తెలంగాణలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియ తుది దశకు చేరుకున్న వేళ… ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. తన సొంత నియోజకవర్గం కొడంగల్లో పర్యటించిన సీఎం… స్వయంగా ఎన్యూమరేషన్ ఫారం నింపి బూత్ లెవల్ అధికారికి అందజేశారు. అనంతరం స్థానిక ప్రజాప్రతినిధులు, బీఎల్ఓలు, అధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించి ప్రక్రియ పురోగతిని తెలుసుకున్నారు. ఇదే వేదికగా కేంద్ర ప్రభుత్వ వైఖరిపై విమర్శలు గుప్పించిన సీఎం… దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన నీట్ ఆందోళనలపైకూడా స్పందించారు.
తెలంగాణలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంటున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గమైన కొడంగల్లో విస్తృతంగా పర్యటించారు. ప్రజలు ఓటరు జాబితాలో తమ వివరాలను సక్రమంగా నమోదు చేసుకోవాలని ప్రభుత్వం ఇప్పటికే పిలుపునిచ్చిన నేపథ్యంలో… సీఎం స్వయంగా ఎన్యూమరేషన్ ఫారం నింపి బూత్ లెవల్ అధికారికి అందజేయడం ద్వారా ప్రజలకు ఒక సందేశం ఇచ్చారు..
సమావేశంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, బీఎల్ఓలు, ఎన్నికల సిబ్బందితో సీఎం ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. ఇంటింటి సర్వే ఎంతవరకు పూర్తయింది… ఎన్ని ఫారాలు సేకరించారు… ఎక్కడైనా సమస్యలు ఎదురవుతున్నాయా… ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తోంది… అనే అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియ పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా కొనసాగాలని… అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా వెంటనే పరిష్కరించాలని సూచించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు స్పష్టం చేశారు.
సమీక్ష అనంతరం దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తున్న అంశాలపై స్పందించారు. నీట్ అంశంపై కొనసాగుతున్న ఆందోళనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టారు. విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడిన పరీక్షల విషయంలో కేంద్రం మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, పారదర్శకతకు ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రుల్లో నెలకొన్న అనుమానాలను నివృత్తి చేసేలా కేంద్రం చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రధానిని టార్గెట్ చేస్తూ విమర్శనాస్త్రాలు గుప్పించారు.
కొడంగల్ పర్యటన ద్వారా ఒకవైపు ఓటరు జాబితా సవరణ ప్రక్రియపై ప్రజల్లో అవగాహన పెంచడంతో పాటు… మరోవైపు ఎన్నికల వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేయాలనే సంకల్పాన్ని సీఎం రేవంత్ రెడ్డి వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా SIR ప్రక్రియ విజయవంతంగా పూర్తయ్యేలా ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు.