పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. పాకిస్థాన్ భద్రతా దళాలు, నిరసనకారులకు మధ్య జరిగిన ఘర్షణల్లో దాదాపు 30 మంది ప్రాణాలు కోల్పోగా.. ముజఫరాబాద్, రావల్‌కోట్‌లో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల్లో మొత్తంగా 200 మందికిపైగా గాయపడినట్లు తెలుస్తోంది. పీవోకేలో తాజా పరిణామాలపై పాకిస్థాన్ మానవ హక్కుల కమిషన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ప్రాంతంలో ఆర్థిక, రాజకీయ సమస్యలపై నిరసనలకు నాయకత్వం వహిస్తున్న జాయింట్ అవామీ యాక్షన్ కమిటీని ప్రభుత్వం నిషేధించడంతో హింస చెలరేగింది.
పీవోకేలో జులై 27న అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలో స్థానిక చట్టసభలో శరణార్థుల కోసం కేటాయించిన 12 సీట్లను రద్దు చేయాలని కొంతకాలంగా డిమాండ్ చేస్తోన్న జాయింట్ ఆవామీ యాక్షన్ కమిటీ నిరసనలకు పిలుపునిచ్చింది. అయితే జేఏఏసీని నిషేధిస్తున్నట్లు అధికారులు ఇటీవల ప్రకటించారు. దీంతో ఆందోళనలు మొదలయ్యాయి. రావాలాకోట్ నగరంలో పోలీసులతో జరిగిన ఘర్షణలో మొదట ఓ స్థానిక వ్యాపారి కాల్పుల్లో మరణించడంతో ఉద్రిక్తతలు తీవ్రతరమయ్యాయి.
ఈ హింసాత్మక ఘటనా పరిణామాల నేపథ్యంలో పాక్ ప్రభుత్వం ఆ ప్రాంతంలో మొబైల్ ఇంటర్నెట్ సేవలను పూర్తిగా నిలిపివేసి హై అలర్ట్ ప్రకటించింది. తమ కనీస అవసరాలైన గోధుమలు, విద్యుత్ సబ్సిడీలను పక్కనపెట్టి, తమ రాజకీయ హక్కులను కాలరాస్తూ పాక్ సైన్యం సామాన్య పౌరులపై బుల్లెట్ల వర్షం కురిపిస్తోందని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే నిరసన కారులు తమపై గెరిల్లా తరహా దాడులు చేయడం వల్లే తాము దాడి తుపాకులకు పని చెప్పాల్సి వచ్చిందని పాక్ భద్రతా దళాలు ఆరోపిస్తున్నాయి. ఈ ఘటనతో పీఓకే మరోసారి హాట్ టాపిక్ గా మారింది.
సోషల్ మీడియాలో మృతుల సంఖ్య 150 నుంచి 200 వరకు ఉండవచ్చని వదంతులు వ్యాపిస్తున్నప్పటికీ, ప్రభుత్వం కమ్యూనికేషన్ వ్యవస్థలపై ఆంక్షలు విధించడంతో వాస్తవాలను ధృవీకరించడం కష్టంగా మారింది. ఈ ఘటనపై భారత్ తీవ్రంగా స్పందించింది. నిరసనకారులపై పాకిస్థాన్ సాగించిన అణచివేత చర్యలకు గానూ, ఆ దేశాన్ని అంతర్జాతీయ సమాజం జవాబుదారీని చేయాలని పిలుపునిచ్చింది.