రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమాన్ని సమాంతరంగా ముందుకు తీసుకెళ్తున్నామని ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు.
అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించడంతో పాటు ప్రజలకు నాణ్యమైన విద్యుత్, తాగునీటి సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు.
బాపట్ల జిల్లా కారంచేడులో సీఎస్ఆర్ నిధులతో ఏర్పాటు చేసిన మూడు సామాజిక నీటి శుద్ధి కేంద్రాలను మంత్రి ప్రారంభించారు.
నీటి శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసిన దాతలను మంత్రి అభినందించారు.
ప్రాజెక్టులను ఏర్పాటు చేయడం ఎంత ముఖ్యమో.. అవి ప్రజలకు దీర్ఘకాలం ఉపయోగపడేలా నిర్వహించడం కూడా అంతే ముఖ్యమన్నారు.
కారంచేడులో మూడు, నాలుగు దశాబ్దాల తర్వాత నీటి సరఫరా వ్యవస్థను మెరుగుపరిచేందుకు రూ.3.50 కోట్లతో కొత్త పైపులైన్లు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.
మరో రూ.6 కోట్లతో పూర్తిస్థాయిలో కొత్త పైపులైన్ల నిర్మాణానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు మంత్రి తెలిపారు.
CVR NEWS
ఎల్-నీనో నేపథ్యంలో వ్యవసాయ శాస్త్రవేత్తల సూచనలు కీలకమని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రంలో శుక్రవారం ఎల్-నీనో అవగాహన సదస్సు నిర్వహించారు. కృష్ణానది నీటి కొరత నేపథ్యంలో పట్టిసీమ ప్రాజెక్టు ఆదుకుందని బుద్ధప్రసాద్ తెలిపారు. అవనిగడ్డ నియోజకవర్గంలో ఇంకా 15 వేల ఎకరాల్లో నాట్లు వేయాల్సి ఉందన్నారు. నాట్లు వేయని రైతులకు సహాయం చేసే అంశాన్ని ప్రభుత్వం కచ్చితంగా ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. కృష్ణా డెల్టా రైతుల సమస్యల పరిష్కారానికి గతంలోనూ పోరాడినట్లు ఎమ్మెల్యే గుర్తుచేశారు. సాగునీటి విషయంలో రైతులకు న్యాయం చేసే అంశంలో రాజీపడేది లేదని స్పష్టం చేశారు. ప్రపంచ దేశాల్లో విస్తరించిన సూపర్ ఎల్-నీనో దుష్ప్రభావంతో తీవ్ర సాగునీటి కొరత ఎదురవుతోందన్నారు. ప్రస్తుత పరిస్థితులను రైతులు అర్థం చేసుకుని.. వ్యవసాయ శాస్త్రవేత్తల సూచనలకు అనుగుణంగా ముందుకు సాగాలని కోరారు. సాగునీటి సమస్య నుంచి బయటపడేందుకు రైతులు ప్రత్యామ్నాయ మార్గాలపై ఆలోచించాలని బుద్ధప్రసాద్ సూచించారు.
విశాఖ ఆటోనగర్‌లో ఆల్కలైన్ అయనైజ్డ్ డ్రింకింగ్ వాటర్ ప్లాంట్‌ను ఎంఎస్ఎంఈ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. యువతకు కూటమి ప్రభుత్వం ఎంఎస్ఎంఈ రంగం ద్వారా అందిస్తున్న రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఉపాధి అవకాశాల కోసం యువత ఇతర రాష్ట్రాలకు వెళ్లే పరిస్థితికి ముగింపు పలికేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.
యువత కొత్త పరిశ్రమలు స్థాపించే దిశగా ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తోందని తెలిపారు.
ముఖ్యంగా మ్యానుఫ్యాక్చరింగ్, ప్యాకేజింగ్ పరిశ్రమల్లో మంచి లాభదాయక అవకాశాలు ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ఆమోదించిన ఏడు రాయితీలు హర్షణీయమన్నారు.
సింగిల్ విండో విధానంతో యువత పరిశ్రమలు స్థాపించుకునేందుకు ఎంఎస్ఎంఈ శాఖ సహకరిస్తుందని తెలిపారు.
శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు విస్తృతంగా పర్యటించారు. కేంద్ర, రాష్ట్రాల్లో కూటమి ప్రభుత్వం ఉండటంతో దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం చూపుతున్నామని, సంక్షేమం-అభివృద్ధిని సమాంతరంగా ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. కంచిలి, ఇచ్చాపురం, కవిటి మండలాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. రూ.1.31 కోట్లతో రెండు బీటీ రోడ్లు, రూ.2.29 కోట్ల సీఎస్ఆర్ నిధులతో బ్యాడ్మింటన్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, రూ.6 కోట్లతో రెండు ఆర్యూబీలకు పనులు ప్రారంభించారు. జిల్లాలో మౌలిక వసతులను మరింత విస్తృతం చేసి.. ప్రజల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రామ్మోహన్ నాయుడు హామీ ఇచ్చారు.
అమరావతిలో ఉద్యోగ సంఘాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక భేటీకి సిద్ధమయ్యారు. రేపు రాష్ట్రంలోని ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సీఎం సమావేశం కానున్నారు. ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి డిమాండ్లు, పరిష్కరించాల్సిన అంశాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. ప్రతి ఉద్యోగ సంఘం నుంచి ఒక్కో ప్రతినిధిని సమావేశానికి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఉద్యోగ సంఘాలతో నేరుగా సమావేశమై వారి సమస్యలను తెలుసుకుని, పరిష్కార మార్గాలపై చర్చించేందుకు ప్రభుత్వం ఈ భేటీ నిర్వహించనుంది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల సమస్యలు, ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలపై సంఘాల ప్రతినిధులు ముఖ్యమంత్రికి తమ అభిప్రాయాలను వివరించే అవకాశం ఉంది. ఈ సమావేశం నేపథ్యంలో ఉద్యోగ సంఘాల్లోనూ ఆసక్తి నెలకొంది. సీఎం చంద్రబాబు ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో ఎలాంటి అంశాలపై చర్చిస్తారు? వారి సమస్యల పరిష్కారానికి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
తెలంగాణ శాసనసభ, మండలి వర్షాకాల సమావేశాలకు ముహూర్తం ఖరారయింది. సెప్టెంబర్ 7వ తేదీ నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు శాసనసభ కార్యదర్శి అధికారిక సర్కులర్ జారీ చేశారు. 7వ తేదీ ఉదయం 10 గంటల నుంచి సభలు ప్రారంభమవుతాయని, శాసనసభ సభ్యులతో పాటు మండలి సభ్యులకు కూడా సమాచారాన్ని అందిస్తూ.. సర్క్యులర్ పంపారు. వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా ప్రాముఖ్యత కలిగిన అంశాలపై ప్రశ్నలు ఇవ్వాలని ఎమ్మెల్యేలకు కార్యదర్శి సూచించారు. 2వ తేదీలోగా వాటిని అందించాలని తెలిపారు. రూల్ 39 ప్రకారం సభ్యులు అడిగే ప్రశ్నలకు సభలో మంత్రులు సమాధానమివ్వాల్సి ఉంటుంది. ముందస్తు ప్రశ్నలను సంబంధిత శాఖలకు పంపి.. తెలంగాణ ప్రభుత్వం సమాధానాలను సిద్ధం చేయనుంది.
సమావేశాలు ఎన్ని రోజుల నిర్వహించాలన్న అంశంపైన తొలి రోజు సభ ముగిసిన తర్వాత నిర్వహించే బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. ఈ సారి సభల్లో 22ఏ అంశం, కృష్ణా, గోదావరి జలాలు వినియోగం ఇంకా అనేక అంశాలు చర్చకు వచ్చే అవకాశాలున్నాయని అసెంబ్లీ వర్గాలు తెలిపాయి. ఢిల్లీలోని జంతర్ మంతర్ లో సీజేపీ ఆందోళన, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామాల అనంతరం నెక్లస్ రోడ్ లో టీపీసీసీ ర్యాలీ నిర్వహించారు. ఆ ర్యాలీలో ప్రసంగించిన సీఎం రేవంత్ రెడ్డి యువత చట్ట సభలకు పోటీ చేసే వయసును 25 నుంచి 21ఏళ్లకు తగ్గించాలని, అసెంబ్లీలో తీర్మానం చేస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ఈ తీర్మానం చేసే అవకాశాలున్నాయని అసెంబ్లీ వర్గాలు వెల్లడించాయి. కాగా.. ఈ అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ కూడా రావాలని సీఎం రేవంత్ రెడ్డి గతంలోనే కోరారు. ఈ సమావేశాల్లో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, ఆర్థిక పరిస్థితి, సాగునీటి ప్రాజెక్టులు వంటి అంశాలపై లోతుగా చర్చించనున్నారు.
శ్రవణ్, మలైకా టి వాసుపల్ జంటగా నటిస్తున్న సినిమా “చకోర- లూనార్ లవ్ బర్డ్”. ఈ చిత్రాన్ని వీఐపీ వింటేజ్ ఐకానిక్ పిక్చర్స్ సారథ్యంలో హై జాయ్ కమర్షియల్స్ బ్యానర్ పై ప్రొడ్యూసర్ డా.చింతాడ హేమారావు నిర్మిస్తున్నారు. “చకోర- లూనార్ లవ్ బర్డ్” సినిమాతో ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ దగ్గర ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన మంగా శ్రీనివాస్ నూతన దర్శకుడిగా పరిచయమవుతున్నారు. అక్టోబర్ 8న ఈ సినిమా గ్రాండ్ థియేటర్ రిలీజ్ కి రాబోతోంది.
ఈ రోజు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రివర్యులు రామ్మోహన్ నాయుడు చేతుల మీదుగా “చకోర- లూనార్ లవ్ బర్డ్” సినిమా టీజర్ రిలీజ్ చేశారు. టీజర్ బాగుందంటూ ప్రశంసించిన రామ్మోహన్ నాయుడు చిత్ర దర్శక నిర్మాతలకు, ఇతర బృందానికి తన బెస్ట్ విశెస్ అందించారు.
“చకోర- లూనార్ లవ్ బర్డ్” సినిమా టీజర్ ఎలా ఉందో చూస్తే – అందమైన వైజాగ్ నేపథ్యంలో సాగే సరికొత్త ప్రేమ కథతో ఈ సినిమా రూపొందినట్లు టీజర్ తో తెలుస్తోంది. ‘ఇది మామూలు ప్రేమ కథ కాదు, అమ్మ చెప్పిన ప్రేమ కథ, అమ్మ చెప్పిన ప్రేమ కథే కాదు అబ్బాయి ప్రేమ కథ, అబ్బాయి ప్రేమ కథే కాదు అమ్మాయి ప్రేమ కథ కూడా , ఇది మామూలు ప్రేమ కాదు. ఇది చకోర ప్రేమ కథ అంటూ వచ్చే వాయిస్ ఓవర్ తో ఈ టీజర్ ఆకట్టుకుంటోంది. జాబిల్లి చేరేందుకు ప్రయత్నించే చకోర పక్షిని సింబాలిక్ గా చెబుతూ హీరో క్యారెక్టరైజేషన్ ను డిజైన్ చేయడం కొత్తగా అనిపిస్తోంది. తన ప్రేయసి జూలీ ఎక్కడుందో వెతికేందుకు హీరో తీవ్ర ప్రయత్నాలు చేయడం టీజర్ లో చూపించారు. హీరో తన జూలీని చేరుకున్నాడా లేదా అనే క్యూరియాసిటీని టీజర్ క్రియేట్ చేసింది.
చకోర పక్షి ఒక యూనిక్ బర్డ్.. తన దాహాన్ని తీర్చుకునే ప్రాసెస్ లో స్వచ్ఛమైన వాన చినుకులనే త్రాగుతుంది తప్ప ఏది బడితే అది త్రాగదు… ఆ వర్షపు చినుకుల కోసం అప్పటివరకూ నిరీక్షిస్తూ ఉంటుంది… ఈ కథలో హీరో కూడా అంత స్వచ్ఛమైన ప్రేమికుడు అని చెప్పడానికి ఈ చిత్రానికి చకోర టైటిల్ పెట్టారు.
జాబిలిని చేరుకునే ప్రయత్నంలో చకోర పక్షి మరణిస్తుంది కానీ ఆ ప్రయత్నం ఆపదు…
మరి తన ప్రేయసి జాబిలిని చేరుకునే ప్రయత్నంలో హీరో మరణించాడా లేదా తన అంతులేని ప్రేమతో మరణాన్నే జయించాడా అన్నదే కథ.
లవ్, కామెడీ, రొమాన్స్, యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్స్, హీరోయిజం…వంటి అన్ని అంశాలు చూపిస్తూ కట్ చేసిన టీజర్ అందరినీ ఆకట్టుకుంటోంది.
అమెరికాలో పుట్టిన వారికి జన్మతః పౌరసత్వం కల్పించే హక్కును పరిమితం చేసేందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా ప్రయత్నానికి కోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ‘బర్త్ టూరిజం’ను అడ్డుకోవాలన్న ఉద్దేశంతో ఆగస్టు 6న జారీ చేసిన కార్యనిర్వాహక ఉత్తర్వును అమలు చేయకుండా మేరీలాండ్ యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి డెబోరా ఎల్. బోర్డ్‌మన్ బుధవారం ప్రాథమిక ఇంజంక్షన్ జారీ చేశారు. వలస కుటుంబాలు, హక్కుల సంఘాలు దాఖలు చేసిన క్లాస్ యాక్షన్ కేసు పరిష్కారమయ్యే వరకు ఈ ఆంక్షలు కొనసాగనున్నాయి.
అమెరికా పౌరసత్వం కోసం ప్రసవ సమయంలో దేశానికి వచ్చే విధానాన్ని అడ్డుకోవాల్సిందేనని ట్రంప్ గతంలో ప్రకటించారు. ప్రభుత్వం తరఫు న్యాయవాదులు ఉత్తర్వును నిలిపివేయవద్దని చేసిన విజ్ఞప్తిని జడ్జి బోర్డ్‌మన్ తిరస్కరించారు. అమెరికాలో జన్మించిన పిల్లలకు పౌరసత్వం కల్పించే హక్కుపై ట్రంప్ గతంలో చేసిన ప్రయత్నం కూడా న్యాయపరమైన సవాళ్లను ఎదుర్కొంది. తాజా తీర్పుపై శ్వేతసౌధం స్పందన వెలువడాల్సి ఉంది.
ప్రైవేట్ పాఠశాలల్లో విద్యా హక్కు చట్టం-2009 ప్రకారం పేద విద్యార్థులకు కేటాయించాల్సిన 25 శాతం సీట్లను పకడ్బందీగా అమలు చేసేందుకు ఏపీ ప్రభుత్వం రాష్ట్ర స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ విధానంపై అధ్యయనం చేసి మార్గదర్శకాలను సవరించేందుకు 16 మంది సభ్యులతో కమిటీని నియమించింది. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ తమీమ్ అన్సారియా ఛైర్మన్‌గా, సమగ్రశిక్షా ఎస్పీడీ కన్వీనర్‌గా వ్యవహరించనున్నారు. తల్లిదండ్రులు, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు కూడా కమిటీలో చోటు కల్పించారు.
సుప్రీంకోర్టు తీర్పు, జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఆదేశాల నేపథ్యంలో ప్రస్తుత నిబంధనలను సవరించి కొత్త మార్గదర్శకాలను రూపొందించనున్నారు. మరోవైపు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా 2026 రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలకు ప్రభుత్వం 173 మందిని ఎంపిక చేసింది. పాఠశాల విద్య నుంచి 79 మంది, ఇంటర్ నుంచి 24 మంది, సాంకేతిక విద్య నుంచి 14 మంది, ఉన్నత విద్య నుంచి 56 మంది ఉన్నారు. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రశంసాపత్రం, జ్ఞాపిక, పతకం, శాలువాతో పాటు రూ.20 వేల నగదు బహుమతి అందించనున్నారు.
మంధాన విధ్వంసం.. హాంకాంగ్‌పై భారత్ భారీ విజయం.
ఈ విజయంతో ఈ గ్రూప్ నుంచి సెమీఫైనల్ బెర్త్‌ను ఖాయం చేసుకున్న తొలి జట్టుగా భారత్ నిలిచింది. స్మృతి మంధాన, శ్రీ చరణి చిరునవ్వులు చిందిస్తుండగా, భారత సపోర్ట్ స్టాఫ్ సభ్యులు పరస్పరం కరచాలనం చేసుకున్నారు. హర్మన్‌ప్రీత్ కౌర్ హాంకాంగ్ కెప్టెన్ మైల్స్‌తో చేతులు కలిపారు. అనంతరం భారత జట్టు సభ్యులంతా ఆమెకు అభివాదం చేశారు.
భారత బౌలర్లు పెద్దగా శ్రమించాల్సిన అవసరం లేకుండానే ప్రత్యర్థిని కట్టడి చేశారు. నందిని శర్మ, చరణి, ప్రేమ రావత్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. ఇక దీప్తి శర్మ మూడు వికెట్లు తీసి మహిళల టీ20 అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో అగ్రస్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది. షఫాలీ వర్మ కేవలం ఒక ఓవర్ మాత్రమే బౌలింగ్ చేయగా, వికెట్ తీయలేకపోయిన క్రాంతి గౌడ్ కూడా ఆకట్టుకునే ప్రదర్శన చేసింది.
హాంకాంగ్ బ్యాటింగ్ మాత్రం పూర్తిగా నిరాశపరిచింది. మారినా లాంప్లఫ్ 15 బంతుల్లో 14 పరుగులు చేసి తన షాట్ మేకింగ్‌తో కొంత ప్రతిఘటన చూపించింది. కానీ మిగతా బ్యాటర్లు భారత బౌలర్లపై ఆధిపత్యం చెలాయించలేకపోయారు. హాంకాంగ్ జట్టులో ఎనిమిది మంది బ్యాటర్లు సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. అత్యధిక వ్యక్తిగత స్కోరు కేవలం 15 పరుగులు మాత్రమే. చివరి ఐదు వికెట్లను కేవలం 11 బంతుల్లో కోల్పోయిన హాంకాంగ్, 54/5 నుంచి 56 పరుగులకే ఆలౌట్ అయింది.
అంతకుముందు స్మృతి మంధాన అద్భుతమైన 124 పరుగుల ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌కు బలమైన పునాది వేసింది. ఈ ఇన్నింగ్స్‌తో మహిళల అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా మిథాలీ రాజ్‌ను మంధాన అధిగమించింది. అలాగే 18 అంతర్జాతీయ సెంచరీలతో లారా వోల్వార్డ్, మెగ్ లానింగ్‌లను వెనక్కి నెట్టి ఈ జాబితాలోనూ కొత్త రికార్డు సృష్టించింది. 14 ఫోర్లు, 7 సిక్సర్లతో సాగిన మంధాన ఇన్నింగ్స్ చూడటానికే కాదు, వ్యాఖ్యానించటానికీ ఎంతో ఆసక్తికరంగా సాగింది.
అయితే భారత మిడిల్ ఆర్డర్ మరోసారి నిరాశపరిచింది. అందువల్ల భారత్‌కు ఇది పూర్తిగా పరిపూర్ణమైన మ్యాచ్ అని చెప్పడం మాత్రం కష్టం. సెప్టెంబర్ 5న భారత్ పాకిస్థాన్‌తో తలపడనుండగా, సెప్టెంబర్ 7న హాంకాంగ్ పాకిస్థాన్‌తో పోటీ పడనుంది.