అనకాపల్లి జిల్లాలో జిల్లా ఎస్పీ మానవత్వం చాటుకున్నారు. వి.మాడుగుల మండలం, జంపెన గ్రామానికి చెందిన పెచ్చేటి రాజు గంజాయి కేసులో విశాఖపట్నం సెంట్రల్ జైలులో రిమాండ్లో ఉన్నాడు. కాగా, మే 31న జరిగిన రోడ్డు ప్రమాదంలో అతని పెద్ద కుమారుడు సాయి కిరణ్ అక్కడికక్కడే మరణించాడు. మూడేళ్ల క్రితమే చిన్న కుమారుడు కూడా చనిపోవడంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.కన్నకొడుకు చివరి చూపుకైనా తండ్రిని తీసుకురావాలని కుటుంబ సభ్యులు, గ్రామ పెద్దలు వి.మాడుగుల ఎస్ఐ నారాయణ రావు, కె.కోటపాడు సిఐ కృష్ణను ఆశ్రయించారు. వారు ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా , అదనపు ఎస్పీ ఎల్.మోహన రావు దృష్టికి తీసుకెళ్లారు. పరిస్థితిని అర్థం చేసుకున్న ఎస్పీ వెంటనే స్పందించి, రాష్ట్ర ప్రభుత్వానికి అత్యవసర నివేదిక పంపారు. ఎస్పీ ప్రత్యేక చొరవతో ప్రభుత్వం జూన్ 2న జీవో జారీ చేస్తూ, నిందితుడికి ఒకరోజు తాత్కాలిక విడుదల మంజూరు చేసింది.ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం, పోలీస్ భద్రత నడుమ పెచ్చేటి రాజు జంపెన గ్రామానికి చేరుకుని, తన కుమారుడికి అంతిమ సంస్కారాలు నిర్వహించాడు. చట్టపరమైన నిబంధనలు ఉన్నప్పటికీ, కేవలం మానవతా దృక్పథంతో స్పందించి, కన్నకొడుకును ఆఖరిసారి చూసుకునే భాగ్యాన్ని కల్పించినందుకు అనకాపల్లి జిల్లా ఎస్పీ పోలీస్ అధికారులకు, సిబ్బందికి పెచ్చేటి రాజు కుటుంబ సభ్యులు మరియు జంపెన గ్రామ ప్రజలు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకున్నారు.
Tag:



Total views : 92173