనటులు: అనన్య నాగళ్ల, అల్లాల రవిరెడ్డి గారు, సుమన్, మూసా అలీ ఖాన్, రత్నాకర్ రెడ్డి, జబర్దస్త్ సత్యశ్రీ, గడ్డం నవీన్, ఆకెళ్ల, రవిరెడ్డి, స్వప్న చౌదరి, గోపీ కార్తికేయ, సుజాత, సుజి, మానస, శ్యామ్, వెన్ని, జాను వర్మ, కనకం వెంకట్, బేబీ ట్వింకిల్, హనుశ్రీ తదితరులు.
ఇరాన్లో పెళ్లింటిపై జరిగిన దాడి ఘటనపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ స్పందించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని యూఎస్ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తెలిపారు. ఇటీవల దక్షిణ ఇరాన్లో పెళ్లి వేడుక జరుగుతున్న ఓ ఒంటిపై జరిగిన దాడిలో నలుగురు మరణించారు. మరో 68 మంది గాయపడ్డారు. అమెరికా దాడితోనే పెళ్లింట విషాదం నెలకొందని ఇరాన్ ఆరోపిస్తోంది. ఈ ఘటనపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ స్పందింస్తూ దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. ‘మేము దర్యాప్తు చేస్తున్నాము. అసలేం జరిగిందో తెలుసుకోవాలని అనుకుంటున్నాము’ అని వాన్స్ అన్నారు. అంతకుముందు, యూఎస్ సెంట్రల్ కమాండ్ ప్రతినిధి మాట్లాడుతూ తమకు ఇరాన్ దళాల వలె సామాన్యులను టార్గెట్ చేసే అలవాటు లేదని ఘాటుగా జవాబిచ్చారు.
భారత క్రికెట్ జట్టు మరో అరుదైన అంతర్జాతీయ మ్యాచ్‌కు సిద్ధమవుతోంది. జపాన్‌తో తొలిసారి ప్రత్యేక టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లో భారత్ తలపడనుంది. భారత్ –జపాన్ దౌత్య సంబంధాలు 75 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈ మ్యాచ్‌ను నిర్వహిస్తున్నారు. ఈ మ్యాచ్ సెప్టెంబర్ 22, 2026న జపాన్‌లోని తోచిగి ప్రిఫెక్చర్లో ఉన్న సానో ఇంటర్నేషనల్ క్రికెట్ గ్రౌండ్లో జరగనుంది. ఈ పోరుకు ‘సుజుకి కప్’ గా పేరు పెట్టారు. భారత్, జపాన్ పురుషుల జట్లు ఈ మ్యాచ్‌లో తలపడనున్నాయి.
భారత్–జపాన్ దౌత్య సంబంధాల 75వ వార్షికోత్సవ వేడుకలకు ఈ మ్యాచ్ శ్రీకారం చుట్టనుంది. ‘స్పోర్ట్ 75’ కార్యక్రమంలో భాగంగా ఈ మ్యాచ్‌ను నిర్వహిస్తున్నారు. రెండు దేశాల మధ్య క్రీడా సహకారాన్ని, ప్రజల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా మాట్లాడుతూ.. జపాన్‌లో భారత్ ఆడబోయే ఈ ప్రత్యేక టీ20 మ్యాచ్ క్రికెట్‌ను తూర్పు ఆసియాలో మరింత విస్తరించేందుకు మంచి అవకాశమని పేర్కొన్నారు. జపాన్‌లో క్రికెట్ అభివృద్ధికి జపాన్ క్రికెట్ అసోసియేషన్‌తో కలిసి పనిచేస్తామని బీసీసీఐ వెల్లడించింది.
మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. ఈ మ్యాచ్ జరిగిన రెండు రోజులకే జపాన్‌లో 2026 ఆసియా క్రీడలు ప్రారంభం కానున్నాయి. భారత్ కూడా ఈ క్రీడల్లో పాల్గొంటుంది. దీంతో జపాన్‌తో జరిగే టీ20 మ్యాచ్ ఆసియా క్రీడలకు ముందు భారత జట్టుకు సన్నాహక పోరుగా ఉపయోగపడే అవకాశం ఉంది. క్రెక్స్ కథనం ప్రకారం, శ్రేయాస్ అయ్యర్ నేతృత్వంలోని భారత జట్టులోని పలువురు ఆటగాళ్లు ఈ మ్యాచ్‌లో కనిపించే అవకాశం ఉందని అంచనా. అయితే భారత్ తుది జట్టును బీసీసీఐ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.
సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం త్వరగా ఎన్ఓసీ ఇవ్వాలని తెలంగాణ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కోరారు. న్యూఢిల్లీలో ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయితో భేటీ అయిన మంత్రి.. సమ్మక్క సాగర్‌కు సంబంధించిన అంతర్రాష్ట్ర అంశాలపై చర్చించారు. బ్యారేజీ కారణంగా ఛత్తీస్‌గఢ్‌లో ముంపునకు గురయ్యే భూములు, ఇళ్లు, ఇతర ఆస్తులకు తెలంగాణ ప్రభుత్వం పూర్తి పరిహారం చెల్లిస్తుందని హామీ ఇచ్చారు. అవసరమైతే పరిహార నిధులను ముందుగానే జమ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. రెండు రాష్ట్రాల ప్రయోజనాలను పరిరక్షిస్తూ సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని కోరారు. సమ్మక్క సాగర్ ద్వారా శ్రీరాంసాగర్ రెండో దశ పరిధిలోని 4.40 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడంతో పాటు మరో 30 వేల ఎకరాలకు కొత్తగా సాగునీరు అందించనున్నట్లు మంత్రి తెలిపారు. ప్రాజెక్టుకు ఇప్పటికే పలు అనుమతులు లభించినా.. ఛత్తీస్‌గఢ్ ఎన్ఓసీ పెండింగ్‌లో ఉండటంతో తదుపరి ప్రక్రియ ఆలస్యమవుతోందని చెప్పారు. ఎన్ఓసీ త్వరగా వస్తే ప్రాజెక్టు పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురావచ్చని మంత్రి పేర్కొన్నారు.
రూ.4 కోట్లతో విద్యుత్ సబ్‌స్టేషన్‌కు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే భూమి పూజ.
కూటమి ప్రభుత్వంలో ఏపీ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని అన్నారు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండలం కాసరం గ్రామంలో రూ.4 కోట్లతో తలపెట్టిన సబ్‌స్టేషన్ నిర్మాణ పనులకు ఆయన భూమిపూజ నిర్వహించారు. తన తండ్రి, దివంగత మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కలను సాకారం చేసే దిశగా ఈ సబ్‌స్టేషన్ నిర్మాణం చేపడుతున్నామని ఎమ్మెల్యే తెలిపారు. రాబోయే మూడు నెలల్లో నిర్మాణ పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని వెల్లడించారు. సబ్‌స్టేషన్ ఏర్పాటుతో కాసరం పంచాయతీ పరిధిలోని అన్ని గ్రామాలకు నిరంతరాయంగా, మెరుగైన విద్యుత్ సరఫరా అందుతుందని చెప్పారు. ముఖ్యంగా రైతులకు సాగునీటి అవసరాలకు నాణ్యమైన విద్యుత్ అందుతుందని.. పంట పొలాల సాగుకు ఎదురవుతున్న విద్యుత్ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని తెలిపారు.