పశ్చిమాసియా ఘర్షణల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. అమెరికాకు చెందిన విమాన వాహక నౌక యూఎస్ఎస్ అబ్రహాం లింకన్ లక్ష్యంగా ఇరాన్ క్షిపణి దాడులు చేసింది. ఈ విమాన వాహకనౌక కదలికలను నిరంతరం పరిశీలిస్తున్నామని, దాన్ని లక్ష్యంగా చేసుకుంటామని హెచ్చరించిన గంటలోపే టార్గెట్ చేసింది. దానికి సంబంధించిన వీడియోను ఇరాన్ మీడియా విడుదల చేసింది.యుద్ధాన్ని ముగించేందుకు ఇరాన్ తో అమెరికా ముమ్మరంగా చర్చలు జరుపుతోంది. ఇందులోభాగంగానే నెల రోజుల కాల్పుల విరమణ కోసం 15 పాయింట్లతో కూడిన ప్రణాళికను ఇరాన్‌కు పాకిస్థాన్ అందించింది. ఇలాంటి సమయంలో తాజా ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. దీనిపై అమెరికా ఎలా స్పందిస్తుందనే దానిపై ఆందోళన నెలకొంది. అబ్రహాం లింకన్‌పై దాడి చేశామని ఇరాన్ ప్రకటించడం ఇదే తొలిసారి కాదు. తమ బాలిస్టిక్ క్షిపణులు ఈ నౌకను ఢీకొట్టాయని, దాంతో అది పనిచేయడం లేదని, గల్ఫ్ జలాల నుంచి వెనక్కి తగ్గిందని ఇటీవల పేర్కొంది. ఆ ప్రకటనను అప్పట్లో అమెరికా తోసిపుచ్చింది.తాజా దాడిపై ఎలాంటి ప్రకటన చేయలేదు.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత ఉధృతమవుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్‌పై దాడులకు బ్రేక్ ఇచ్చినా..ఇరాన్, ఇజ్రాయెల్ ఎక్కడా తగ్గడం లేదు. బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. ఇక ఇరాన్ ఐతే గల్ఫ్ దేశాలపై డ్రోన్లతో విరుచుకుపడుతోంది. తాజాగా కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం లక్ష్యంగా దాడి చేసింది. అది ఓ ఇంధన ట్యాంకర్‌ను ఢీకొట్టడంతో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. భారీగా మంటలు, పొగ వ్యాపించాయి. రెస్క్యూ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి మంటలను అదుపుచేసేందుకు యత్నిస్తున్నారు. ఇరాన్ నుంచి వచ్చిన పలు క్షిపణులు, డ్రోన్లను తమ రక్షణవ్యవస్థలు అడ్డుకున్నాయని తెలిపాయి కువైట్ దళాలు.
యుద్ధం ప్రారంభమైన పిబ్రవరి 28వ తేదీ నుంచి ఇరాన్‌పై 15,000 బాంబులు వేశామని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఈ మేరకు మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ మాట్లాడుతూ, గత ఏడాది జూన్ నెలతో పోలిస్తే నాలుగు రెట్లు ఎక్కువ బాంబులు వేశామని తెలిపారు. గత ఏడాది జూన్‌లో 12 రోజుల పాటు జరిగిన సంఘర్షణ సమయంలో కంటే నాలుగురెట్లు బాంబులు ఉపయోగించినట్లు తెలిపారు. ఇరాన్‌లోని 3,000 లక్ష్యాలపై దాడులు చేసినట్లు తెలిపారు.అయితే ఇరాన్‌పై దాడిని ఐదు రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు రోజుల క్రితం సంచలన ప్రకటన చేశారు. ఈ ప్రకటనతో తమకు సంబంధం లేదని ఇజ్రాయెల్ చెబుతోంది..ఈ క్రమంలో యుద్ధం ఇప్పట్లో ముగిసేలా కన్పించకపోగా..మరింత ఉధృత రూపం దాల్చడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.
కాగా..ఇరాన్ యుద్ధం వల్ల ప్రపంచ దేశాలు ఇప్పటికే చమురు సరఫరా సమస్యలను ఎదుర్కొంటున్నాయి. మరోవైపు హర్మూజ్‌ను మూసివేయడంతో చమురు, గ్యాస్‌తో పాటు ఎరువుల రవాణాకూ ఆటంకం ఏర్పడుతోందని ప్రపంచ వాణిజ్య సంస్థ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ జేన్ మేరీ పౌగమ్ పేర్కొన్నారు. యూరియా సరఫరాకు అంతరాయాలు ఏర్పడుతుండడంతో.. ఎరువుల కొరత, అధిక ధరల రూపంలో ప్రపంచ ఆహార భద్రతకు ముప్పు కలిగే అవకాశముందని హెచ్చరించారు. ఐక్యరాజ్యసమితి వాణిజ్య, అభివృద్ధి విభాగం వెల్లడించిన వివరాల ప్రకారం.. ప్రపంచంలోని మూడింట ఒక వంతు ఎరువులు గల్ఫ్ దేశాల నుంచి హర్మూజ్ జలసంధి మీదుగానే రవాణా అవుతాయి. దీని మూసివేత కొనసాగితే.. యూరియా దిగుమతి చేసుకునే వ్యవసాయ ఆధారిత దేశాల్లో నిల్వలు తగ్గిపోయే ప్రమాదం ఉంది.
యుద్ధం మొదలై కొన్ని వారాలు మాత్రమే అవుతున్నందున ప్రస్తుతం ఎరువుల కొరత అంతగా లేనప్పటికీ ..ఈ ప్రభావం వచ్చే ఏడాది పంటలపై పడనుంది. ప్రపంచ దేశాలు ఎరువులు, ఆహార ధాన్యాల నిల్వలు పెంచుకోవడం ప్రారంభిస్తే అంతర్జాతీయ వాణిజ్యానికి అంతరాయం కలుగుతుంది. దీనివల్ల ఆహారాన్ని దిగుమతి చేసుకునే పేద దేశాలు దయనీయ పరిస్థితులను ఎదుర్కొనే ప్రమాదం ఉంది. మరోవైపు యూరియా ఉత్పత్తికి అవసరమైన ద్రవరూప సహజ వాయువు ఎల్ఎన్జీ ని భారత్ కొన్నేళ్లుగా ఖతార్ నుంచి దిగుమతి చేసుకుంటోంది. ప్రస్తుతం ఆ దేశం నుంచి ఎల్ఎన్జీ సరఫరా నిలిచిపోయింది. ప్రధాన ఆహార ఎగుమతిదారులైన భారత్, థాయ్‌లాండ్, బ్రెజిల్ వంటి దేశాలలోని కొన్ని యూరియా కంపెనీలు ప్లాంట్లను మూసివేసే పరిస్థితులు నెలకొన్నాయి. ప్రపంచ దేశాల్లో ఆహార ధాన్యాలు, వ్యవసాయ ఉత్పత్తుల ధరలు కూడా పెరగనున్నాయి. ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా ఆహార ధరలు సుమారు 2శాతం పెరిగే అవకాశం ఉందని డబ్ల్యూహెచ్ ఓ హెచ్చరిస్తోంది.






Total views : 77838