జీతం ఒకచోట.. గీతం మరోచోట అన్నట్లుగా మారింది… రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ నాగేశ్వర్ రాజు వ్యవహారం. ప్రభుత్వ విధులకు నిర్లక్ష్యం వహిస్తూ వారానికి ఒక్కరోజు మాత్రమే డ్యూటీకి హాజరవుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మిగిలిన రోజుల్లో ఆళ్లగడ్డలోని తన సొంత మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌కే ప్రాధాన్యత ఇస్తున్నారంటూ స్థానికులు మండిపడుతున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా విధులకు గైర్హాజరవుతున్న పలువురు ప్రభుత్వ డాక్టర్లపై చర్యలు తీసుకుంటున్న కూటమి ప్రభుత్వం, రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ వ్యవహారంపై ఎందుకు మౌనం వహిస్తోందని స్థానిక ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రాజంపేట జాతీయ రహదారిపైనే ఉండడం… రోజూ ప్రమాదాల బారిన పడిన ఎమర్జెన్సీ కేసులు వస్తున్నప్పటికీ ఆసుపత్రిలో కీలక అధికారి అందుబాటులో లేకపోవడం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. సూపరింటెండెంట్ నాగేశ్వర్ రాజుపై ఇప్పటికే జిల్లా DCHS అధికారి ఉన్నతాధికారులకు నివేదిక పంపినట్లు సమాచారం.
రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో సూపరింటెండెంట్ గైర్హాజరు కారణంగా వైద్య సేవలు దెబ్బతింటున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఆసుపత్రి పరిపాలనను పర్యవేక్షించాల్సిన సూపరింటెండెంట్ నాగేశ్వర్ రాజుకు అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ పూర్తి సహకారం అందిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ వేతనం తీసుకుంటూనే సొంత ఆసుపత్రి నిర్వహణపై దృష్టి పెట్టడం నిబంధనలకు విరుద్ధమని అంటున్నారు . ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ వెంటనే రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిపై దృష్టి సారించి విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. పేద ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాజంపేట ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.





Total views : 90017