హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ సంస్థల ఆగడాలకు హద్దూ అదుపూ లేకుండా పోతోంది. చిన్న చితకా సంస్థల నుంచి మొదలుపెట్టి… బడా బడా కన్స్ట్రక్షన్ కంపెనీల వరకూ అందరూ నిబంధనలను తుంగలో తొక్కేవారే. కొంచెం ఎక్కువ… కొంచం తక్కువ అనే తప్ప… ఉల్లంఘనలకు పాల్పడని వారంటూ లేరంటే అతిశయోక్తి కాదు. ఇప్పటికే అనేక బడా సంస్థల మోసాలను సీవీఆర్ న్యూస్ బట్టబయలు చేసింది. వంశీరామ్ బిల్డర్స్ నిర్మిస్తున్న మాన్‌హట్టన్ ప్రాజెక్టులోనూ ఇలాంటి అవకతవకలే బయటపడ్డాయి. ఖాజాగూడలోని నానక్ రామ్ గూడ రోడ్డులో దాదాపు 14 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న మాన్‌హట్టన్ మెగా ప్రాజెక్ట్ కోసం ప్రభుత్వ భూములు, చెరువు కబ్జా చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సర్వే నెంబర్ 27 లో ఉన్న ప్రభుత్వ భూమిలోనే ఈ నిర్మాణాలు జరుగుతున్నాయని తెలుస్తోంది…
సోహిని బిల్డర్స్‌తో కలిసి ఈ మెగా వెంచర్‌ను వంశీరామ్ బిల్డర్స్ సంస్థ అభివృద్ధి చేస్తోంది. 27/2 సర్వే నంబర్లోని 14 ఎకరాల్లో ఈ వెంచర్ నిర్మిస్తుండగా… అందులో చాలా వరకు ప్రభుత్వ, చెరువు భూములున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. మిగతా భూమి కూడా వివాదాల్లోనే ఉందని వారు చెబుతున్నారు. వంద సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో తమ తాత తండ్రులు ఇక్కడ వ్యవసాయం చేశారని… కానీ ఆ తర్వాతి కాలంలో కొంతమంది వ్యాపారవేత్తలు అధికారులతో కుమ్ముక్కై భూమిని అన్యాక్రాంతం చేశారని చెబుతున్నారు. ప్రభుత్వానికి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా తమ గోడు ఎవరూ వినలేదని… కళ్లెదుటే భూములు పోతుంటే కడుపు రగిలిపోయి చూస్తున్నామని వారు చెబుతున్నారు. రెవెన్యూ అధికారులను మచ్చిక చేసుకున్న వంశీరామ్ యాజమాన్యం భూములను తమ ఆధీనంలోకి తెచ్చుకుని.. మాన్ హట్టన్ పేరుతో వెంచర్ నిర్మిస్తున్నారని చెబుతున్నారు…
మరోవైపు కోర్టులో కేసులు ఉన్నప్పటికీ వంశీరామ్ బిల్డర్స్…. వెంచర్ నిర్మాణాన్ని కొనసాగించడంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఐలాపూర్‌లో ఇదే రీతిలో ప్రభుత్వ భూములను కబ్జా చేసి కొందరు భవనాలను నిర్మించారు. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించారని పలుమార్లు హెచ్చరించినా ఎవరూ వినిపించుకోలేదు. దాని పర్యవసానం అందరూ చూసిందే. హైడ్రా అధికారులు వాస్తవాలను గుర్తించి.. అక్రమ భవనాన్ని కూల్చేశారు. ఇప్పుడు వంశీరామ్ బిల్డర్స్‌కు కూడా భవిష్యత్తులో ఇదే పరిస్థితి ఎదురవుతుందేమో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కోర్టు నుంచి ఎలాంటి క్లియరెన్సులు రాకముందే నిర్మాణాలు పూర్తి చేస్తే… భవిష్యత్తులో అవి ప్రభుత్వ భూములని తేలితే పరిస్థితి ఏంటని.. మాన్ హట్టన్ వెంచర్లో ఫ్లాట్లు కొన్నవారు ప్రశ్నిస్తున్నారు…




Total views : 61777