విజయనగరం జిల్లా గరివిడి మండలంలో భారీ భూ కుంభకోణం జరిగిందన్న ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. వెదుళ్లవలస మాజీ సర్పంచ్ గుడివాడ తమ్మినాయుడు, అప్పటి తహశీల్దార్ బంగార్రాజు కుమ్మక్కై సుమారు 24 ఎకరాల ప్రభుత్వ భూమిని నకిలీ రికార్డుల ద్వారా వారి కుటుంబ సభ్యుల పేరిట నమోదు చేయించుకున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. వెదుళ్లవలస, బాగువలస రెవెన్యూ గ్రామాల పరిధిలో ఉన్న ప్రభుత్వ భూములు, కొండలు, గుట్టలను సైతం వదలకుండా 2005, 2007 సంవత్సరాల నాటి అసైన్మెంట్ పత్రాలను ఆధారంగా చూపిస్తూ అక్రమంగా మ్యుటేషన్లు చేయించి ఆన్లైన్ రికార్డుల్లో నమోదు చేసినట్లు చెబుతున్నారు.
వెదుళ్లవలస గ్రామంలో 2.54 ఎకరాలు, బాగువలస గ్రామంలో 21.55 ఎకరాలు కలిపి మొత్తం 24.09 ఎకరాల భూమి మాజీ సర్పంచ్ కుటుంబ సభ్యుల పేరిట నమోదు అయినట్లు ఆరోపణలు ఉన్నాయి. భార్య, తండ్రి, సోదరులు, సోదరీమణుల పేర్లపై ఖాతాలు సృష్టించి ప్రభుత్వ భూమిని స్వాహా చేశారంటూ స్థానికులు మండిపడుతున్నారు.ప్రభుత్వ భూముల రక్షణకు ఉన్న చట్టాలను పక్కనపెట్టి అక్రమంగా రికార్డులు మార్చారని, ఈ వ్యవహారంలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. జిల్లా కలెక్టర్, రెవెన్యూ ఉన్నతాధికారులు వెంటనే విచారణ జరిపి అక్రమ మ్యుటేషన్లను రద్దు చేసి ప్రభుత్వ భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవాలని కోరుతున్నారు.గరివిడి మండలంలో కలకలం రేపుతున్న ఈ భూ వ్యవహారంపై అధికార యంత్రాంగం ఎలా స్పందిస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.




Total views : 92397