పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ పరిధిలోని మంజూరైన ఇంజనీరింగ్ పోస్టులను సీపీడబ్ల్యూడీ కేడర్ నుంచి వేరు చేసే ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇకపై ఈ పోస్టులను స్వతంత్ర ఢిల్లీ పీడబ్ల్యూడీ ఇంజనీరింగ్ కేడర్‌గా నిర్వహించనున్నారు. ఢిల్లీని వేగంగా అభివృద్ధి చెందుతున్న, సురక్షితమైన, ప్రపంచస్థాయి రాజధానిగా తీర్చిదిద్దే క్రమంలో ఈ నిర్ణయం చారిత్రాత్మక మైలురాయిగా నిలుస్తుందని ఢిల్లీ సీఎంవో పేర్కొంది.
ఇంజనీరింగ్ కేడర్ విభజనతో పరిపాలనాపరమైన వెసులుబాట్లు పెరగడంతో పాటు అభివృద్ధి పనులు మరింత వేగంగా పూర్తయ్యే అవకాశం ఉందని ప్రభుత్వం తెలిపింది. కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంతో ఢిల్లీ పీడబ్ల్యూడీ ఇంజనీరింగ్ సిబ్బంది ఇకపై ప్రత్యేక కేడర్‌గా విధులు నిర్వర్తించనున్నారు. స్వతంత్ర నిర్వహణతో సిబ్బంది బాధ్యతలు, పనుల పర్యవేక్షణ మరింత సమర్థవంతంగా కొనసాగుతుందని అధికారులు భావిస్తున్నారు.
కేడర్ విభజన ప్రక్రియ పూర్తయిన తర్వాత ఢిల్లీలో మౌలిక వసతుల కల్పన, నిర్మాణ రంగ పనుల పర్యవేక్షణ మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా సాగేందుకు అవకాశం ఉంటుందని సీఎంవో తెలిపింది. అభివృద్ధి పనుల్లో జాప్యాన్ని తగ్గించి మెరుగైన ఫలితాలు సాధించేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని పేర్కొంది.