పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో భారీ భూ రిజిస్ట్రేషన్ అవకతవకలు వెలుగులోకి రావడం సంచలనంగా మారింది. ప్రభుత్వ ఖజానాకు కోట్ల రూపాయల నష్టం కలిగించారని ఇన్‌చార్జి సబ్ రిజిస్ట్రార్ రమణమూర్తిపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సాలూరు పట్టణ నడిబొడ్డున ఉన్న డగ్లస్ చర్చి భూమికి సంబంధించిన 3.14 సెంట్ల స్థలానికి మార్కెట్ విలువ ప్రకారం సుమారు ఆరు కోట్ల రూపాయల చలానా చెల్లించాల్సి ఉండగా, కేవలం 95 లక్షల రూపాయలతోనే రిజిస్ట్రేషన్ పూర్తి చేశారనే ఆరోపణలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. ఈ వ్యవహారంలో ప్రభుత్వానికి దాదాపు ఐదు కోట్ల రూపాయల నష్టం జరిగిందని ఫిర్యాదుదారులు ఆరోపిస్తున్నారు. అదే సమయంలో భారీ మొత్తంలో లంచాలు తీసుకున్నారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఈ అంశంపై ఎస్టీ న్యాయ సలహాదారు రేగు మహేష్, రిపబ్లికన్ పార్టీ రాష్ట్ర సభ్యుడు గొంప ప్రకాష్ గ్రీవెన్స్‌లో అధికారిక ఫిర్యాదు చేయడంతో వ్యవహారం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. దింతో జిల్లాలో ఈ ఘటన రాజకీయ, సామాజిక వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.
సాలూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో జిల్లా రిజిస్ట్రార్ ఎం. పార్వతి విచారణ చేపట్టడం ఆసక్తికరంగా మారింది. జిల్లాధికారుల ఆదేశాల మేరకు సాలూరుకు చేరుకున్న ఆమె, తప్పుడు రిజిస్ట్రేషన్లపై పలు ఆధారాలను పరిశీలించారు. ఫిర్యాదుదారులు రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన పత్రాలు, మ్యూటేషన్ వివరాలు, చలానా లెక్కలు చూపిస్తూ అక్రమాలు జరిగాయని ఆరోపించారు. ముఖ్యంగా ఒక్కరోజులోనే మ్యూటేషన్ పూర్తి చేసి అదేరోజు రిజిస్ట్రేషన్ ఎలా జరిగిందని ఎస్టీ న్యాయ సలహాదారు రేగు మహేష్, గొంప ప్రకాష్ జిల్లా రిజిస్ట్రార్‌ను ప్రశ్నించారు. సబ్ రిజిస్ట్రార్ సెలవులో ఉన్న సమయంలో ఇన్‌చార్జిగా వ్యవహరించిన రమణమూర్తి తప్పుడు రిజిస్ట్రేషన్ల ద్వారా కోట్ల రూపాయలు ముడుపులు తీసుకున్నారని ఫిర్యాదుదారులు ఆరోపిస్తున్నారు. మరోవైపు, ఈ వ్యవహారంపై వార్తలు రాసిన జర్నలిస్టులపై అట్రాసిటీ కేసులు పెడతామని బెదిరింపులు వచ్చాయని, అందుకు సంబంధించిన ఆడియోలను కూడా జిల్లా రిజిస్ట్రార్‌కు వినిపించినట్లు సమాచారం.
ఇక ఈ వివాదంపై స్పందించిన ఇన్‌చార్జి సబ్ రిజిస్ట్రార్ రమణమూర్తి మాత్రం తనపై వచ్చిన ఆరోపణలను పూర్తిగా ఖండిస్తున్నారు. తాను అన్ని నిబంధనలు పాటిస్తూ, సరైన పత్రాలు ఉన్నప్పుడే రిజిస్ట్రేషన్లు నిర్వహించానని ఆయన చెబుతున్నారు. కొందరు వ్యక్తులు వ్యక్తిగత అక్కసుతో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు.
దీనిపై సబ్ రిజిస్ట్రార్ కూడా స్పందించారు .తాను సేవలో ఉన్నప్పుడు ఈ వ్యవహారం జరిగిందని తెలిపారు .ఇంతకు ముందు తన వద్దకు ఇలాంటి రిజిస్ట్రేషన్ కోసం ఎవరు రాలేదని అన్నారు .
అయితే మరోవైపు రమణమూర్తిపై గతంలో కూడా పలు పత్రికల్లో కథనాలు వెలువడినట్లు ఫిర్యాదుదారులు చెబుతున్నారు. రిజిస్ట్రార్ కార్యాలయంలో కుల ప్రాతిపదికన వ్యవహారాలు నడుస్తున్నాయని, అవినీతి ద్వారా కోట్ల రూపాయలు కూడబెట్టారని ఆరోపణలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసు జేసీ కోర్టులో విచారణ దశకు చేరుకోవడం గమనార్హం. విచారణలో నిజానిజాలు వెలుగులోకి రావాలని ప్రజలు కోరుతున్నారు. ప్రభుత్వ భూములు, చర్చి భూముల రిజిస్ట్రేషన్లలో అక్రమాలు జరిగితే కఠిన చర్యలు తీసుకోవాలని సామాజిక సంస్థలు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.





Total views : 90017