దేశవ్యాప్తంగా ఓటరు జాబితాను ప్రక్షాళన చేసేందుకు భారత ఎన్నికల సంఘం చేపడుతున్న ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ మూడో దశ ప్రక్రియను తెలంగాణ రాష్ట్రంలో పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని సీఈఓ సుదర్శన్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ లో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి భారత ఎన్నికల సంఘం సీనియర్ అధికారులు ప్రధాన కార్యదర్శి అవినాష్ కుమార్, ఉప కార్యదర్శి సంజయ్ కుమార్ నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా సమావేశంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి అధికారులనుద్దేశించి ప్రసంగిస్తూ అసెంబ్లీ నియోజకవర్గాల వివరాలు, ఎస్ఐఆర్ కోసం నియమించిన సిబ్బంది, ఏర్పాటు చేసిన సహాయ కేంద్రాల గురించి వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 68.30శాతం మ్యాపింగ్ పూర్తయిందని ఆయన తెలిపారు.
భారత ఎన్నికల సంఘం అధికారులు ఎస్ఐఆర్ పై సమగ్ర ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇందులో భారత రాజ్యాంగంలోని సంబంధిత నిబంధనలు, ప్రజా ప్రాతినిధ్య చట్టం-1950, ఓటర్ల నమోదు నియమాలు-1960 గురించి వివరించారు. అలాగే ఎస్ఐఆర్ ప్రాముఖ్యతను వివరించి, ఈ ప్రక్రియలోని ముఖ్య దశలను, ముసాయిదా ఓటరు జాబితా ప్రచురణ, క్లెయిమ్‌లు, అభ్యంతరాల దాఖలు, నోటీసుల జారీ, వాటి పరిష్కారం, తుది ఓటరు జాబితా ప్రచురణ తదితర అంశాలపై సమగ్రంగా వివరించారు. గణన ఫారాలను నింపేటప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఈసీఐ అధికారులు సూచించారు. అధికారిక పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో గణన ఫారాల సమర్పణను విస్తృతంగా ప్రచారం చేయాలని, ఓటర్లకు ఎస్ఐఆర్ గురించి త్వరితగతిన సమాచారం అందించే ‘బుక్ ఎ కాల్’ సదుపాయాన్ని కూడా ప్రజలకు తెలియజేయాలని ఆదేశించారు.




Total views : 92029