తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న అసలైన ఉద్యమకారుల గుర్తింపు అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ సచివాలయంలో ప్రభుత్వ సలహాదారు కేకే అధ్యక్షతన నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియపై విస్తృతంగా చర్చించారు. గత ప్రభుత్వ హయాంలో ఉద్యమకారులకు అన్యాయం జరిగిందన్న ఆరోపణల మధ్య, వారికి న్యాయం చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన వేలాది మంది ఉద్యమకారుల గుర్తింపు అంశంపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఈ క్రమంలో సచివాలయంలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి వివిధ రాజకీయ పార్టీలు, ఉద్యమ సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సమావేశంలో అసలైన ఉద్యమకారులను ఎలా గుర్తించాలనే అంశంపై విస్తృత చర్చ జరిగింది. ఉద్యమ కాలంలో నమోదైన కేసులు, జైలు శిక్షలు, పోరాటాల్లో పాల్గొన్న ఆధారాలను పరిగణనలోకి తీసుకోవాలని పలువురు సూచించారు. సూచనలను పరిశీలించి పారదర్శక విధానంతో ఉద్యమకారుల గుర్తింపును ఖరారు చేయనున్నట్లు కమిటీ తెలిపింది
Tag:




Total views : 92580