నీట్-యూజీ 2026 ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంపై దేశవ్యాప్తంగా జరిగిన నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులు, యువతపై నమోదైన ఎఫ్ఐఆర్లను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్టికల్ 142 కింద ఉన్న ప్రత్యేక అధికారాలను వినియోగించిన సీజేఐ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం.. ఆయా ఎఫ్ఐఆర్లపై దర్యాప్తు చేయరాదని, వాటిని పూర్తిగా మూసివేయాలని ఆదేశించింది. ఈ నిరసనలకు సంబంధించి ఇకపై కొత్తగా ఎఫ్ఐఆర్లు నమోదు చేయరాదని స్పష్టం చేసింది.
అయితే ఢిల్లీ పోలీసులు గుర్తించిన సుమారు 2,873 మందికి ఈ ఆదేశాలు వర్తించవని కోర్టు పేర్కొంది. తీవ్రమైన నేరచరిత్ర, ఆస్తి నష్టం, శారీరక దాడులు వంటి ఘటనలకు సంబంధించి వారి పాత్రపై విచారణ కొనసాగించవచ్చని తెలిపింది. జులై 20 నుంచి 25 వరకు ఢిల్లీలోని జంతర్ మంతర్‌తో పాటు పలు రాష్ట్రాల్లో నిరసనలు జరిగాయి. సుప్రీంకోర్టు నిర్ణయం నేపథ్యంలో సెప్టెంబర్ 5న ఢిల్లీలో తలపెట్టిన నిరసనను విరమించుకుంటున్నట్లు సీజేపీ ప్రకటించింది.