ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరో అరుదైన మైలురాయిని అందుకోనున్నారు. దేశంలో అత్యధిక కాలం నిరంతరాయంగా అధికారంలో కొనసాగిన ప్రజాస్వామ్యయుత ప్రధానమంత్రిగా జవహర్‌లాల్ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును మోదీ అధిగమించనున్నారు.స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 1951-52లో మనదేశంలో మొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల అనంతరం తొలిసారిగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రధానిగా నెహ్రూ మే 13, 1952న ప్రమాణ స్వీకారం చేశారు. నాటి నుండి మే 27, 1964న ఆయన మరణించే వరకు.. మొత్తం 4,398 రోజుల పాటు ఎలాంటి విరామం లేకుండా నెహ్రూ ప్రధానిగా కొనసాగారు.
నరేంద్ర మోదీ మే 26, 2014న తొలిసారిగా ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. నేటికి విరామం లేకుండా 4,399 రోజులు పూర్తి చేసుకోనున్నారు. దీంతో నెహ్రూ రికార్డును ఒక్క రోజు తేడాతో అధిగమించి, దేశంలోనే సుదీర్ఘకాలం నిరంతరాయంగా పాలించిన ఏకైక ప్రజాస్వామ్య అధినేతగా మోదీ నిలవనున్నారు. ఇంతకుముందు కూడా ప్రధానిగా నరేంద్ర మోదీ మరో రికార్డును బద్దలుకొట్టారు. వరుసగా, అత్యధిక కాలం ప్రధానిగా ఉన్న ఇందిరా గాంధీ రికార్డును జూలై 5, 2025న దాటేశారు. ఇందిరాగాంధీ జనవరి 24, 1966న ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టి, వరుసగా 4,077 రోజులపాటు కొనసాగారు. ఆమె మార్చి 24, 1977లో వరకు ప్రధానిగా కొనసాగారు. అలా, ఇందిరా గాంధీ కంటే ఎక్కువ రోజులు వరుసగా ప్రధానిగా మోదీ కొనసాగుతున్నారు.
ఇక్కడ చెప్పుకోవల్సిన మరో రికార్డ్ ఏమిటంటే అక్టోబరు 7, 2001 నుంచి మార్చి 22, 2026 నాటికి నరేంద్ర మోదీ సీఎంగా, పీఎంగా కలిపి మొత్తం 8,931 రోజులు పూర్తి చేసుకున్నాడు… దీనితో భారతదేశ చరిత్రలోనే ఒక ఎన్నికైన ప్రభుత్వానికి అత్యంత సుదీర్ఘ కాలం అధిపతిగా పనిచేసిన నాయకుడిగా సిక్కిం మాజీ సీఎం పవన్ కుమార్ చామ్లింగ్ 8,930 రోజుల రికార్డును మోదీ బద్దలు కొట్టారు. నేటికి మోదీ పాలనా కాలం 9013 రోజులు పూర్తవుతుంది.
జవహర్‌లాల్ నెహ్రూ, నరేంద్ర మోదీ ఇద్దరూ భారతదేశ చరిత్రలో అత్యంత పరివర్తనాత్మక కాలాల్లో దేశాన్ని నడిపించారు. శతాబ్దాల వలస పాలన తర్వాత విచ్ఛిన్నమైన ఆర్థిక వ్యవస్థ, రాజకీయ అస్థిరత, సంస్థాగత నిర్మాణం లేని ఒక నూతన స్వాతంత్ర్య దేశానికి నెహ్రూ పునాదులు వేశారు. నాడు కేవలం 34 కోట్ల జనాభా ఉన్న భారతదేశానికి రాజకీయ స్థిరత్వం, ఆర్థిక స్వావలంబనను చేకూర్చడం ఆయన ముందున్న ప్రధాన లక్ష్యం. అయితే, ప్రధాని మోదీ నాయకత్వం వహిస్తున్న నేటి భారతదేశం పరిమాణంలో చాలా పెద్దది 140 కోట్లకు పైగా జనాభా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో ముడిపడి ఉన్నది, అంతర్జాతీయ పరిణామాలకు వేగంగా ప్రభావితమయ్యేది. అందువల్ల ఈ పోలిక, ఎవరు ఎక్కువ సవాళ్లను ఎదుర్కొన్నారు అనే దానికంటే, దశాబ్దాలుగా సంక్షోభాల స్వభావం ఎంత సంక్లిష్టంగా మారిందనే దానికి నిదర్శనం.
రికార్డులు సాధించడం ఒక విషయం, ఆ రికార్డును చరిత్రలో గొప్పగా నిలబెట్టడం మరొక విషయం. నేటితో మోదీ సాధించనున్న ఈ చారిత్రక మైలురాయి భారత రాజకీయాల్లో ఒక యుగం ముగిసి, కొత్త యుగం మొదలవుతోందని సూచిస్తోంది. ఈ దీర్ఘకాలిక నాయకత్వం దేశానికి ఎంతటి మేలు చేస్తుందనేది కాలమే చెప్పాలి. ఈ రికార్డు మోదీకి మీ దేశ ప్రజలు పెట్టుకున్న నమ్మకానికి నిదర్శనంగా చెప్పవచ్చు.