పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి నియోజవర్గంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష నాయకులకు మూడోసారి భంగపాటు తప్పదని ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి స్పష్టం చేశారు. శనివారం పెద్దపల్లి మండలం పెద్ద బొంకూరు గ్రామంలో గడప గడపకు వెళ్లి, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను, నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి పనులను వివరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారని ప్రశ్నించారు. ప్రజలు మరోసారి కాంగ్రెస్ ను నమ్మి ఓట్లు ఎలా వేస్తారన్నారు. కేసీఆర్ ను మూడోసారి సీఎం చేయడం ఖాయమని, పెద్దపల్లి నియోజవర్గంలో సైతం గులాబీ జెండా ఎగురుతుందన్నారు. వారంటీ లేని కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు ఇచ్చినా 60 గ్యారంటీలు ఇచ్చినా ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితి లేదన్నారు. సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్ స్థానంలో ఉందని, ప్రపంచంలో ఎక్కడా కూడా లేని పథకాలను కేసీఆర్ అందిస్తున్న అందిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి అండగా నిలవాలని అభ్యర్థించారు.
Brs
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎక్స్ (ట్విట్టర్) వేదికగా అభిమానులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా పలువురు నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. సర్వేలలో ప్రతిపక్షాలు గెలిస్తే, ఎన్నికల ఫలితాల మాత్రం బీఆర్ఎస్ గెలుస్తుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో బీఆర్ఎస్ 95 నుంచి 105 స్థానాల్లో గెలుస్తుందన్నారు. హంగ్‌కు ఎలాంటి ఆస్కారం లేదన్నారు. 2018లోనూ ఇలాగే చేశారన్నారు. కేంద్రమంత్రి అమిత్ షా బీసీ ముఖ్యమంత్రి అని ప్రకటించడం కేవలం ఎన్నికల గిమ్మిక్కు అన్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో తన పాత్ర ఏమీ లేదన్నారు. బీఆర్ఎస్, బీజేపీల మధ్య ఎలాంటి డీల్ లేదన్నారు. చంద్రబాబు అరెస్టుపై మీ సమాధానం ఏమిటి? అని ఓ నెటిజన్ అడగగా.. ఈ వయస్సులో ఆయనకు అలా జరగడం దురదృష్టకరమన్నారు. ఆయన కుటుంబం పడుతున్న బాధను తాను అర్థం చేసుకోగలనన్నారు. వారి కుటుంబానికి ఎమ్మెల్సీ కవిత సానుభూతి తెలిపారు.
రాష్ట్రాన్ని నిరుద్యోగ తెలంగాణగా మార్చిన బీఆర్ఎస్ సర్కార్‌కు ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని ఏఐసీసీ సెక్రటరీ, సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు వంశీచంద్ రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్రంలో నిరుద్యోగ రేటు 15.1 శాతం ఉందని, నిరుద్యోగుల పట్ల కేసీఆర్, కేటీఆర్‌కు ఎంత చిత్తశుద్ధి ఉందో ఈ లెక్కలే చెప్తున్నాయన్నారు. గాంధీ భవన్లో మీడియాతో ఆయన మాట్లాడారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల కోసం అమలు చేసిన ప్రణాళికలను బీఆర్ఎస్ ప్రభుత్వం తుంగలో తొక్కిందన్నారు. బిస్వాల్ కమిటీ నివేదిక ప్రకారం 1.91 లక్షల ఉద్యోగ ఖాళీలున్నప్పటికీ వాటిని భర్తీ చేయడంలో సర్కార్ విఫలమైందని మండిపడ్డారు. ఉద్యోగాలు రాక ఆత్మహత్య చేసుకున్న 3,607 మంది ఆత్మలకు శాంతి కలగాలంటే కేసీఆర్ ప్రభుత్వాన్ని అంతమొందించాల్సిందేనని తేల్చి చెప్పారు.
సోనియాగాంధీని గతంలో రేవంత్ రెడ్డి బలిదేవత అన్నారని కేటీఆర్ గుర్తు చేశారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ కుప్పకూలిందని.. తెలంగాణలోనైనా నాలుగు సీట్లు వస్తాయని కాంగ్రెస్ పార్టీ ఆరాటపడుతోందన్నారు.మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో భాగంగా శనివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్లో మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. రాజకీయ స్వార్థం కోసం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందన్నారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారన్న ఆరోపణలు సరికాదని కేటీఆర్ అన్నారు. రుణాలు తెచ్చి ఉత్పత్తి రంగాల్లో పెట్టుబడులు పెట్టామన్నారు. రుణాల మొత్తాన్ని సాగునీటి రంగం, మిషన్ భగీరథకు వినియోగించామన్నారు. విద్యుత్ రంగంలో సంస్కరణల కోసం రుణాలు తెచ్చామన్నారు. 9 ఏళ్ల క్రితంతో పోలిస్తే తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. తలసరి ఆదాయంలో తెలంగాణ నెంబర్ వన్ గా ఉందన్నారు. తెలంగాణది సమ్మిళిత, సమగ్ర, సమీకృత మోడల్ అన్నారు. 9 ఏళ్లలో కరువు లేదు, కర్ఫ్యూ లేదన్నారు. రాష్ట్రంలో ఎలాంటి వివక్ష లేదన్నారు. పేదరికంలో దేశం నైజీరియాను దాటిపోయింది. కాంగ్రెస్ 6 గ్యారంటీలతో తెలంగాణ ప్రజలను మోసం చేసేందుకు యత్నిస్తోందన్నారు. పర్యావరణాన్ని కాపాడుతూనే పారిశ్రామికీకరణలో దూసుకుపోతున్నామన్నారు. కాంగ్రెస్ చేసిన పాపానికి తెలంగాణ 58 ఏళ్లు బాధపడిందన్నారు. 2004 నుంచి 2014 మధ్య కాంగ్రెస్ 24 వేలు ప్రభుత్వ ఉద్యోగాలను మాత్రమే ఇచ్చిందన్నారు. 2014 నుంచి ఇప్పటి వరకు లక్షా 30 వేల ఉద్యోగాలు ఇచ్చామన్నారు. 9 ఏళ్ల అభివృద్ధి ఇప్పుడు ప్రజలకు కనిపిస్తోందన్నారు. తాము ప్రజలకు ప్రగతి నివేదికలు సమర్పిస్తున్నామన్నారు. ఐటీలో హైదరాబాద్, బెంగళూరును మించిపోయిందన్నారు.
ఎన్నికల్లో గెలవడానికి కొంతమంది పచ్చి అబద్దాలు చెబుతున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ మండిపడ్డారు. వర్ధన్నపేట రింగ్ రోడ్డు కోసం ల్యాండ్ ఫూలింగ్ చేస్తారని పచ్చి అబద్దాలు ప్రచారం చేస్తున్నారన్నారు. ఆరూరి రమేశ్‌పై నేరుగా గెలిచే దమ్ము లేనోళ్లు ఈ ప్రచారాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ల్యాండ్ పూలింగ్ చేయబోమని ముఖ్యమంత్రిగా నేను హామీ ఇస్తున్నానన్నారు. వర్ధన్నపేట నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని ప్రంసగించారు. ఓటు వేసే ముందు ఆగం కావొద్దు.. ఆలోచించి ఓటేయాలి అని వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజలకు కేసీఆర్ పిలుపునిచ్చారు. 160 కోట్లతో వర్ధన్నపేట పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకున్నామని కేసీఆర్ తెలిపారు. ఇవాళ కొంత మంది నాయకులు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని కేసీఆర్ ధ్వజమెత్తారు. ఇపుడు ఓట్ల కోసం వస్తున్నవారికి తెలంగాణపై అవగాహన లేదన్నారు. ఆరూరి రమేశ్ ఆధ్వర్యంలో వర్ధన్నపేట అన్ని రంగాల్లో బ్రహ్మాండమైన అభివృద్ధి సాధించిందన్నారు.
కొందరు పదవుల కోసం పార్టీలు మారుతున్నారని, కానీ ఏ పార్టీ ప్రజలకు ఏం చేసిందో ఆలోచించి ఓటేయాలని సీఎం కేసీఆర్ కోరారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఖమ్మం జిల్లా పాలేరు సభలో ప్రసంగించారు. సభలో సీఎం కేసీఆర్ తనదైన శైలిలో ప్రతిపక్ష పార్టీలపై ధ్వజమెత్తారు. సర్వజనుల సంక్షేమ కోసం పని చేసిన వారిని గెలిపించండి. బీఆర్ఎస్ వచ్చిన తర్వాతే భక్త రామదాసు ప్రాజెక్టు పూర్తి చేశామన్నారు. పాలేరును ఏ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. 3 కోట్ల టన్నుల వరిధాన్యం తెలంగాణ రైతులు పండిస్తున్నారన్నారు. పొరపాటున కాంగ్రెస్ గెలిస్తే రైతుబంధు, దళితబంధు నిలిచిపోతాయని హెచ్చరించారు. పాలేరు ప్రజలకు ఉపేందర్‌రెడ్డి ఉండటం అదృష్టమన్నారు. గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి మూలన కూర్చొన్న తుమ్మలను తీసుకొచ్చి మంత్రిని చేశామని గుర్తుచేశారు.తుమ్మల వల్ల పార్టీకి ఒరిగిందేమీ లేదని, ఇంకా పార్టీకి ఆయన నష్టం చేశాడన్నారు. ఉపేందర్‌రెడ్డిని గెలిపిస్తే పాలేరు అంతటా దళితబంధు ఇస్తామన్నారు. రేషన్‌కార్డుదారులందరికీ వచ్చే మార్చి నుంచి సన్నబియ్యం పంపిణీ చేస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు.
పాలేరు ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నీ అబద్దాలే మాట్లాడారని, ఇది ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం క్యాంప్ కార్యాలయంలో మాట్లాడుతూ… 2014 ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ ఒక్క కొత్తగూడెం మాత్రమే గెలిచిందని, దీంతో పార్టీ బలోపేతం కోసం నన్ను బతిమాలి పార్టీలో చేర్చుకొలేదా? అని ప్రశ్నించారు. నేను పార్టీలో చేరిన రోజూ జిల్లా పరిషత్ చైర్మన్ డీసీఎంఎస్ చైర్మన్, జెడ్పీటీసీలు, ఎంపీపీలు వందల మంది సర్పంచ్‌లు పార్టీలో చేరింది నిజంకాదా? డిపాజిట్లు రాని పార్టీని జిల్లాలో నేను బలోపేతం చేసింది నిజం కాదా? అని నిలదీశారు. 40 ఏళ్ల సహవాసంలో నా నిబద్ధత ఏమిటో కేసీఆర్‌కు తెలుసునన్నారు. అలాంటి మీరు పార్టీ మారిన పువ్వాడ అజయ్ కుమార్‌కు ప్రభుత్వ భూములు, పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డికు కాంట్రాక్ట్‌లు ఇచ్చి… వారిని పక్కన పెట్టుకొని నాపై విమర్శలు చేస్తారా? నేను పార్టీ మారితే మీరుచేసిన వ్యాఖ్యలు జిల్లా ప్రజానీకం అంతా చూస్తున్నారన్నారు. కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు బాధాకరమన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకు తాను ఎంతగానో రుణపడి ఉంటానని, ఇక్కడి ప్రజల కోసం మీ రాజకీయ విమర్శలను భరిస్తానన్నారు. తెలంగాణ కల సాకారం చేసిన సోనియా గాంధీకి ఇచ్చిన మాటను కేసీఆర్ తప్పారని, మానసిక దౌర్బల్యంతోనే కేసీఆర్ తనపై విమర్శలు చేశారన్నారు. నా 40 ఏళ్ల రాజకీయ జీవితం అంతా తెలిసి కూడా నీ స్వార్థం కోసం మాట్లాడతావా అని మండిపడ్డారు. తాను బీఆర్ఎస్లో చేరిన సమయంలో అక్కడకు వచ్చిన వారిని చూసి కేటీఆర్ అన్న వ్యాఖ్యలు గుర్తుకు లేవా? అన్నారు. మనం పార్టీ మారినా ఇంతమంది మనతో రారని కేటీఆర్ అనలేదా? తుమ్మలతో బీఆర్ఎస్ పార్టీలోకి ప్రభంజనంలా వచ్చి చేరారని చెప్పింది మర్చిపోయావా? పదవుల కోసం కాదు సీతారామ, భక్త రామదాసు ప్రాజెక్టుల కోసమే తాను పార్టీలో చేరుతున్నట్లు ఆ రోజే చెప్పానన్నారు. భక్త రామదాసు ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో తనను అపర భగీరథుడని పొగిడిన పొగడ్తలు జిల్లా ప్రజానీకం చూశారని, పాలేరులో నా ఓటమికి నీ కుమారుడే కారణమన్న విషయం మీకు తెలుసు అన్నారు. మా కత్తితో మేమే పొడుచుకున్నామని మీరే మీడియా ముఖంగా చెప్పారు, ఎంపీ ఎన్నికల్లో నామా నాగేశ్వరరావు గెలుపు కోసం, స్థానిక సంస్థల ఎన్నికల్లో, ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపులో నా పాత్ర లేదా? అని తుమ్మల ప్రశ్నించారు. ఓడిపోయి మూలన కూర్చుంటే మంత్రి పదవి ఇచ్చానని, పార్టీ కోసం చేసింది నేను సున్నా అని చవకబారు విమర్శలు చేస్తావా? అని ధ్వజమెత్తారు.
బిత్తిరి సత్తి అలియాస్ రవికుమార్ ముదిరాజ్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. శుక్రవారం తెలంగాణ భవన్లో మంత్రి హరీశ్ రావు సమక్షంలో గులాబీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మంత్రి హరీశ్ రావు వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు
తెలంగాణ కోసం కేసీఆర్ మొన్న ఓ మాట అన్నారని, తనకు ఆరోగ్యం బాగా లేనప్పుడు ముదిరాజ్ తల్లి పాలు తాగానని చెప్పారని గుర్తు చేశారు. ఈ రోజు మనకు కొట్లాడేవాడు కావాలన్నారు. ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపి, చావునోట్లో తలపెట్టి కేసీఆర్ తెలంగాణ తీసుకు వచ్చారన్నారు. బిత్తిరి సత్తి మీద దాడి చేస్తే సీఎం ఆఫీస్ స్పందించిందన్నారు. మనం నీళ్లిచ్చిన కేసీఆర్ వెంట ఉండాలని, ఆయన హ్యాట్రిక్ సీఎం కావడం ఖాయమన్నారు. హరీశ్ రావు వంటి బాహుబలిలు ఉండగా ఢోకా లేదన్నారు.
బీసీలను కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎదగనివ్వలేదని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ విమర్శలు చేశారు. సూర్యాపేట జనగర్జన బహిరంగ సభలో అమిత్ షా బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ సామాజికవర్గానికి చెందిన వ్యక్తిని ముఖ్యమంత్రిని చేస్తామని సభలో ప్రకటించడంపై ఆయన హర్షం వ్యక్తంచేశారు. తెలంగాణ ప్రజలకు ఇది సువర్ణ అవకాశంగా లక్ష్మణ్ ఒక ప్రకటనలో తెలిపారు. మేధావులు, వివిధ సంఘాల నాయకులు ఆలోచించి వచ్చే ఎన్నికల్లో బీజేపీకి మద్దతుగా నిలవాలని కోరారు.
నల్గొండ జిల్లా తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ ను గోరెంట్ల గ్రామస్తులు అడ్డుకున్నారు. మద్దిరాల మండలం గోరంట్ల గ్రామంలో గాదరి కిషోర్ ప్రచారం చేశారు. అయితే అభివృద్ది ఎక్కడంటూ గ్రామస్ధులు అడ్డుకుని ప్రశ్నించారు. ప్రచారం కోసం వచ్చిన బీఆర్ఎస్ కార్యకర్తల పై దాడి చేశారు. అనంతరం అక్కడకు చేరుకున్నా పోలీసులకు, గ్రామస్తులకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. టీఆర్ఎస్ నాయకులకే పోలీసులు సపోర్ట్ చేస్తున్నారని గ్రామస్తులు ర్యాలీ నిర్వహించారు. దీంతో ఎమ్మెల్యే గ్రామస్తులపై అసహనం వ్యక్తం చేశారు. గ్రామస్థులపై ఉంటే ఉండండి…లేకపోతే వెళ్లిపోండంటూ విరుచుకుపడ్డారు. తనను అడగాల్సింది సభలోనని…ఇదేమీ సభ కాదని అన్నారు.




Total views : 92158