సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన అనే మూడు మూల మంత్రాలతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. సచివాలయానికే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో ప్రజల మధ్య ఉంటూ వారి జీవితాల్లో వెలుగులు నింపడమే అసలైన సుపరిపాలన అని అన్నారు. కోనసీమ జిల్లా పి.గన్నవరం నియోజకవర్గంలోని మాచడవ పండువారిపేటలో నిర్వహించిన ‘మీ భూమి–మీ హక్కు’ గ్రామసభలో పాల్గొన్న చంద్రబాబు.. ప్రతి వారం ప్రజల వద్దకు వెళ్లి వారి బాగోగులు తెలుసుకుంటూ పాలన సాగిస్తున్నామని తెలిపారు. ప్రతినెలా 1వ తేదీన ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందిస్తూ పేదల సమస్యలు తెలుసుకుంటున్నామని చెప్పారు.
భూమికి సంపూర్ణ భద్రత కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రతి నెలా 9వ తేదీన ‘మీ భూమి–మీ హక్కు’ కార్యక్రమం ద్వారా రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్‌బుక్‌లు అందిస్తున్నామని తెలిపారు. పటిష్ఠమైన రీసర్వే ప్రక్రియను చేపట్టి బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ, ఈ-కేవైసీ, క్యూఆర్ కోడ్ వంటి భద్రతా ఫీచర్లతో పాస్‌బుక్‌లు ఇస్తున్నామని వివరించారు. ఇప్పటివరకు 8,234 గ్రామాల్లో రీసర్వే పూర్తి చేసి 36 లక్షల మందికి పాస్‌బుక్‌లు అందించామని, వచ్చే ఏడాది మార్చి నాటికి మరో 8,582 గ్రామాల్లో సర్వే పూర్తి చేసి మొత్తం 56 లక్షల పాస్‌బుక్‌లు అందించడమే లక్ష్యమని వెల్లడించారు.
గత ప్రభుత్వ హయాంలో రెవెన్యూ వ్యవస్థలో జరిగిన అవకతవకలను సరిదిద్దుతున్నామని సీఎం అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 16 లక్షల ఎకరాలను 22ఏ జాబితా నుంచి తొలగించి ప్రజలకు ఊరట కల్పించామని తెలిపారు. భూమి భద్రతతో పాటు నీటి భద్రతకు కూడా ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. గోదావరి నుంచి వెయ్యి టీఎంసీలకు పైగా నీరు సముద్రంలో కలిసిపోతోందని, పోలవరం ప్రాజెక్టు ఆలస్యానికి గత ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. ఈ సందర్భంగా ఈపీడీసీఎల్ ఆధ్వర్యంలో రూ.240 కోట్లతో చేపట్టనున్న గ్రిడ్ ఆధునీకరణ, 3-ఫేజ్ విద్యుత్ సరఫరా పనులకు సంబంధించిన శిలాఫలకాన్ని చంద్రబాబు ఆవిష్కరించారు.