Thursday, September 10, 2026
News Navigation
Thursday, September 10, 2026
News Navigation

Breaking

Thursday, September 10, 2026
Home Latest News 40మీటర్ల లోతుతో నిర్మాణానికి నిపుణుల సిఫార్సు …

40మీటర్ల లోతుతో నిర్మాణానికి నిపుణుల సిఫార్సు …

by CVR NEWS

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ బ్యారేజీ ఎగువ, దిగువ భాగంలో 40 మీటర్ల లోతుతో డయాఫ్రం వాల్‌ నిర్మించాలని నిపుణులు నిర్ధారించారు. ఈ వాల్‌ నిర్మిస్తేనే బ్యారేజీ నాలుగు కాలాలపాటు ఉంటుందన్న అంచనాకు వచ్చారు. వాస్తవానికి బ్యారేజీలకు తొలుత చేసిన డిజైన్‌ ప్రకారం షీట్‌పైల్స్‌ ఉపయోగించాలని ఉండగా… నిర్మాణం మధ్యలో సీకెంట్‌ పైల్స్‌ వాడారు. దాంతో సీకెంట్‌ పైల్స్‌ను సరిగా అమర్చకపోవడం వల్లే బ్యారేజీ దిగువ భాగం నుంచి ఇసుక జారి.. మేడిగడ్డలో 12 పిల్లర్లు ఉన్న ఏడో బ్లాకు కుంగిందని జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ నిపుణుల కమిటీ నిర్ధారించింది. విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విచారణలోనూ, జస్టిస్‌ పినాకిచంద్ర ఘోష్‌ నివేదికలోనూ దీనిని గుర్తించారు. బ్యారేజీ శాశ్వత మరమ్మతుల్లో భాగంగా 40 మీటర్ల లోతుతో డయాఫ్రం వాల్‌ కడితే.. ఇసుక జారడం ఆగిపోతుందని నిపుణులు నిర్ధారణకు వచ్చారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నిర్వహించిన సమీక్షలోనూ ఇదే అంశం చర్చకు వచ్చింది. కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణ డిజైన్లు అందించడానికి ఎంపికైన ఆఫ్రీ ఇండియా సంస్థ డయాఫ్రం వాల్‌ ఒక్కటే బ్యారేజీని కాపాడగలదని అభిప్రాయపడినట్లు సమాచారం. భూ భౌతిక, భూ సాంకేతిక పరీక్షల అనంతరం నివేదిక అందిన తర్వాత దీని నిర్మాణం చేపట్టవచ్చని భావిస్తున్నారు. ఇక మేడిగడ్డతోపాటు అన్నారం, సుందిళ్లలో స్టిల్లింగ్‌ బేసిన్‌ .. ప్రవాహ ఉధృతికి అనుగుణంగా లేదని గుర్తించారు. దాంతో మూడు బ్యారేజీల్లోనూ స్టిల్లింగ్‌ బేసిన్‌ను విస్తరించనున్నారు. వచ్చే అక్టోబరు నుంచి ఈ పనులు చేపట్టనున్నారు.

ఒక్క మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణకే దాదాపు రూ.2500 కోట్ల దాకా అవుతాయని అంచనాలున్నాయి. డయాఫ్రం వాల్‌ పనులకే రూ.1200 కోట్ల నుంచి రూ.1500 కోట్ల దాకా అయ్యే అవకాశాలున్నాయి. అయితే డయాఫ్రం వాల్‌ నిర్మించాలంటే బ్యారేజీ ఎగువ, దిగువ భాగంలో కాఫర్‌ డ్యామ్‌ కట్టాలి. దీనికి రూ.400 కోట్లు, బ్యారేజీలోని ఏడో బ్లాకు పునరుద్ధరణకు రూ.500 కోట్ల దాకా అవుతాయని అంచనా వేస్తున్నారు. మరోవైపు మేడిగడ్డబ్యారేజీలోని మూడు బ్లాకులు దెబ్బతిన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. దాంతో ఈ మూడు బ్లాకులను శాశ్వతంగా తొలగించి, వాటి స్థానంలో కొత్త బ్లాకులు కట్టాలా? లేక ఏడో బ్లాకును మాత్రమే తొలగించాలా? అనేది పరీక్షల ద్వారా తేలనుంది. 6వ బ్లాకులో 12 పిల్లర్లు ఉండగా.. 4 పిల్లర్లు దెబ్బతిన్నట్లు, 7 బ్లాకులో 11 పిల్లర్లకుగాను 5 దెబ్బతిన్నట్లు, 8వ బ్లాకులో 8 పిల్లర్లు ఉండగా.. 2 పిల్లర్లు దెబ్బతిన్నట్లు గుర్తించారు. కాగా, బ్యారేజీల పునరుద్ధరణ, మరమ్మతులకు ఖర్చు ఎంతైనా భరించక తప్పని అనివార్యత ఏర్పడిందని ప్రభుత్వం గుర్తించింది. కాళేశ్వరం ప్రాజెక్టు లింక్‌-1లో మేడిగడ్డ బ్యారేజీతోపాటు కన్నెపల్లి పంప్‌హౌస్‌, అన్నారం బ్యారేజీతోపాటు సిరిపురం పంప్‌హౌస్‌, సుందిళ్ల బ్యారేజీతోపాటు గోలివాడ పంప్‌హౌస్‌ ఉన్నాయి. 2016లో బ్యారేజీల నిర్మాణం పూర్తికాగా, 2019 మే నెలలో బ్యారేజీలను ప్రారంభించారు. బ్యారేజీలు పూర్తయిన తర్వాత రెండేళ్లపాటు డి ఫెక్ట్‌ లయబులిటీ కాలంలోనే బ్యారేజీలు దెబ్బతిన్నప్పటికీ.. గత ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యమే ప్రసుత్త సమస్యకు కారణమైందని గుర్తించారు. దాంతో పునరుద్ధరణపై ప్రభుత్వం సీరియ్‌సగా దృష్టి పెట్టింది.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: